Tiger Census 2021: నేటి నుంచి పులుల గణన | Counting of tigers from 28th September | Sakshi
Sakshi News home page

Tiger Census 2021: నేటి నుంచి పులుల గణన

Sep 28 2021 4:27 AM | Updated on Sep 28 2021 9:04 AM

Counting of tigers from 28th September - Sakshi

ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌లో భాగంగా అటవీ శాఖాధికారులు ఈ నెల 28 నుంచి అక్టోబర్‌ 10వ తేదీ వరకు పులుల గణన నిర్వహించనున్నారు.

పెద్దదోర్నాల: ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌లో భాగంగా అటవీ శాఖాధికారులు ఈ నెల 28 నుంచి అక్టోబర్‌ 10వ తేదీ వరకు పులుల గణన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పులి సంరక్షణ కేంద్రాలు 50 ఉండగా, వాటిలో నల్లమలలోని నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ అతి పెద్ద అభయారణ్యంగా గుర్తింపు పొందింది. గతేడాది నిర్వహించిన గణనలో ఇక్కడ 63 పులులు ఉన్నట్లు తేలింది. ఈ సారి ఆ సంఖ్య పెరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో నల్లమల విస్తరించింది.

ఈ అటవీ ప్రాంతంలోని సిబ్బందికి ఇప్పటికే పులుల గణనపై శిక్షణ తరగతులు నిర్వహించి సంసిద్ధం చేశారు. ఈ సారి పులుల గణనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో వాటి పాదముద్రల ఆధారంగా గణన జరిగేది. అరణ్యంలోని పలు ప్రాంతాల్లో అవి సంచరిస్తుండటంతో ఖచ్చితమైన సంఖ్య తేలేది కాదు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు.

వాటి నుంచి వెలువడే ఆల్ఫ్రారెడ్‌ బీమ్‌ పరిధిలోకి జంతువు రాగానే కెమెరా చిత్రీకరిస్తుంది. దీంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎకోలాజికల్‌ యాప్‌ను ఉపయోగించి వన్యప్రాణుల వివరాలు సేకరిస్తున్నారు. నూతన శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు పులుల పాదముద్రలు, మలము, చెట్ల మొదళ్లపై పులుల గోళ్ల రక్కులకు సంబంధించిన ఆనవాళ్లను సైతం పరిగణనలోకి తీసుకుని పులుల గణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement