‘పచ్చ’ నేతలకు జీ హుజూర్‌! | Police Support for Red Book Constitutional Anarchy of TDP Alliance: AP | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ నేతలకు జీ హుజూర్‌!

Apr 13 2026 3:21 AM | Updated on Apr 13 2026 5:39 AM

Police Support for Red Book Constitutional Anarchy of TDP Alliance: AP

భద్రత మా బాధ్యత కాదంటూ రాష్ట్రంలో చేతులెత్తేస్తున్న పోలీసులు  

ప్రాణ రక్షణ కోరినా పట్టించుకోని కడప ఖాకీలు

ఫలితంగా ప్రభుత్వాస్పత్రిలో అందరి కళ్లెదుటే వ్యక్తి దారుణ హత్య

చికిత్స పొందుతుండగా కత్తులతో దాడి చేసి హతమార్చిన గంజాయి బ్యాచ్‌

తీవ్ర భయభ్రాంతులకు గురైన రోగులు, వారి బంధువులు

మరో ఘటనలో కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందన్న యువతి

అయినా సరే బలవంతంగా కుటుంబ సభ్యులకే అప్పగించిన పల్నాడు పోలీసులు

వెరసి కుటుంబ సభ్యుల చేతిలోనే ఆ యువతి హత్య

ఈ రెండు ఘటనల్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలనే పాటించిన పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు

సాక్షి, అమరావతి: ప్రాణాలకు రక్షణ కల్పించండి అని పోలీసు స్టేషన్‌లో బాధితుడు గగ్గోలు పెట్టినా దిక్కులేదు.. కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందని ఓ యువతి కన్నీరు పెట్టుకున్నా పట్టించుకోనే పరిస్థితి లేదు.. ఫలితంగా ఆ ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో పోలీసుల తీరు ఇది. అసలు ప్రజల భద్రత తమ బాధ్యతే కాదన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అధికార టీడీపీ కూటమి రెడ్‌బుక్‌ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడానికి అలవాటుపడ్డ పోలీసు శాఖ.. అసలు వృత్తి ధర్మాన్ని విస్మరిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారుతున్నాయి. సామాన్యుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఘటనలు ఇలా ఉన్నాయి.

రక్షణ కల్పించమంటే ముఖం చాటేసిన పోలీసులు
తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసు స్టేషన్‌లోనే బాధితుడు వేడుకున్నా కడప పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. గంజాయి బ్యాచ్‌ పట్ల కఠినంగా వ్యవహరించలేని పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఆ యువకుడి ప్రాణాలు తీసింది. గంజాయి బ్యాచ్‌ ఏకంగా కడపలోని రిమ్స్‌ ఆసుపత్రిలోకి ప్రవేశించి మరీ ఆ యువకుడిని హత్య చేసింది. కడపలోని అలంకాపల్లిలో 4వ తేదీన జరిగిన మారెమ్మ జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. జాతర సందర్భంగా ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిసినా, ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో జాతరలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే పోలీసులు ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించలేదు.

మరోసారి ఆ వర్గాలు ఘర్షణ పడకుండా ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇరువర్గాల మధ్య గత ఆదివారం రాత్రి ఘర్షణ తలెత్తింది. ఏకంగా గంజాయి బ్యాచ్‌లు రంగంలోకి దిగి కత్తులు పట్టుకుని మరీ వీరంగం సృష్టించాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చిన పోలీసులు.. ఇరు వర్గాలకు చెందిన కొందరిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గంజాయి బ్యాచ్‌ చేతిలో తీవ్రంగా గాయపడిన పెద్ద దస్తగిరిని కూడా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లడం గమనార్హం. ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలనే విషయాన్ని పోలీసులు పట్టించుకోనేలేదు. కాసేపటి తర్వాత వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. తాను బయటకు వెళితే గంజాయి బ్యాచ్‌ చంపేస్తుందని ఆయన వాపోయారు.

అయినా పోలీసులు వినిపించుకోలేదు. ‘పోలీస్‌ స్టేషన్‌లో ఉండొద్దు.. వెళ్లిపోండి.. రిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లి మీరే చికిత్స చేయించుకోండి’ అని ఆదేశించారు. కనీసం రిమ్స్‌ ఆస్పత్రి వరకు తోడు రావాలని ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదు. దాంతో పెద్ద దస్తగిరి ఒక్కరే రిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన్ను ఆసుపత్రి సిబ్బంది వార్డులో చేర్చుకుని చికిత్స చేశారు. కాగా అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత గంజాయి బ్యాచ్‌ ఏకంగా రిమ్స్‌ ఆసుపత్రిలోకి ప్రవేశించి మరీ దస్తగిరిపై కత్తులతో దాడి చేసి హత్య చేసింది. అందరూ చూస్తుండగానే కత్తులతో స్వైర విహారం చేసి పాశవికంగా హత్య చేయడం దిగ్భ్రాంతికి గురి చేసింది.

తన ప్రాణాలకు హాని ఉందని పెద్ద దస్తగిరి ఎంతగా చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటుచేసుకుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చిన ఇరువర్గాలను వెంటనే పంపించి వేయాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశించారు. దాంతోనే బాధితులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఎంతగా వాపోయినా సరే పోలీసులు పట్టించుకోకుండా బయటకు వెళ్లగొట్టారు. ఫలితంగా గంజాయి బ్యాచ్‌ బరితెగించి హత్యకు పాల్పడింది. టీడీపీ నేతల అండదండలు ఉన్న గంజాయి బ్యాచ్‌ పట్ల కఠినంగా వ్యవహరించడంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారి తటపటాయించారని తెలుస్తోంది. టీడీపీ నేతల ఒత్తిడితోనే బాధితులను పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు పంపించి వేశారని సమాచారం.

ప్రాణహాని ఉందన్నా పోలీసులు బేఖాతరు
కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఓ కొత్త పెళ్లి కూతురు ఎంతగా వేడుకున్నా పల్నాడు పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏకంగా ఓ పరువు హత్యకు సహకరించడంతో యావత్‌ రాష్ట్రం విభ్రాంతికి గురైంది. ఈ ఉదంతం బయట పడటంతో సీఐని సస్పెండ్‌ చేసి పోలీసు శాఖ కనికట్టు చేస్తోంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలతోనే ఆ సీఐ అలా వ్యవహరించారని సమాచారం. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కామనబోయిన చౌడేశ్వరి, జమ్మలమడకకు చెందిన నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చౌడేశ్వరి కనిపించడం లేదని ఆమె తండ్రి చంద్ర శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేజర్లు అయిన చౌడేశ్వరి, నాగరాజు వివాహం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

ఆ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ద్వారా కథ నడిపించారు. ఆమెను తమకు అప్పగించేలా మాచర్ల పోలీసులను ఆదేశించాలన్నారు. టీడీపీ నేతల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారి సమ్మతించారు. మాచర్ల సీఐ వెంకటరమణతో కూడా చంద్ర శ్రీను డీల్‌ కుదుర్చుకున్నారు. ఆయనకు రూ.6.50 లక్షలు లంచం ఇచ్చారు. ఓ వైపు పోలీసు ఉన్నతాధికారి ఆదేశించగా, మరోవైపు భారీగా లంచం కూడా ముట్టడంతో సీఐ వెంకటరమణ చెలరేగిపోయారు. ఈ క్రమంలో చౌడేశ్వరిని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, చంపేస్తారని తాను వెళ్లనని ఆమె కన్నీరు పెట్టుకుంది. అయినా సీఐ తురకా వెంకట రమణ వినిపించుకోలేదు. మేజర్‌ అయిన తాను ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నానని చెప్పినా వినకుండా చౌడేశ్వరిని తీవ్రంగా బెదిరించారు.

ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఫలితంగా తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న కుమార్తె చౌడేశ్వరిని చంద్ర శ్రీను గత నెల 18న హత్యచేశారు. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పరువు హత్య వ్యవహారం, అందుకు సహకరించిన సీఐ వెంకటరమణ బాగోతం బయట పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు శాఖ సీఐ వెంకటరమణను సస్పెండ్‌ చేసింది. కానీ చౌడేశ్వరిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారిపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఆయన పాత్రను పోలీసు శాఖ కప్పిపుచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడటం తమ బాధ్యత కాదన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తుండటం విస్మయ పరుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement