జనసేనకు కేటాయించిన స్థానాల్లోనూ పోటీలో నిలిచిన టీడీపీ అభ్యర్థులు
తప్పుకోవడానికి ససేమిరా.. చాలా చోట్ల బీ ఫారాలతోనే పోటీ
టీడీపీ వెన్నుపోటు రాజకీయాలపై రగిలి పోతున్న జనసేన శ్రేణులు
జనసేన అభ్యర్థులను ఓడించాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన కీలక మంత్రి
విజయవాడలో జనసేనకు కేటాయించిన ఆరు డివిజన్లలో టీడీపీ నేతలు పోటీ.. ఆయా అభ్యర్థులపై తూతూమంత్రంగా చర్యలు.. లోన వాళ్ల గెలుపు కోసం పని చేస్తున్న టీడీపీ నేతలు
జనసేనకు చైర్మన్ స్థానాలు కేటాయించిన చోట టీడీపీ మద్దతు కరువు..
చైర్మన్‌కు మీ ఇష్టం.. కౌన్సిలర్లుగా మాకే ఓటు వేయాలని టీడీపీ ప్రచారం
‘జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకూడదు. వాళ్లకు ఎవరూ ఓట్లేయొద్దు. వాళ్లను ఓడించండి’ అని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మంత్రి నారాయణ టీడీపీ శ్రేణులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యల తాలూకు ఆడియో వైరల్ కావడంతో టీడీపీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరించి నీతిబాహ్యమైన రాజకీయాలు చేస్తోందని పలు ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. కూటమి.. కూటమి అంటూ మిత్రపక్షంగా ఉంటూనే, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు బలి కావాల్సి వస్తోందని జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి. పొత్తుల్లో జనసేన పార్టీకి కేటాయించిన చోట్ల కూడా తాము పోటీ చేసే పరిస్థితి లేకుండా టీడీపీ చేస్తున్న రాజకీయం తమకు అర్థం కావడం లేదని, ఇది దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా, పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గూండాలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు కొన్ని చోట్ల జనసేన వాళ్లను కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకొని దాడులు చేశారు. తమకు నచ్చని జనసేన నేతల నామినేషన్లను అధికారులపై ఒత్తిడి తెచ్చి స్వల్ప కారణాలతో చెల్లని జాబితాలో చేర్చారు. మరికొన్ని చోట్ల జనసేన పార్టీ బీ ఫారంతో పోటీలో నిలిచిన పలువురు అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్ పేరిట టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు.
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం గంగిరెడ్డి పాలెంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్∙దాఖలుకు వెళ్లిన శ్రావణిపై టీడీపీ నేతలు దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. దీంతో ఆ పార్టీ నేతలు ‘పొత్తులో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా’ అని ప్రశ్నిస్తున్నా పట్టించుకున్న వారే లేరు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎంపీపీ పదవిని జనసేనకు కేటాయించగా.. ఆ మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ నేతలు నామినేషన్లు వేయడంతో టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. పొత్తు ధర్మాన్ని టీడీపీ తుంగలోకి తొక్కుతోందని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనసేనకు డిపాజిట్ రావొద్దు
నగర కార్పోరేషన్, మున్సిపాలిటీలలోని డివిజన్లు, వార్డుల్లో కూటమి సర్దుబాటు ప్రక్రియ స్థానిక స్థాయిలో నిర్ణయించుకోవాలని మూడు పార్టీల పెద్దలు తేల్చడంతో మొత్తం 72 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌లో జనసేన 30 శాతం వాటా కావాలని కోరింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు ససేమిరా అన్నారు. జనసేన రాష్ట్ర నేత శివశంకర్ నెల్లూరులో వారం రోజులపాటు మకాం వేసి మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో చర్చించినా, 30 శాతం సీట్లిచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో నెల్లూరులో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని దసరా పండుగ రోజున శివశంకర్ ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ, ఇతర టీడీపీ నాయకులు.. జనసేన నాయకుల మధ్య విభేదాలు సృష్టించారు. జనసేన నేత కాకు మురళీరెడ్డి నెల్లూరు మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
మరోవైపు, నెల్లూరు సిటీ పరిధిలో 6, 15, 21, 71 డివిజన్లను జనసేనకు కేటాయించారు. అయితే ఇందులో ఆరో డివిజన్లో బీజేపీ అభ్యర్థిని మంత్రి నారాయణ పోటీకి దింపారు. అక్కడ బీజేపీకే ఓటేయాలని.. జనసేనకు డిపాజిట్లు రాకుండా చేయాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పొత్తులో జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా, ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే చోట ఏకంగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాలనడంపై జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పొత్తులన్నీ కాగితాల్లోనే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీ సహకారంపై అనుమానం
పొత్తులో భాగంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 13 నగర కార్పొరేషన్లలో ఏలూరు, విజయవాడ జనసేనకు కేటాయించగా.. ఆయా చోట్ల టీడీపీ నేతల సహకారంపై జనసేన నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో రిటైర్డు పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోటీలో ఉన్న నేపథ్యంలో.. ఆదివారం విజయవాడలో జరిగిన జనసేన నాయకుల సమావేశంలో పలువురు జనసేన నాయకులు టీడీపీ నేతల సహకారంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
మరోవైపు, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ఆరు డివిజన్లలో టీడీపీ నేతలు రెబల్స్ పేరిట పోటీ చేస్తుండడం గమనార్హం. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ప్రచారంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొంటున్నప్పటికీ, ఆయన తెరవెనుక ఎన్నికల రాజకీయాల్లో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
మదనపల్లె మున్సిపాలిటీలో జనసేనకు కేటాయించిన సీట్లలోనూ టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీనిపై అదే పట్టణానికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ‘మదనపల్లె మున్సిపాలిటీలో జనసేనకు కేటాయించిన వార్డుల్లో నాలుగింటిలో టీడీపీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు.

1, 2, 34, 43 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు కూడా (వీరికి టీడీపీ బీఫాం కూడా ఇచ్చింది) పోటీలో ఉన్నారు. దయచేసి వాళ్లను ఒప్పించండి. ఎన్డీయే కూటమి పొత్తు ధర్మాన్ని పాటించి, జనసేనకు కేటాయించిన వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయమై అక్కడ పోటీ చేస్తున్న టీడీపీ చైర్మన్ అభ్యర్థికీ లేఖ రాశారు. ఆ లేఖలను ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ 22వ తేదీనే ముగిసినా, టీడీపీ అభ్యర్థులు ఇంకా పోటీలో కొనసాగుతున్నారు.
అన్ని జిల్లాల్లోనూ అదే వెన్నుపోటు రాజకీయం
» శ్రీకాకుళం జిల్లాలో 30 జెడ్పీసీటీ స్థానాలు ఉండగా, టీడీపీ అభ్యర్థులు ప్రతి మండలంలో నామినేషన్లు దాఖలు చేశారు. జనసేనకు కేటాయించిన 4 జెడ్పీటీసీ స్థానాలు, బీజేపీకి కేటాయించిన ఒక జెడ్పీటీసీ స్థానంలో కూడా టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
» పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ జనసేనకు కేటాయించగా.. టీడీపీ చైర్మన్ టికెట్ ఆశించిన ఇద్దరు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మంత్రి సంధ్యారాణి సొంత ప్రాంతంలో టీడీపీ నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నా వారిని విరమింపజేయడానికి ప్రయత్నం చేయలేదు. పైగా ఒక అభ్యర్థికి ఆమె పూర్తి మద్దతు ఇస్తున్నారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు టీడీపీ పట్టణ అధ్యక్షుడే చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉండడంతో జనసేన నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
» విశాఖలో ఈ నెల 15న ఎంపీ భరత్ నేతృత్వంలో జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశం జరిగింది. జీవీఎంసీలో మొత్తం 120 వార్డులుండగా.. 50 వార్డుల వరకు తమకు కేటాయించాలని జనసేన ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఎంపీ భరత్ మాత్రం 21 స్థానాలే ఇస్తామని చెప్పడంతో ససేమిరా అన్నారు. తమ పార్టీ బలంగా ఉన్న వార్డుల వివరాలు చెప్పినా పట్టించుకోకుండా జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే ఓడిపోవడం ఖాయమనీ.. చివరగా 24 సీట్లు మాత్రమే ఇస్తామని భరత్ చెప్పారు. దీంతో ఎమ్మెల్యే పంచకర్ల పేపర్లను విసిరికొట్టి సమావేశం నుంచి వెళ్లిపోయారు. తర్వాత రోజు మళ్లీ మీటింగ్ నిర్వహించి 32 సీట్లు ఇస్తామని ఒప్పించినా.. జనసేన పోటీ చేస్తున్న 32 స్థానాల్లో 25 స్థానాల వరకు టీడీపీ నేతలు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు.
» నర్సీపట్నంలో టీడీపీ నిర్వాకంతో జనసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. జనసేన 10 వార్డులు అడగ్గా, 4 ఇస్తామని టీడీపీ చెప్పింది. దీనికి జనసేన అంగీకరించకుండా అద్దేపల్లి సౌజన్యతో చైర్‌పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఆమె వైదొలిగినా విభేదాలు సమసిపోలేదు.
» కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డుల్లో జనసేనకు 7 వార్డులు కేటాయించారు. అందులో ఒక చోట టీడీపీ అభ్యర్థి పోటీలో కొనసాగుతున్నాడు.
» ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీ జనసేన కేటాయించగా, మొదట టీడీపీ నేతలు చైర్‌పర్సన్‌పాటు 28 వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. తర్వాత పలువురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నప్పటికీ, జనసేనకు కేటాయించిన 3వ వార్డులో టీడీపీ నేత పోటీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేతో పాటు టీడీపీలో ఒక గ్రూపు సహకారం జనసేనకు లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.
» ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో 18 డివిజన్లు జనసేన కోరగా, టీడీపీ ఏడుకు మాత్రమే అంగీకరించింది. మరో 9వార్డుల్లో జనసేన,టీడీపీ మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నట్లు టీడీపీ నేతలే వెల్లడించడం గమనార్హం.
» దర్శి మునిసిపాలిటీ జనసేనకు కేటాయించినా, అక్కడ టీడీపీ నేత దారం సుబ్బారావును జనసేనలోకి పంపి పోటీ చేయించడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
» కర్నూలులో మొత్తం 68 డివిజన్లు ఉండగా, నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత 33, 35, 36, 37, 39, 42, 54వ వార్డుల్లో టీడీపీ, జనసేన పార్టీలు రెండూ బరిలో ఉన్నాయి. ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి జనసేన అభ్యర్థి స్వప్నను ఖరారు చేసినా, చివరి నిమిషంలో పొత్తు ధర్మమంటూ టీడీపీకి కేటాయించడంతో ఆదోని జనసేన కూటమి నుంచి విడిపోయింది. చైర్‌పర్సన్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా స్వప్న బరిలో నిలిచారు. ఎమ్మిగనూరులో 44 వార్డులు ఉండగా, 5 స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గూడూరు నగర పంచాయతీలో జనసేన 4 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కేవలం 21వ వార్డులో పోటీలో ఉన్న జనసేన అభ్యర్థి గుజ్జుల సోమేశ్వరికి మాత్రమే టీడీపీ మద్దతు తెలుపుతోంది. మిగిలిన ముగ్గురికి మద్దతు ఇవ్వడం లేదు. ఆయా స్థానాల్లో బీజేపీ, టీడీపీ నాయకులు కూడా పోటీలో ఉన్నారు.
» చిత్తూరు కార్పొరేషన్‌లో జనసేనకు కేటాయించిన 21, 27, 44, 46, 53 డివిజన్లతో పాటు బీజేపీకి కేటాయించిన 32వ డివిజన్‌లోనూ టీడీపీ తరఫున అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నేతలు వెన్నుపోటు పొడిచి తమపై ఆ పార్టీ అభ్యర్థులను దింపారని జనసేన, బీజేపీ అభ్యర్థులు దుమ్మెత్తిపోస్తున్నారు. జీడీ నెల్లూరు మండలంలో ఎంపీటీసీ స్థానానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు యుగంధర్ కుమార్తె కిరణ్మయి నామినేషన్ వేయగా, ఆమెపై పోటీగా టీడీపీ నుంచి ఏసుమణి నామినేషన్ వేశారు. తవణంపల్లె మండలంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గుర్రం మమతపై పోటీగా టీడీపీ నుంచి వెంకటేశ్వర చౌదరి నామినేషన్ వేశారు.
» అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీని జనసేనకు కేటాయించినా, అక్కడ జనసేన పార్టీ అధిష్టానం ఎస్.శ్రీనివాసరావు పేరును ప్రకటించింది. చివరి నిమిషంలో ఆయన్ను తప్పించి జిల్లా టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణను పార్టీలో చేర్చుకొని ఆయన భార్య శారదకు జనసేన చైర్మన్ సీటు కేటాయించింది. దీంతో జనసేన తొలుత ప్రకటించిన అభ్యర్థి ఎస్.శ్రీనివాసరావు ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.


