విజయవాడ రైల్వే డివిజన్‌లో కరోనా కలకలం

Corona sensation in Vijayawada Railway Division - Sakshi

104 మంది రైల్వే సిబ్బందికి కరోనా

సిబ్బంది కొరతతో తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): కరోనా మూడో వేవ్‌ విజయవాడ రైల్వే డివిజన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క రోజులోనే 104 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో 50 మంది మెయిల్, ప్యాసింజర్, గూడ్స్‌ లోకో పైలట్‌లు, 49 మంది అసిస్టెంట్‌ లోకో పైలట్‌లు ఉన్నారు. కరోనా సోకిన వారిని అధికారులు క్వారంటైన్‌కు పంపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో లోకో పైలట్‌లు, అసిస్టెంట్‌ పైలట్‌లు కరోనా బారిన పడటంతో సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పలు గూడ్స్, ప్యాసింజర్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

మచిలీపట్నం–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్ల రద్దు
తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా మచిలీపట్నం–సికింద్రాబాద్‌ల మధ్య ప్రకటించిన ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్ల(07577/07578)ను ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు చేశారు.

కాకినాడ టౌన్‌–లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్‌–లింగంపల్లి మధ్య 8 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రత్యేక రైలు(07295) ఈ నెల 24, 26, 28, 31 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07296) ఈ నెల 25, 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో సాయంత్రం 4.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ, సికింద్రాబాద్‌ స్టేషన్‌లలో ఆగుతాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top