చిక్కటి కాఫీ.. చక్కటి మిరియం

Coffee Brewing in Visakhapatnam Agency - Sakshi

మన మన్యం కాఫీ కమ్మదనమే వేరు. ఆ ఘుమఘుమలు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాయి. గిరి రైతుకు సిరులు కురిపిస్తున్న ఆ పంట ఈ ఏడాదీ విరగ్గాసి లాభాలు అందించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కాఫీ అంతర పంట మిరియం పాదులు కూడా గింజ కడుతుండడంతో ఏజెన్సీ రైతులు ఆనందంతో ఉన్నారు. కాఫీ, మిరియాల పంటలు ఒకేసారి గింజ దశలో కళకళలాడుతుండడం విశేషం.

పాడేరు : విశాఖ ఏజెన్సీలో కాఫీ, అంతర పంట మిరియాలు ఈ ఏడాదీ గిరిజన రైతులకు సిరులు కురిపించనున్నాయి. ఏటా ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు జీవనోపాధికి కాఫీ పంట ప్రధానంగా మారింది. విశాఖ మన్యంలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ పంటకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరుంది. నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తికి కేరాఫ్‌ అడ్రస్‌గా విశాఖ ఏజెన్సీని అనేక దేశాలు గుర్తించాయి. ప్రపంచంలో బ్రెజిల్‌ లోని కాఫీ పంట నంబర్‌ వన్‌గా నిలుస్తుండగా మన దేశానికి సంబంధించి కర్ణాటక తర్వాత విశాఖ ఏజెన్సీలోని గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ పంటకు నాణ్యతలో మూడో స్థానం లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిజనులంతా ఏటా కాఫీ తోటల సాగును విస్తరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే విశాఖ ఏజెన్సీవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ తోటలకు ఎంతో మేలు చేసింది. కాఫీ మొక్కలకు పూల పూత కూడా ముందుగానే ఏర్పడింది. వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ మొక్కలకు గింజ దశ కూడా వేగంగా ఏర్పడింది. ఎక్కడ చూసినా కాఫీ తోటల్లో మొక్కలన్నింటికీ కాఫీ గింజలు కాపు విరగ్గాయడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడులు అధికంగా ఉంటాయని కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

లక్షా 14వేల ఎకరాల్లో ఫలసాయం   
ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలో 2.21లక్షల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. 2,05,464 మంది గిరిజన రైతులు కాఫీ తోటలు సాగు చేస్తున్నారు. 1.58 లక్షలకు పైగా ఎకరాల కాఫీ తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నా పూర్తిస్థాయిలో 1.14లక్షల ఎకరాల్లోని తోటలే అధిక దిగుబడి నిస్తున్నాయి. ఈ తోటల్లో ప్రస్తుతం కాఫీ కాపు అధికంగా ఉంది. ఏజెన్సీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గింజ దశలో ఉన్న కాఫీ పంటకు మరింత మేలు చేస్తుంది. ఈ ఏడాది కూడా అక్టోబర్‌ నెలకే ఫలసాయం రావొచ్చు.  

ఈ ఏడాది మరింత దిగుబడి   
వాతావరణ పరిస్థితులు అనుకూలమై కాఫీ తోటలకు ఎంతో మేలు చేస్తుండడంతో ఈ ఏడాది కూడా కాఫీ దిగుబడులు మరింత పెరగనున్నాయని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది 11వేల మెట్రిక్‌ టన్నుల క్లీన్‌ కాఫీ గింజలు దిగుబడి సాధించగా ఈ ఏడాది 12వేల మెట్రిక్‌ టన్నులు అధిక దిగుబడులు వస్తాయని కేంద్ర కాఫీబోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్ల నుంచి కాఫీ తోటలకు వాతావరణం మేలు చేస్తుండడం గిరిజన రైతులకు మంచి దిగుబడులిస్తున్నాయి.  

మిరియం ముందస్తు పూత   
ఏజెన్సీలోని కాఫీ తోటల్లో అంతర పంటగా సాగవుతున్న మిరియాల పాదులకు వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. దీంతో ఎన్నడు లేని విధంగా ముందస్తుగానే మిరియాల పాదులకు కూడా పూత ప్రారంభమైంది. పాదులకు గెలలు ఏర్పడడంతో మెల్ల మెల్లగా గింజ కడుతుండడంతో గిరిజన రైతులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, మిరియాల గింజలు ఒకేసారి గింజ దశలో కళకళలాడుతుండడం విశేషం. ఏజెన్సీవ్యాప్తంగా 98వేల ఎకరాల కాఫీ తోటల్లో ఎకరానికి వంద మిరియాల పాదులు ఉన్నాయి. ప్రతి ఏడాది 3వేల మెట్రిక్‌ టన్నుల మిరియాల దిగుబడి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులన్నీ మిరియాల పాదులకు మేలు చేయడంతో ఆయా పాదులు పూతదశకు చేరుకున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top