విజిలెన్స్‌లో అచ్చోసిన అన్నదే ఇష్టారాజ్యం | Corruption in the Vigilance and Enforcement Department: Ap | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌లో అచ్చోసిన అన్నదే ఇష్టారాజ్యం

Apr 13 2026 4:35 AM | Updated on Apr 13 2026 12:22 PM

Corruption in the Vigilance and Enforcement Department: Ap

ప్రభుత్వంలోని బాబాయ్‌–అబ్బాయ్‌ బంధువుదే హవా

రిటైర్డ్‌ అధికారి సిండికేట్‌కే కీలకమైన జిల్లా పోస్టింగులు

మైనింగ్, గ్రానైట్, ఇతర వ్యాపారుల నుంచి యథేచ్ఛగా వసూళ్లు

రియల్‌ ఎస్టేట్, బంగారం, వస్త్ర వ్యాపారులనూ బెదిరిస్తూ దోపిడీ 

విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కీలక ఉన్నతాధికారి దన్నుతోనే దందా

సాక్షి, అమరావతి: అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన విజిలెన్స్‌–­ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో అవినీతి కట్టలు తెంచుకుంటోంది. ఉత్తరాంధ్రకు చెందిన రిటైర్డ్‌ అధికారి ఇష్ట ప్రకారమే అంతా సాగుతోంది. ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న బాబా­య్, అబ్బాయ్‌ కుటుంబ సభ్యుడు కావడంతో విజిలెన్స్‌ – ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో ఏకంగా సొంత సిండికేట్‌ను ఏ­ర్పా­టు చేశారు. ఆయన వర్గంలోని అధికారులకే కీలక జిల్లా పోస్టింగులు ఇస్తున్నారు. గ్రానైట్, ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతూ ఈ సిండికేట్‌ బరి­తెగించి అవినీతికి పాల్పడుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఓఎస్డీగా నియమించి.. వైజాగ్‌లో పోస్టింగ్‌  
ప్రభుత్వంలో అచ్చోసిన వ్యాఖ్యలు చేసే కీలక నేత సోదరుడి ని కూటమి ప్రభు­త్వం అధికారంలోకి రాగానే అందలం ఎక్కించింది. ఆయన రిటైర్‌మెంట్‌కు ఒక రోజు ముందు అద నపు ఎస్పీగా పదోన్నతి కల్పించింది. అంతేకాదు ఆయన రిటైరైన తరువాత విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో ఓఎస్డీగా నియమించింది. సాధారణంగా ఓఎస్డీ అంటే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పోస్టింగు ఇస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఆ అధికారి కోరుకున్న ట్టుగా విశాఖపట్నంలో పో స్టింగ్‌ ఇస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జిగా బాధ్యతలు కట్టబె­ట్టారు. ఓఎస్డీగా ఆయన పదవీ కాలాన్ని ఇటీవల మరోసారి పొడిగించారు కూడా. కాగా తాజాగా గోదావరి జిల్లాల బాధ్యతలను కూడా ఆ అధికారికే కట్టబెట్టడం గమనార్హం. 

సిండికేట్‌లోని సొంత వర్గీయులకే కీలక పోస్టింగ్‌లు 
ఇక ఆ అధికారి రాష్ట్రవ్యాప్తంగా తన వర్గీయులైన అధికారు­లతో ఓ సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. ఆ సిండికేట్‌లోని అధికారులకే మైనింగ్, గ్రానైట్, ఇతర కీలక వ్యాపారాలకు కేంద్ర స్థానాలుగా ఉన్న జిల్లా అధికారులుగా పోస్టింగ్‌లు ఇస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల విజిలెన్స్‌ అధికారులుగా ఆయన వర్గీయులకే పోస్టింగులు దక్కడం గమనార్హం. ఆ జిల్లాల్లోనే భారీగా ఇసుక, గ్రానైట్, ఇతర మైనింగ్‌ కార్యకలాపాలు సాగుతున్నాయి.

అవే ప్రాంతాలు రియల్‌ ఎస్టేట్, బంగారం, వస్త్ర వ్యాపారాలకు కేంద్ర స్థానాలుగా ఉన్నాయి. ఇసుక, గ్రానైట్, మైనింగ్‌ వ్యాపారుల నుంచి ఈ సిండికేట్‌ భారీగా వసూళ్లకు పాల్పడుతోంది. తమ అధికార పరిధిని అతిక్రమించి మరీ రియల్‌ ఎస్టేట్, బంగారం, వస్త్ర, ఇతర వ్యాపారులను తనిఖీల పేరుతో వేధిస్తున్నారు. ఆ ముసుగులో వారి నుంచి యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఉన్నతాధికారి అండతోనే వసూళ్ల దందా 
ఈ సిండికేట్‌కు విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం కీలక ఉన్నతాధికారి పూర్తి దన్నుగా నిలుస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా సిండికేట్‌ మొత్తం వసూళ్ల దందా సాగిస్తుండటమే అందుకు కారణం. ఆ ఉన్నతాధి­కారిని తగిన రీతిలో సంతృప్తిపరుస్తూ ఈ విజిలెన్స్‌– సిండికేట్‌ ఇష్టారాజ్యంగా దందాకు పాల్పడుతోంది. అందుకే ఆ కీలక ఉన్నతాధికారి విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌­మెంట్‌ విభాగా­నికి రెగ్యులర్‌ అధికారిని నియమించకుండా తన గుప్పిట్లోనే ఉంచుకున్నారని కూడా అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement