ఏపీ పోలీస్‌ నంబర్‌ వన్

AP police department has achieved another rare record at national level - Sakshi

స్కోచ్‌ అవార్డుల్లో వరుసగా రెండోసారి ఫస్ట్‌

మొత్తం 83 అవార్డుల్లో 48 మన పోలీసులకే..

దిశ, పోలీస్‌ సేవా యాప్‌లకు బంగారు పతకాలు

ఏడాదిలోనే 85 అవార్డులు కైవసం 

అధికారులు, సిబ్బందికి సీఎం జగన్‌ అభినందనలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్‌ శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సాధించింది. అత్యుత్తమ ప్రతిభతో ‘స్కోచ్‌’ అవార్డుల్లో సగానికిపైగా కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి తన సత్తా చాటింది. దిశ, పోలీస్‌ సేవా యాప్‌లకు బంగారు పతకాలు రాగా.. మరికొన్ని విభాగాల్లో రజత పతకాలను రాష్ట్ర పోలీస్‌ శాఖ దక్కించుకుంది. పోలీస్‌ శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్‌ గ్రూప్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో భాగంగా బుధవారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ వివరాలను ఏపీ పోలీస్‌ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. స్కోచ్‌ గ్రూప్‌ మొత్తం 83 జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా.. రాష్ట్ర పోలీస్‌ శాఖ రికార్డు స్థాయిలో 48 అవార్డులను దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ(9), మహారాష్ట్ర(4), పశ్చిమ బెంగాల్‌(4), హిమాచల్‌ప్రదేశ్‌(3), మధ్యప్రదేశ్‌(2), తమిళనాడు(2), ఛత్తీస్‌గఢ్‌(2) ఉన్నాయి. ఇక తెలంగాణ, అరుణాచల్‌ ప్రదేశ్, అసోం, బిహార్, గుజరాత్, హరియాణా, ఒడిశా, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి.

దిశ మొబైల్‌ అప్లికేషన్‌ కు వచ్చిన స్కోచ్‌ అవార్డు  

పోలీస్‌ శాఖకు సీఎం అభినందనలు..
ఏడాదిలోనే 85 జాతీయ స్థాయి అవార్డులను అందుకున్న ఏపీ పోలీస్‌ శాఖను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. అలాగే ఏపీ పోలీస్‌ టెక్నాలజీ విభాగాన్ని, అవార్డులు అందుకున్న పలు విభాగాల పోలీసు సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అవార్డులు అందుకుని, రెండోసారి కూడా జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచిన ఏకైక ప్రభుత్వ విభాగం ఏపీ పోలీస్‌ శాఖ కావడం గర్వంగా ఉంది. మరింత జవాబుదారీతనంతో ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నాం.     
– డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 

దిశ, పోలీస్‌ సేవా భేష్‌..
ఏపీ పోలీసులు తీసుకొచ్చిన దిశ మొబైల్‌ అప్లికేషన్, పోలీస్‌ సేవా యాప్‌లకు బంగారు పతకాలు లభించాయి. మరో 11 విభాగాల్లో అందిస్తున్న సేవలకు రజత పతకాలు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 37 అవార్డులను దక్కించుకున్న రాష్ట్ర పోలీస్‌ శాఖ.. ఇప్పుడు వచ్చిన వాటితో కలిపి మొత్తం 85 అవార్డులతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. దిశ, దిశ సంబంధిత విభాగాల్లో అందిస్తున్న టెక్నాలజీ సేవలకు 5 అవార్డులు వచ్చాయి. కోవిడ్‌ సమయంలో అందించిన మెరుగైన సంక్షేమానికి 3 , ఏపీ పోలీస్‌ టెక్నికల్‌ విభాగానికి 13 అవార్డులు, సీఐడీకి 4, కమ్యూనికేషన్‌కు 3, విజయవాడకు 3, కర్నూలు జిల్లాకు 3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలకు రెండేసి చొప్పున అవార్డులు వచ్చాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు(అర్బన్‌), గుంటూరు(రూరల్‌), కృష్ణా జిల్లాకు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top