వైఎస్‌ జగన్‌: పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు | YS Jagan Review Meeting with Health and Medical Department Over Nadu-Nedu Program - Sakshi
Sakshi News home page

పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్‌

Oct 29 2020 2:05 PM | Updated on Oct 29 2020 4:18 PM

CM YS Jaganmohan Reddy Review Meeting On Medical And Health Department In Nadu Nedu - Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని, ఆస్పత్రుల్లో శానిటేషన్, పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జనరేటర్లు పనిచేయడం లేదు.. ఏసీలు పనిచేయడంలేదు.. శుభ్రత లేదు.. శానిటేషన్‌ లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులతో దీటుగా ఉండాలని చెప్పారు. గురువారం వైద్య ఆరోగ్య రంగంలో నాడు– నేడుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాడు – నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్‌ కాలేజీలు, ఉన్న మెడికల్‌ కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు, అలాగే సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష చేశారు. నిధుల సమీకరణ, టెండర్లు, జరుగుతున్న పనులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. మొత్తంగా వీటికి 17,300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలి. ప్రతి అంశానికీ బాధ్యులు ఉండాలి. ఆస్పత్రిలో పరికరాల దగ్గరనుంచి ఏసీల వరకు కూడా ప్రతిదీ సక్రమంగా పని చేయాలి. అన్నిరకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదు. 16 మెడికల్‌ కాలేజీలను కొత్తగా తీసుకువస్తున్నాం. భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఆస్పత్రుల నిర్మాణంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలన చేసి వాటిని పాటించండి. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు నవంబరులోగా.. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నర్సాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు డిసెంబరులో.. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు జనవరిలో టెండర్లు నిర్వహిస్తాం. వీటికోసం 7500 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న మెడికల్‌ కాలేజీల్లో నాడు – నేడు పనులకు మరో రూ. 5472 కోట్లు ఖర్చు అవుతుంది. ( ఆ ఊరేగింపు సోమిరెడ్డికే చెల్లింది: కాకాణి )

 వీటికి అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలి. నిర్మాణ రీతిలో హరిత విధానాలు పాటించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాలి. ఆరోగ్యశ్రీ రిఫరల్‌ విధానం బాగుండాలి. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేంతవరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వండి. అక్కడున్న హెల్త్‌ అసిస్టెంట్‌/ఏఎన్‌ఎంల ద్వారా రిఫరల్‌ చేయించాలి. ఎంపానల్‌ అయిన ఆస్పత్రుల జాబితాను గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచండి. ఎవరైనా వైద్యం కావాలనుకుంటే.. ఆ రోగికి మార్గనిర్దేశం చేయాలి.  నవంబర్‌ 13 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు(ఇప్పటికే 7 జిల్లాల్లో అమలవుతోంది) మిగిలిన 6 జిల్లాల్లో (శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం) చికిత్స దీంతో అన్ని జిల్లాలకూ అందుబాటులోకి వస్తోంది. అవసరం అనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను ఈ జాబితాలో చేర్చండి. అంతిమంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement