తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు అభ్యర్థులతో కలిసి ఆందోళన నిర్వహిస్తున్న మోహిత్‌రెడ్డి
142 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట అభ్యర్థులతో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి బైఠాయింపు
టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని రిటర్నింగ్ అధికారులను బెదిరించారు
నామినేషన్లు ఆమోదించాలని డిమాండ్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తిరస్కరణపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. చిన్నచిన్న కారణాలతో 142 మంది పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని ఆ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆదివారంa తమ అభ్యర్థులతో కలిసి జాతీయ జెండా పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. తిరస్కరించిన నామినేషన్లను ఆమోదించి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్ని మండలాల రిటర్నింగ్ అధికారులకు ఫోన్లుచేసి బెదిరించారని, డబ్బులు ఆశ చూపి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించేలా ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో పత్రాలు సక్రమంగా ఉన్నాయని చెప్పిన అధికారులు.. పరిశీలన సమయంలోకొన్ని పేజీలు లేవనే కారణంతో తిరస్కరించారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకుపోరాటం కొనసాగిస్తామని మోహిత్‌రెడ్డి స్పష్టంచేశారు.


