12 జిల్లాలకు 'రెడ్‌' అలర్ట్‌.. ముంచుకొస్తున్న అర్నాబ్‌ ముప్పు! | Cyclone Arnab likely to become very severe | Sakshi
Sakshi News home page

12 జిల్లాలకు 'రెడ్‌' అలర్ట్‌.. ముంచుకొస్తున్న అర్నాబ్‌ ముప్పు!

Oct 26 2026 5:17 AM | Updated on Oct 26 2026 5:17 AM

Cyclone Arnab likely to become very severe

అత్యంత తీవ్రంగా మారనున్న తుపాను   

కోస్తా ప్రాంతమంతటా ప్రభావం 

140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు   

28న అతి భారీ వర్షాలకు అవకాశం  

అదేరోజు కాకినాడ, యానాం సమీపంలో తీరం దాటొచ్చని అంచనా    

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అర్నాబ్‌ తుపాను ముప్పు ముంచుకొస్తోంది. దీని తీవ్రత ఎక్కువ ఉంటుందనే అంచనాతో 28వ తేదీన 12 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండంగా ఉన్నా.. అంతకంతకూ బలపడి సోమవారానికి తుపానుగా మారనుంది. ఆ తర్వాత కూడా ఇది తీవ్ర, అత్యంత తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. తుపానుగా మారాక దీన్ని అర్నాబ్‌గా పిలుస్తారు. 

ఈ నెల 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య కాకినాడ, యానాం వద్ద అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వాయుగుండం ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, కాకినాడకు 960, మచిలీపట్నానికి 1,060, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

28న 12 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ 
తుపాను ప్రభావంతో ఈ నెల 28న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. 27వ తేదీన కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌  జారీచేశారు. 

ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల 27వ తేదీన 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 27 ఉదయం నుంచి రాష్ట్ర తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి 60 నుంచి 70, సాయంత్రానికి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని వాతావరణశాఖ తెలిపింది. 28న ఉదయానికి గాలులు గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 

కాకినాడ, యానాం వద్ద అలల ముంపు ప్రమాదం 
తుపాను తీరం దాటే సమయంలో కాకినాడ, యానాం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో సాధారణ సముద్రమట్టానికి అదనంగా 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తువరకు సముద్రపు నీరు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో సముద్రం ఈ నెల 28న అత్యంత ప్రమాదకరస్థితికి చేరవచ్చని పేర్కొంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీ–ఒడిశా తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. తుపాను ప్రభావిత తీరప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కోరింది.  

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి 
అర్నబ్‌ తుపాను నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటుచేసుకుని ప్రజలకు అవసరమైన సూచనలు చేయాలని చెప్పారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదని, ఆస్తి నష్టం సాధ్యమైనంత మేర తగ్గించాలని సీఎం సూచించారు. తుపాను నేపథ్యంలో ఆదివారం 10 శాఖలు, జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు.  ప్రజల ఫోన్లకు నిరంతరం సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని ఆదేశించారు.  సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేలా ఏజెన్సీలను సిద్ధం చేయాలని అన్నారు.  

కోనసీమ–యానాం–కాకినాడలో తీరం దాటొచ్చు.. 
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. అక్టోబర్‌ 28 మధ్యాహ్నానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. ప్రస్తుత అంచనాల ప్రకారం కోనసీమ–యానాం–కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటొచ్చని చెప్పారు. ఇప్పుడు విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా ఉందని.. ఇది అక్టోబర్‌ 26 ఉదయానికి తుపానుగా, అదేరోజు రాత్రికి తీవ్ర తుపానుగా, 27న అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని అధికారులు సీఎంకు వివరించారు. ఇక తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు.. కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వేగంతోను వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల్లో సగటున 22–29 సెం.మీ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement