దొంగల్లా ఇంట్లోకి దూరి... | AP Police Attempt to Kidnap a YSRCP Dalit Leader | Sakshi
Sakshi News home page

దొంగల్లా ఇంట్లోకి దూరి...

Apr 13 2026 3:56 AM | Updated on Apr 13 2026 11:02 AM

AP Police Attempt to Kidnap a YSRCP Dalit Leader

తనీష్ బాబు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అడ్డుకుంటున్న పోలీసులు

వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడి కిడ్నాప్‌నకు పోలీసుల యత్నం 

తెల్లవారుజామున మఫ్టీలో గోడ దూకి ఇంట్లోకి చొరబడిన పోలీసులు 

అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితుడి కుటుంబ సభ్యులపైనా దాడి 

బాపట్ల జిల్లా చినపులివర్రులో తీవ్ర ఉద్రిక్తత

కొల్లూరు: వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ దళిత నాయకుడు ఇంట్లో నిద్రిస్తుండగా పోలీసులు దొంగల్లా మఫ్టీలో గోడదూకి వెళ్లి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న అతని తల్లిదండ్రులు, పక్కంటి మహిళపైనా దాడి చేశారు. స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి గట్టిగా నిలదీయడంతో తాము పోలీసులమని చెప్పారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం? అంటూ ఇటీవల వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా వేమూరు నియోజకవర్గ కన్వీనర్, దళిత నాయకుడు బాణాల తనీష్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో ఆదివారం తెల్లవారుజామున కొల్లూరు ఎస్‌ఐ పి.ఏడుకొండలు, మరో నలుగురు పోలీసులతో కలిసి వ్యక్తిగత కారులో సాధారణ దుస్తుల్లో చినపులివర్రు గ్రామంలోని తనీష్‌బాబు ఇంటి వద్దకు వెళ్లారు. దొంగల్లా ప్రహరీని దూకి లోపలికి వచ్చిన పోలీసులు బలవంతంగా బెడ్‌రూమ్‌ తలుపు తోసుకుని వెళ్లి నిద్రిస్తున్న తనీష్ ను తమ వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. 

11 నెలల బిడ్డను మంచంపై విసిరేసి.. బాధితుడిని కొట్టుకుంటూ...  
తనీష్ బాబు పక్కనే ఉన్న భార్య అనూష... ‘ఎవరు మీరు? నా భర్తను ఎందుకు తీసుకువెళుతున్నారు?’ అని ప్రశ్నిస్తూ సెల్‌ఫోన్‌లో వీడియో తీసేందుకు ప్రయత్నించగా, ఆమె ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. అనూషను పక్కకు నెట్టివేసి ఆమె చేతుల్లో ఉన్న వారి 11 నెలల బిడ్డను మంచంపైకి విసిరేసి, తనీష్‌బాబును కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఇంటి బయట నిద్రిస్తున్న తనీష్ బాబు తల్లిదండ్రులు లేచి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

తనీష్ బాబు తండ్రిపైన దాడి చేసి బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నించారు. ఈ గొడవతో పక్కింటి మహిళ వచ్చి ‘ఎవరు మీరు?’ అని ప్రశ్నించడంతో ఆమెను కొట్టి, నెట్టేశారు. కిందపడిన ఆ మహిళ పెద్దపెట్టున కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడకు చేరుకొని కారుకు అడ్డుగా పడుకున్నారు. పరిస్థితి చేయిదాటిందని గమనించి, తాము కొల్లూరు పోలీసులమని చెప్పారు. పోలీసులు అయితే ఇలా తెల్లవారుజామున దొంగల్లా రావడం ఏమిటని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో చినపులివర్రులో ఉదయం 9 వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

పోలీసులపై ఫిర్యాదు స్వీకరించాలని పట్టు 
తనీష్ బాబును అక్రమంగా తీసుకువెళ్తున్నారన్న సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు వెంటనే అక్కడికి వచ్చారు. నోటీసులు ఇవ్వకుండా వీ«దీరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేమిటంటూ పోలీసులను ప్రశ్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, వివిధ పోలీసుస్టేషన్‌ల ఎస్‌ఐలు స్థానికులకు సర్దిచెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించిన పోలీసులపై ఫిర్యాదు స్వీకరించాలని అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు స్వీకరించడానికి పోలీసులు అంగీకరించడంతో స్థానికులు శాంతించారు. అనంతరం తనీష్ బాబును కొల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు 41 నోటీసులు అందజేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement