పశుసంవర్ధక సహాయకులు సర్టిఫికెట్‌ల పునఃపరిశీలనకు హాజరు కావాలని గుంటూరు జిల్లా అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్
ఉద్యోగుల మెడపై బాబు సర్కార్ కత్తి
బలవంతంగా సాగనంపడమే లక్ష్యంగా కుట్రలు
జగన్ హయాంలో 3 విడతల్లో 6,105 మంది నియామకం
1,200 మంది ఫేక్ సర్టిఫికెట్స్‌తో చేరారంటూ అభాండాలు
25లోపు అందరి సర్టీఫికెట్లు పరిశీలించాలంటూ ఆదేశాలు
న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న సహాయకులు
ఇప్పటికే తీవ్ర వేధింపులకు గురవుతున్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది
సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకే) ద్వారా పాడి రైతులకు గ్రామ స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తున్న గ్రామ పశుసంవర్ధక సహాయకుల (వీఏహెచ్‌ఏ)పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. వైఎస్ జగన్ హయాంలో నియమితులైన 6,105 మందిలో దాదాపు 1,200 మంది నకిలీ సర్టీఫికెట్లతో చేరారని ఒక్క ఫిర్యాదు అందడంతో ఇదే అదునుగా ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి, వారిని తొలగించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ (ఐవీఆర్‌ఎస్ సర్వే) పేరిట గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు వేస్తూ వేధింపులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీఏహెచ్‌ఏలను సాగనంపేందుకు గురిపెట్టింది. రాతపరీక్షలు, సర్టీఫికెట్ల పరిశీలనల తర్వాతే తమను నియమించారని, ఇప్పుడిలా వేధింపులకు గురిచేయడం ముమ్మాటికి తమ మనోభావాలను దెబ్బతీయడమేనని వీఏహెచ్‌ఏ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
సహాయకులకు సర్కార్ సహాయ నిరాకరణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామ పశుసంవర్ధక సహాయకుల (వీఏహెచ్‌ఏ) పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఒక్కో సహాయకునికి 3–4 గ్రామాలు మ్యాపింగ్ చేశారు. సర్వేల పేరిట వీరిని అడ్డమైన పనులకు వినియోగించుకుంటూ వేధిస్తున్నారు. 2023లో మూడో విడతలో పోస్టింగ్‌లు పొందిన 1,896 మందికి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీతో ప్రొబేషన్ పిరియడ్ పూర్తయ్యింది. మార్చి నుంచి వారికి పే స్కేల్ వర్తింపచేయాల్సి ఉంది. ఈ విషయమై ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దాదాపు రెండేళ్లుగా సకాలంలో జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రేపో మాపో ప్రొబేషన్ కన్‌ఫర్మ్ చేస్తారని, పే స్కేల్ వర్తింప చేస్తారన్న ఆశతో పనిచేస్తున్న దశలో ‘నకిలీ’ అభాండం వారిని కుంగదీస్తోంది.
పటిష్ట ప్రక్రియతో నియామకం
ఏ ప్రభుత్వ ఉద్యోగయినా నోటిఫికేషన్ నుంచి అపాయింట్‌మెంట్ ఆర్డర్ వరకు ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొంటారు. రాత పరీక్షల్లో మెరిట్.. ఇంటర్వ్యూలలో అర్హత.. సర్టిఫికెట్ పరిశీలన.. తర్వాతే అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందుకుంటారు. పశుసంవర్ధక సహాయకుల నియామకాలు కూడా ఇలా జరిగినవే. జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ), పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా నిర్వహించిన రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందడమే కాదు, నిర్దేశిత జీవో ఆధారంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పూర్తి పారదర్శకంగా జరిగిన సర్టీఫికెట్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియల ద్వారా అర్హుల ఎంపిక జరిగింది. పైగా ప్రతీ ఉద్యోగికి నాలుగు నెలల శిక్షణ అనంతరం శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహించారు. తరువాత వారు ఆర్‌ఎహెచ్‌ఎసీ (రీజనల్ యానిమల్ హజ్బెండరీ ట్రైనింగ్ సెంటర్) లో పశువులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా పొందారు.
నాడు ఓకే అన్న అధికారులే నేడు ‘నకిలీ’ అంటున్నారు
ఉద్యోగుల్లో దాదాపు 1,200 మంది నకిలీ సర్టీఫికెట్లతో చేరారంటూ ఏపీ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ పీవీ లక్ష్మయ్య చేసిన ఆరోపణలతో తాజా కుట్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అప్పట్లో ప్రతి సర్టిఫికెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నియామకాలకు ఓకే చెప్పిన అధికారులే ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత ఉద్యోగులపై ‘నకిలీ’ ముద్ర వేస్తున్నారు. లోకాయుక్త పేరిట భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు.
పైగా ఏప్రిల్ 25వ తేదీలోగా ఈ నకిలీల నిగ్గు తేల్చాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి.దామోదరనాయుడు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారులకు ఈ నెల 6వ తేదీన సర్క్యులర్ జారీచేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ డైరెక్టర్‌గా కొనసాగుతున్న వ్యక్తి ఈ తరహా వేధింపులకు పాల్పడడం పట్ల ఉద్యోగ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఆర్బీకేలను నిరీ్వర్యం చేయడం, టీడీపీ కార్యకర్తలను సాధ్యమైనంతమేర నింపుకోవడం ఈ వేధింపుల వెనుక కుట్రగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాడి రైతులకు జగన్ సర్కార్ వెన్నుదన్ను
సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)లను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతులకు అండగా నిలిచేందుకు గ్రామానికి ఒక గ్రామ పశుసంవర్ధక సహాయకుని (వీఏహెచ్‌ఏ)నియామకానికి శ్రీకారం చుట్టింది. 7,272 ఆర్బీకేల్లో పాడి సంపద అధికంగా ఉన్నట్టుగా గుర్తించగా, మూడు విడతల్లో 6,105 మంది వీఏహెచ్‌ఏలను నియమించింది. మిగిలిన చోట్ల గోపాలమిత్రలు, ఆర్‌ఎల్‌యూ సిబ్బంది సేవలను అనుసంధానం చేశారు. పశువైద్యసేవల కోసం ప్రతీ ఆర్బీకేలో ప్రత్యేకంగా రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాలు)ను ఏర్పాటు చేశారు.
పశువీర్యాన్ని నిల్వ చేసేందుకు రూ.16.90 కోట్ల ఖర్చుతో లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను సమకూర్చారు. ప్రతీ నెలా రూ.2,700 చొప్పున ఏడాదికి రూ.32,400 విలువైన 105 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు. ఇలా 4 ఏళ్లలో రూ.50 కోట్ల విలువైన మందులను సరఫరా చేశారు. పాడి రైతులు ఫోన్ చేయగానే క్షణాల్లో వారి గడపవద్దకు వెళ్లి ప్రాథమిక వైద్యసేవలందించేవారు. ఇప్పుడు ఆ స్వర్ణయుగాన్ని గుర్తుతెచ్చుకుంటూ రైతులు మళ్లీ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారు.


