అర్ధరాత్రి వేళ కర్రలు, రాడ్డుతో కొట్టి హతమార్చిన వైనం
ప్రకాశం జిల్లా ధర్మవరంలో ఘటన
అద్దంకి: అర్ధరాత్రి వేళ ఆర్‌ఎంపీ వైద్యుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మవరం గ్రామానికి చెందిన మేడగం కోటిరెడ్డి (45) ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం బ్రహ్మంగారి మాల వేసుకుని దీక్ష చేపట్టాడు. శనివారం రాత్రి భార్య ఆదిలక్ష్మి టిఫిన్ పెట్టగా.. తిని పడుకున్నాడు. అర్ధరాత్రి నల్లటి ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అడ్డొచ్చిన అతని భార్యను నెట్టివేయడంతో స్పృహ కోల్పోయింది.
అనంతరం కోటిరెడ్డిని కర్రలు, రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసినట్టు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ పరిశీలించారు. సీఐ సుబ్బరాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మంగళగిరి నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం హత్య చేయడానికి వచ్చిన వారిలో ఒకరు ‘నా భార్యతో అక్రమ సంబంధం మానుకోవా’ అన్నట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగిందా.. లేక మరేదైనా కారణమా అనేది విచారణలో తేలాల్సి ఉంది.


