
విజయవాడ: యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధం కావడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం రూ. 2.49 పైసలకే యూనిట్ ను కొనుగోలు చేస్తేనే విషం కక్కిన కూటమి పెద్దలు.. ఇప్పుడు ఏకండా రూ. 4.60 పైసలకు ఎలా ఒప్పందం చేసుకుంటారని ప్రశ్న వినిపిస్తోంది. ఈ ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.
దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘2018లో తిరస్కరించిన ఒప్పందాన్ని తిరిగి తీసుకుని రావడం దారుణం. రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం మోపి, యాక్సిస్ కంపెనీకి కట్టబెట్టడానికి టిడిపి కూటమి ప్రభుత్వం చేయించిన ఈ ఒప్పందం ఎంత మాత్రమూ అనుమతించం. రాష్ట్ర ప్రజలపై పాతికేళ్ళపాటు రూ.15 వేల కోట్లు భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపిఈఆర్‌సి) ఆమోదముద్ర వేయడం అన్యాయం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనిట్ రూ.2 లు, 2.50లకి ఒప్పందాలు జరుగుతున్నాయి.
గతంలో అదానీ సంస్థతో సెకీ ద్వారా సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2.49లు ఒప్పందం చేసుకోగా అది అధిక రేటు అని తెలుగుదేశంతో సహా అన్నిపక్షాలు విమర్శించాయి. నేడు దానికంటే రూ.2.10లు అధికంగా చేసే ఒప్పందాలు చేసుకోవడం దారుణం. దీన్ని వెంటనే రద్దు చేసుకోవాలి’ అని
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
సంపద సృష్టి అన్న బాబు.. ఇప్పుడు దోచుకుంటున్నారు
‘యాక్సిస్’ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండిపడింది. సంపద సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం. మేం సెకీతో ఒప్పందం చేసుకుంటే గగ్గోలు పెట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 2.49పైసలకు ఒప్పందం చేసుకుంది. దీనిపై విషం కక్కారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ. 4.60 పైసలకు ఒప్పందం చేసుకుంది. ఇవి ఎల్లో మీడియాకు కనబడటం లేదా?, అని ప్రశ్నించారు.