సాక్షి, శ్రీకాకుళం: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రధాని మోదీకి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేశారు’’ అని లేఖలో ధర్మాన పేర్కొన్నారు.
‘‘మీరు తీసుకువచ్చిన గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి చారిత్రాత్మక నిర్ణయం. 566. 23 కోట్ల రూపాయలతో 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తి చేశారు. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ, మోడరనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో మీరు ఉన్నారు. 'భూమి' అనే రాష్ట్ర జాబితాలోని అంశంపై చేసిన కృషి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది.
భూ రికార్డులను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ తో కలిసి ఈ ముసాయిదా చట్టం తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. పౌరుల మధ్య వివాదరహిత సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ చర్యలు మీ ప్రభుత్వం చేపట్టింది. మీరు తెచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది (AP LAND TITLING ACT 2023 (ACT 27 of 2023)ను 31.10.2023).
2024లోచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ప్రతిపాదించిన ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులతో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ చట్టం అమలును సమీక్షించాలి’’ అని ధర్మాన ప్రసాదరావు లేఖలో కోరారు.


