రాజధాని పనులపై పెత్తనం మళ్లీ సింగపూర్‌ సంస్థకే! | CRDA issues tender for appointment of a programme management consultancy | Sakshi
Sakshi News home page

రాజధాని పనులపై పెత్తనం మళ్లీ సింగపూర్‌ సంస్థకే!

Oct 26 2026 5:26 AM | Updated on Oct 26 2026 5:26 AM

CRDA issues tender for appointment of a programme management consultancy

ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ నియామకానికి సీఆర్‌డీఏ టెండర్‌

మళ్లీ సుర్బానా–జురాంగ్‌ సంస్థే పీజీఎంసీగా ఎంపికయ్యేలా నిబంధనలు 

కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.67.17 కోట్లు చెల్లించేలా టెండర్‌ నోటిఫికేషన్‌ 

రూ.పది కోట్లు దాటే ప్రతి పని అంచనా వ్యయం పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సింది పీజీఎంసీనే 

అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, తదితరాలను పీజీఎంసీ సమీక్షించాకే పనులు 

సింగపూర్‌ సంస్థను అడ్డుపెట్టుకుని అంచనాలు పెంచేసి.. అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగింత  

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పనులపై పెత్తనాన్ని మళ్లీ సింగపూర్‌ సంస్థ సుర్బానా–జురాంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకే కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్‌ సిద్ధమైంది. అదే సంస్థ ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ(పీజీఎంసీ)గా మరోసారి ఎంపికయ్యేలా నిబంధనలతో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. బిడ్‌ల దాఖలుకు తుది గడువు నవంబర్‌ 5వతేదీ కాగా,  అదే రోజు టెక్నికల్‌ బిడ్‌ తెరవనున్నారు. 

నవంబర్‌ 10న ఆర్థిక బిడ్‌ తెరిచి ఎల్‌–1గా నిలిచే సంస్థను పీజీఎంసీగా ఎంపిక చేయనున్నారు. పీజీఎంసీగా ఎంపికయ్యే సంస్థ మూడేళ్లపాటు సేవలు అందించనుంది. ఆ సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉంటే 12 నెలలకు ఒకసారి చొప్పున రెండుసార్లు అంటే 24 నెలలపాటు పీజీఎంసీగా పొడిగిస్తామని టెండర్‌లో సీఆర్‌డీఏ పేర్కొంది. మూడేళ్ల కాలానికి కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.67,17,19,600 చెల్లిస్తామని తెలిపింది. 

మళ్లీ అదే సంస్థ ఎంపికయ్యేలా... 
2024లో చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని పనుల పేరుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, నాబార్డు నుంచి రూ.7,387.70 కోట్లు సహా అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.47,687 కోట్ల మేర రుణం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణంతో చేపట్టే పనుల పర్యవేక్షణకు 2024 నవంబర్‌ 15న పీజీఎంసీ నియామకానికి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. 

మూడేళ్ల పాటు పని చేసేందుకు రూ.59,77,77,000 కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించాలని కోట్‌ చేసిన సుర్బానా–జురాంగ్‌ సంస్థను పీజీఎంసీగా చంద్రబాబు సర్కార్‌ నియమించింది. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు కాకుండా.. ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌), ఏజీఐసీఎల్‌ (అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) నేతృత్వంలో రూ.52,362.44 కోట్ల విలువైన 102 పనులను కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఇవి కాకుండా మరో రూ.48,549.56 కోట్ల వ్యయంతో 39 పనులు చేపట్టాలని నిర్ణయించింది. 

ఈ పనులు చేపట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంయుక్తంగా మరో రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని.. ఇందుకు సంబంధించిన అనుమతి ప్రక్రియ తుది దశలో ఉందని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే మొత్తం రూ.1,00,912 కోట్ల వ్యయంతో 141 పనులను రాజధానిలో చేపట్టనుంది. పీజీఎంసీ సుర్బానా–జురాంగ్‌ సంస్థ గడువు 2027 జనవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పీజీఎంసీగా అదే సంస్థను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో అదే సంస్థ పీజీఎంసీగా ఎంపికయ్యేలా నిబంధనలతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక.. 
» టెండర్‌లో పేర్కొన్న ఆర్థిక అర్హతలు పరిశీలిస్తే ఇవి కేవలం సుర్బానా–జురాంగ్‌ కోసమే రూపొందించారని ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత మూడేళ్లలో కన్సల్టెన్సీ సేవల ద్వారా వార్షికంగా సగటున కనీసం రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉండాలనే నిబంధన విధించారు. జాయింట్‌ వెంచర్‌(జేవీ)కి అనుమతించినా  లీడ్‌ మెంబర్‌కు కనీసం రూ.60 కోట్ల టర్నోవర్‌ ఉండాలని షరతు విధించారు. దీన్ని బట్టి జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు టెండర్‌లో పాల్గొనకుండా అడ్డుకట్ట వేయడానికే ఈ నిబంధనలు పెట్టారని వెల్లడవుతోంది. 

