‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! | couples ends life in road accident at tirupati | Sakshi
Sakshi News home page

‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!

Mar 7 2025 2:00 PM | Updated on Mar 7 2025 6:19 PM

couples ends life in road accident at tirupati

సైదాపురం–తిప్పవరపాడులో ఘోర ప్రమాదం 

స్కూటీని ఢీకొట్టిన బైక్‌ ∙తల్లిదండ్రులు మృతి 

అనాథలైన ఇద్దరు కుమార్తెలు 

సైదాపురంలో విషాద ఛాయలు  

విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. భార్య, చిన్నకుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో ఆటో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తన కళ్లెదుటే తల్లిదండ్రులు కన్నుమూయడం ఆ బాలిక మనసును కలచివేసింది. తన గాయాలు లెక్కచేయక అమ్మా..నాన్నా..! మాట్లాడండి నాన్నా..? అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో బాలిక ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న చెల్లిని, విగత జీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసి గుండెలు బాదుకున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

సైదాపురం/తిరుపతి: ‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! అంటూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న    చిన్న కుమార్తె, ఆమె అక్క రోదించడం స్థానికంగా కలచివేసింది. సైదాపురం – తిప్పవరపాడులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా.. చిన్న కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, గూడూరు రూరల్‌ పోలీసుల వివరాల మేరకు.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, సైదాపురానికి చెందిన దొడ్డగ మునెయ్య బట్టల దుకాణం నడుపుకుంటున్నారు. 

భార్య జ్యోతి టైలరింగ్‌ చేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉండేది. ఈ క్రమంలో వారికి నిహారిక, వైష్ణవి ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. వారు స్థానిక పాఠశాలల్లో 8, 7 తరగతులు చదువుకుంటున్నారు. మునెయ్య బంధువులు కోట మండలంలోని విద్యానగర్‌లో ఉండడంతో వారి వద్దకు వెళ్లేందుకు భార్య జ్యోతి, చిన్న కుమార్తె వైష్ణవిని తీసుకుని స్కూటీపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సైదాపురం నుంచి గూడూరు వైపు వస్తున్న ఆటో స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మునెయ్య, జ్యోతిలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు కళ్లెదుటే దుర్మరణం చెందడంతో బాలిక్‌ షాక్‌కు గురైంది. అమ్మా..నాన్న వెళ్లిపోయారా..అంటూ కన్నీటిపర్యంతమవడం స్థానికులను కలచివేసింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement