జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

CM YS Jagan Tanuku Visit Updates West Godavari District - Sakshi

Time 1.20 PM
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించారు.

ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు: సీఎం జగన్‌
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. 'ఇప్పటి వరకు 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇది. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు.

సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు. గతంలో నివసించే హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్‌ చేయించాము. 26వేల కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశాము. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేశాము. రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఇచ్చాము. 52లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ అక్షరాలా రూ.లక్షా 58వేల కోట్లు. అందరూ లబ్ధి పొందాలనే ఆలోచనలో భాగంగానే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఉగాది వరకు పొడిగిస్తున్నాం' అని సీఎం జగన్‌ అన్నారు.

పేదల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం జగన్‌ మాత్రమే
టీసీఎస్‌ ఉద్యోగి శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఓటీఎస్‌ పథకం మా కుటుంబానికి ఎంతో స్వాంతన కలిగించింది. రాష్ట్రంలో పేదల గురించి సీఎం జగన్‌ ఆలోచించినంతగా మరే వ్యక్తి ఆలోచించలేరు. ఈ పథకంపై టీడీపీ నాయకులు మా ఇంటికి వచ్చి ప్రభుత్వం వచ్చాక రూపాయి లేకుండా ఇంటి పట్టా ఇస్తామని చెప్పారు. ఆ విషయం వినగానే నాకు నవ్వొచ్చింది. నాతో మాట్లాడిన పాలకులే మూడేళ్ల కింద అధికారంలో ఉన్నారు. ఆనాడు ఏమీ చేయక ఇప్పుడు ఏదో చేస్తామని మభ్యపెట్టడం టీడీపీ నాయకులకే సాధ్యమని అన్నారు.

లబ్ధిదారు సుజాత భావోద్వేగం
సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారు సుజాత మాట్లాడుతూ.. 'ఈ పథకం పెట్టినందుకు మీకు ధన‍్యవాదాలు అన్న. 9 ఏళ్ల క్రితం నేను ఇళ్లు కట్టుకున్నా అయితే ఇప్పటిదాకా ఇంటికి సంబంధించి నాకు ఎటువంటి ఇంటి పత్రం లేదు. ఇప్పుడు ఈ పథకం క్రింద దాదాపు పది లక్షల రూపాయల ఆస్తిని నా చేతిలో పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందన్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 

తణుకు బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్‌

11:35AM
తణుకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

08:10AM
సాక్షి, ఏలూరు/తణుకు అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి హోదా లో ఆయన తొలిసారి తణుకు రానుండటంతో అధి కార యంత్రాంగం, పార్టీ నాయకులు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులకు గృహహక్కు పత్రాల పంపిణీని సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మందికి పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బాండ్లను ఆయా మండల కేంద్రాలకు పంపారు. 

భారీ స్వాగత ఏర్పాట్లు : తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణమంతా వైఎస్సార్‌సీపీ జెండాలతో రెపరెపలాడుతోంది. భారీ కటౌట్లు, స్వాగత ఫ్లెక్సీలు అలరిస్తున్నాయి. మరోవైపు సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు కూడా కావడంతో భారీఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలో సుమారు రూ.171.48 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.
 
ముస్తాబైన స్టాల్స్‌ : సభావేదిక ప్రాంతంలో గృహనిర్మాణ శాఖ, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్‌ పథకం వంటి స్టాల్స్‌ను ముస్తాబుచేశారు. ఫొటో గ్యాలరీ, ఓటీఎస్‌ లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి ఫొటో దిగే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.  

హెలికాప్టర్‌ ట్రయల్‌రన్‌ 
ముఖ్యమంత్రి ప్రయాణించనున్న హెలికాప్టర్‌ ట్రయల్‌రన్‌ నిమిత్తం తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల సమీపంలోని హెలీప్యాడ్‌కు వచ్చింది. సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం హెలికాప్టర్‌లో వచ్చి స్వయంగా పరిశీలించారు.  

రూ.10 వేల కోట్ల భారం తగ్గింపు 
ఓటీఎస్‌ పథకం ద్వారా సంపూర్ణ గృహహక్కు కల్పించే దిశగా 22–ఏ తొలగింపు, స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్‌ పత్రం, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సుమారు రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించే దిశగా ఓటీఎస్‌ పథకాన్ని రూపొందించి అమలుచేస్తున్నారు.  

జిల్లాలో 1.04 లక్షల మంది ముందుకు..  
జిల్లాలో ఓటీఎస్‌ పథకానికి 1,43,072 మంది అర్హులు ఉండగా ఇప్పటివరకూ 1,04,524 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరందరికీ శాశ్వత గృహహక్కు పత్రాలు అందించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు.   

అధునాతన రీతిలో సభావేదిక 
హైస్కూల్‌ ఆవరణలో అధునాతన రీతిలో సభావేదిక, ప్రజలు కూర్చునే ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. వేదికపై భారీ స్క్రీన్స్‌ ఏర్పాటుచేశారు. మంత్రి శ్రీరంగనాథరాజు, సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తణుకు, నిడదవోలు ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, జి.శ్రీనివా సనాయుడు, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, హౌసింగ్‌ ఎండీ భరత్‌గుప్తా, జేసీ హిమాన్షు శుక్లా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పోలీసులు, ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

సభావేదికపై ఏర్పాటుచేసిన స్క్రీన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top