»  పీజీఎంసీ ఎంపిక ప్రక్రియ కోసం ఎంచుకున్న క్వాలిటీ అండ్‌ కాస్ట్‌ బేస్డ్‌ సెలెక్షన్‌(క్యూసీబీఎస్‌) విధానం అత్యంత లోపభూయిష్టంగా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాంకేతికతకు 80 శాతం, తక్కువ రేటు కోట్‌ చేస్తే  కేవలం 20 శాతం మాత్రమే వెయిటేజీ ఇస్తామని టెండర్‌లో పేర్కొన్నారు. దీనివల్ల తక్కువ ధరకే కన్సల్టెన్సీ సేవలు అందిస్తామని ముందుకొచ్చిన సంస్థలను పక్కనపెట్టి సాంకేతికత, ఇంటర్వ్యూల పేరుతో నచ్చిన సంస్థకు ఎక్కువ మార్కులు కేటాయించి.. ఆ సంస్థకే అధిక ఫీజులు చెల్లించి పీజీఎంసీగా ఎంపిక చేయనున్నారన్నది స్పష్టమవుతోంది.  

» సింగపూర్‌ సంస్థ సుర్బానా–జురాంగ్‌ను మళ్లీ పీజీఎంసీగా ఎంపిక చేయడం కోసమే ముఖ్యనేత కనుసైగల మేరకు ఈ నిబంధనలతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారని నిపుణులు చెబుతున్నారు.

సింగపూర్‌ సంస్థను అడ్డుపెట్టుకుని.. 
» రాజధాని నిర్మాణ పనుల పర్యవేక్షణ, పెత్తనం మొత్తం పీజీఎంసీదే.  
»  రూ.పది కోట్లు అంతకంటే ఎక్కువ అంచనాతో చేపట్టే ప్రతి పని అంచనా వ్యయం పెంచే ప్రతిపాదన ఆమోదం తెలపాల్సింది పీజీఎంసీనే. 
»  అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, సిగ్నేచర్‌ బ్రిడ్జి తదితర పనుల డిజైన్‌లను పీజీఎంసీ సమీక్షించాకే క్షేత్ర స్థాయిలో పనులు చేపట్టాలి. 
» పనుల పరిమాణంలో మార్పు వల్ల రూ.5 కోట్లు కంటే ఎక్కువ మొత్తం చెల్లించాలని కాంట్రాక్టర్‌ చేసిన ప్రతిపాదనను స్క్రూటినీ చేసేది పీజీఎంసీనే. 
» ప్రపంచ బ్యాంకు, ఏడీబీసహా అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సకాలంలో విడుదలయ్యేందుకు అవసరమైన పనుల పురోగతి లక్ష్యాలను ధ్రువీకరించాల్సింది కూడా పీజీఎంసీనే. 
» 2024లో సింగపూర్‌ సంస్థ సుర్బానా–జురాంగ్‌ను పీజీఎంసీగా ఎంపిక చేసేలా ముఖ్యనేత చక్రం తిప్పారు.  ఆ సంస్థను అడ్డుపెట్టుకుని పనుల అంచనా వ్యయాలను పెంచేసి.. అధిక ధరలకు సిండికేట్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. సింగపూర్‌ సంస్థను అడ్డుపెట్టుకుని పనుల డిజైన్‌లను ఇష్టారాజ్యంగా మార్చేసి.. ఆ ముసుగులో పనుల పరిమాణం పెరిగిందని చూపించి.. కాంట్రాక్టర్లకు అధిక మొత్తంలో బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకుంటున్నారని ఇంజనీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ దోపిడీ వల్లే రాజధానిలో భవన నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.22 వేలకు చేరుకుందని.. రోడ్డు నిర్మాణ వ్యయం కి.మీ.కు సగటున రూ.60 కోట్లకు ఎగబాకిందని స్పష్టం చేస్తున్నారు. ఆ దోపిడీని నిరాటంకంగా కొనసాగించేందుకే మళ్లీ సింగపూర్‌ సంస్థనే పీజీఎంసీగా నియమించేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement