AP: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు: సీఎస్‌

Comprehensive Arrangements For Global Investors Meet - Sakshi

అమరావతి: మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళశాల మైదానంలో జరగనున్నగ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్(ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు)కు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు సీఎస్‌ సమావేశ మందిరంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు సంబంధించిన 3వ వర్కింగ్ కమిటీ సమావేశం సీఎస్‌ అధ్యక్షతన జరిగింది.

ఈసమావేశంలో రానున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈసందర్భంగా సీఎస్‌ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 3, 4తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్దఎత్తున్న విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈసదస్సులో పాల్గొనే పలువురు కేంద్ర,రాష్ట్ర మంత్రులు,వివిధ జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు,ఇతర డెలిగేట్లు,తదితరులు అందరికీ ఆహ్వాన పత్రాలు అందించండంతో పాటు వారికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తగిన రవాణా, వసతి వంటి అన్నిఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు. 

రెండు రోజులపాటు జరగనున్నఈగ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుల్లో వివిధ సెక్టార్లపై పెద్ద ఎత్తున చర్చ జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఏరో స్పేష్ అండ్ డిఫెన్సు,అగ్రి అండ్ పుడ్ ప్రాసెసింగ్,ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు,హెల్తు కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్,ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రోకెమికల్స్,రెన్యువల్ ఎనర్జీ,ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్,టెక్స్టైల్స్ అండ్ అపారెల్స్, టూరిజం,స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్,ఎలక్ట్రానిక్స్,స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఐటి అండ్ జిసిసి వంటి రంగాలపై పెద్దఎత్తున చర్చ జరగనుందని సీఎస్‌ పేర్కొన్నారు. ప్రతి రంగంలోను చర్చకు సంబంధించి ఇతర ప్రతినిధులతోపాటు ఇద్దరు అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనే చూడాలని చెప్పారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్ల  సమ్మిట్‌కు సంబంధించి ఈనెల 14వతేదీన బెంగుళూర్ లోను,17న చెన్నెలోను,20న ముంబై లోను,24న హైదరాబాదులోను డొమెస్టిక్ రోడ్డు షోలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి తెలిపారు.ఈసదస్సుకు వచ్చే ఆహ్వానితులందరికీ త్వరితగతిన ఆహ్వాన పత్రికలు అందించే ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు సదస్సులో పాల్గొన్నఆహ్వానితులుకు జ్ణాపికలు అందించేందుకు వీలుగా జ్ణాపికల ఎంపికను కూడా త్వరగా పూర్తి చేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు.

ఇంకా ఈసమావేశంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు విజయవంతానికి సంబంధించి పలు అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులతో సమీంచారు. ఈసమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్,ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరిష్ కుమార్ గుప్త, చేనేత జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఐటిశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్,పరిశ్రమలు శాఖ అధికారులు,సిఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.అలాగే వీడియో లీంక్ ద్వారా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ భార్గవ,వై.శ్రీలక్ష్మి,కె.విజయానంద్, ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, విశాఖపట్నం పోలీస్ కమీషనర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top