అర్నాబ్ తుపాను అప్‌డేట్స్..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నాబ్’ తుపానుగా బలపడనుండటంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, గంటకు 140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. 28న 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
విద్యాసంస్థలకు సెలవులు..
- ఒడిశాలో రెడ్ అలర్ట్
- ఒడిశాలో 5 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
- గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేయనున్నారు.
- 225 అగ్నిమాపక బృందాలు సిద్ధం
- ఒడిశాలో సహాయక చర్యల కోసం 225 ఫైర్ సర్వీస్ బృందాలతో పాటు 60 ODRAF, 17 NDRF బృందాలను అప్రమత్తం చేశారు.
- అక్టోబర్ 28న గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు.
- మత్స్యకారులకు హెచ్చరిక
- సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు.
నేడు పలు జిల్లాల్లో వర్షాలు..
తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయానికి తుపానుగా,
మంగళవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా,
బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
తూర్పు మధ్య,ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో ప్రయాణిస్తుందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి విశాఖకి 820కి.మీ., కాకినాడకు 910కి.మీ.,మచిలీపట్నానికి 1010కి.మీ.,బాపట్లకు 1080కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. https://t.co/JsAnN8zXDU
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 25, 2026
అర్నాబ్ తుపాను ముప్పు ముంచుకొస్తోంది.
అత్యంత తీవ్రంగా మారనున్న తుపాను
కోస్తా ప్రాంతమంతటా ప్రభావం
140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
28న అతి భారీ వర్షాలకు అవకాశం
కాకినాడ, యానాం సమీపంలో తీరం దాటొచ్చని అంచనా
తుపాను కారణంగా 28వ తేదీన 12 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండంగా ఉన్నా..
అంతకంతకూ బలపడి సోమవారానికి తుపానుగా మారనుంది.
ఆ తర్వాత కూడా ఇది తీవ్ర, అత్యంత తీవ్ర తుపానుగా మారుతుందన్న వాతావరణశాఖ
తుపానుగా మారాక దీన్ని అర్నాబ్‌గా పిలుస్తారు.
👉ఈ నెల 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య కాకినాడ, యానాం వద్ద అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వాయుగుండం ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, కాకినాడకు 960, మచిలీపట్నానికి 1,060, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
28న 12 జిల్లాలకు రెడ్ అలర్ట్
👉తుపాను ప్రభావంతో ఈ నెల 28న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. 27వ తేదీన కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీచేశారు.
👉ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల 27వ తేదీన 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 27 ఉదయం నుంచి రాష్ట్ర తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి 60 నుంచి 70, సాయంత్రానికి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని వాతావరణశాఖ తెలిపింది. 28న ఉదయానికి గాలులు గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
కాకినాడ, యానాం వద్ద అలల ముంపు ప్రమాదం
👉తుపాను తీరం దాటే సమయంలో కాకినాడ, యానాం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో సాధారణ సముద్రమట్టానికి అదనంగా 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తువరకు సముద్రపు నీరు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో సముద్రం ఈ నెల 28న అత్యంత ప్రమాదకరస్థితికి చేరవచ్చని పేర్కొంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీ–ఒడిశా తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. తుపాను ప్రభావిత తీరప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కోరింది.
ఇదీ చదవండి: రాజధాని పనులపై పెత్తనం మళ్లీ సింగపూర్ సంస్థకే!



