
ఇంద్రకీలాద్రిపై భక్తులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. అమ్మవారి దర్శనం సంగతి అటుంచితే.. క్యూలోనే గంటల తరబడి నిరీక్షించి నీరసించిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, వారి తల్లిదండ్రుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దసరా ఉత్సవాల్లో సాధారణ భక్తులే తమ ప్రాధాన్యమంటూ ఊదరగొట్టిన నాయకులు, ఆలయ, జిల్లా అధికారుల మాటలు నీటి మూటలే అయ్యాయి. వీఐపీ దర్శనాల పేరుతో అడ్డదారిన అడ్డగోలుగా దర్శనాలకు పంపుతుండటంతో క్యూలోనే భక్తులు తిప్పలు పడుతున్నారు. ఉక్కపోత వాతావరణంతో గాలి కూడా అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంగళవారం ఇలాగే పలువురు సొమ్మసిల్లి పడిపోగా.. వారిని పోలీసులు భూజాలపై మోసుకొని వెళ్లి, వైద్య శిబిరంలో అత్యవసర చికిత్స అందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంబో సేవా కమిటీ సభ్యులు కూడా భక్తుల సేవలో కాకుండా తమకు సంబంధించిన వారికి దర్శనం చేయించే పనిలో నిమగ్నమవడంతో సాధారణ భక్తులు నరకం చూస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