విద్యుత్‌ ఉద్యోగుల పీఆర్సీకి కమిటీ | Committee for Electricity Employees PRC | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల పీఆర్సీకి కమిటీ

Oct 15 2026 3:41 AM | Updated on Oct 15 2026 3:41 AM

Committee for Electricity Employees PRC

కమిటీ చైర్మన్‌గా ఏపీ జెన్‌ కో ఎండీ నియామకం 

ఐదు సంస్థలకు సంబంధించి ఆరు నెలల్లో నివేదిక 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఐదు విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రభుత్వం పీఆర్సీ చర్చల కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సుల సవరణపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తూ ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. 

కమిటీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అందులో పేర్కొన్నారు. ఏపీ జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమిటీ చైర్మన్‌గా, ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్‌) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌ సంస్థల సీఎండీలు సభ్యులుగా ఉంటారు. అవసరమైతే కాస్ట్‌ అకౌంటెంట్‌ను నిపుణుడిగా నియమించుకోవచ్చు. వేతన శ్రేణులు, అలవెన్సులు, పెన్షన్లు, కుటుంబ పెన్షన్లపై కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది.  

త్వరగా నివేదిక ఇవ్వాలి 
ఆరు నెలల గడువు ఉద్యోగులను నిరాశకు గురిచేస్తోందని, త్వరగా నివేదిక ఇవ్వాలని ఏపీ పవర్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నపూస సుబ్బిరెడ్డి డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న నిత్యావసరాలు, విద్య, వైద్య ఖర్చులకు అనుగుణంగా మెరుగైన వేతన సవరణ చేయాలని కోరారు. గతంలో తొలగించిన వెయిటేజీ ఇంక్రిమెంట్లను పునరుద్ధరించాలని, కాంట్రాక్టు కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం ఇవ్వాలని, వారిని సంస్థల్లో విలీనం చేసుకోవాలని కోరారు. 

2004 వరకు నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పే రివిజన్‌ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, ఉద్యోగ సంఘాలతో పరస్పర చర్చల ద్వారా న్యాయసమ్మతమైన వేతన సవరణకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీఎస్పీఈ జేఏసీ) కోరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement