
ఎమ్మిగనూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
కర్నూలు జిల్లా టౌన్: విద్యా హక్కు చట్టం(ఆర్‌టీఈ) కింద సీట్లు పొంది చదువుతున్న పిల్లలకు ‘తల్లికి వందనం’ ఎందుకు ఇవ్వరంటూ కూటమి ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి.. నిరసన తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని, తల్లికి వందనం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ శేషఫణికి వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా సామాజిక ఉద్యమ కార్యకర్త తిమ్మప్ప మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ద్వారా పేద పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన కూటమి ప్రభుత్వం.. ఆర్‌టీఈ విద్యార్థులకు బకాయిలు చెల్లించట్లేదని మండిపడ్డారు. అలాగే తల్లికి వందనం డబ్బులు కూడా జమ చేయట్లేదని మండిపడ్డారు. ఒక కుటుంబంలో ఒక విద్యార్థి ఆర్‌టీఈ సీటుకు ఎంపికైతే.. అదే కుటుంబంలోని మిగిలిన విద్యార్థులను కూడా ఆర్‌టీఈ కింద చూపించడం దారుణమన్నారు.