నాడు.. దోచుకో.. పంచుకో.. తినుకో 'నేడు నేరుగా లబ్ధి'

CM YS Jagan Started YSR Rythu Bharosa Funds At Nandyala Allagadda - Sakshi

వాళ్లది డీపీటీ.. మాది డీబీటీ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

రైతు సంక్షేమం కోసం దేశంలోనే ఇన్ని కార్యక్రమాలు జరగలేదు

అన్నదాతలకు మూడున్నరేళ్లలో రూ.1.33 లక్షల కోట్లు అందించాం

వ్యవసాయ ఉత్పత్తులూ భారీగా పెరిగాయి.. టీడీపీ హయాంలో ఏటా కరువు మండలాలే

మూడున్నరేళ్లుగా కరువుకు తావే లేదు.. రైతన్నల్లో సంతోషం

ఇన్ని మంచి పనులు చేస్తున్నా ఎల్లో మీడియా, చంద్రబాబు, దత్తపుత్రుడు కుతంత్రాలు 

ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చే పార్టీలు, మీడియా సంస్థలు కూలిపోవాలి

ఆళ్లగడ్డలో రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం జగన్‌

50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,096 కోట్లు జమ 

మూడేళ్ల నాలుగు నెలల్లో మీ బిడ్డ బటన్‌ నొక్కి అక్షరాలా రూ.1,74,931 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. అప్పట్లోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌.. అప్పుల గ్రోత్‌రేట్‌ కూడా అప్పటి కంటే ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేదు? అని ఆలోచించాలని అడుగుతున్నా!  అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు దోచుకో, పంచుకో, తినుకో అనేలా డీపీటీ అనే పథకం అమలయ్యేది. ఈ రోజు మీ బిడ్డ ‘డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌’తో బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా మీ ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. అప్పట్లో అంత దోచుకున్నా ఎవడూ రాయడు, ప్రశ్నించడు. కారణం.. వీరందరిదీ గజదొంగల ముఠా కాబట్టి! దేవుడి దయతో, మీ అందరికీ మంచి చేసే పరిస్థితులు రావాలని, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా సంస్థలు కూలిపోవాలని కోరుతున్నా.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు: రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని త్రికరణ శుద్ధిగా విశ్వసించి అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అన్నదాతకు ఇంతగా తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ, ఎక్కడా లేదని మీ బిడ్డగా చెప్పేందుకు గర్విస్తున్నానన్నారు. ప్రతి పథకాన్ని క్రమం తప్పకుండా కాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం అమలు చేస్తూ ప్రతి కుటుంబానికీ అండగా నిలిచామన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత  సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో  ప్రారంభించారు. బటన్‌ నొక్కి 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,096 కోట్లు జమ చేశారు. రైతులకు మెగా చెక్‌ అందచేసి లబ్ధిదారులతో ముచ్చటించారు. వారితో కలసి గ్రూపు ఫోటో దిగారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆ వివరాలివీ..

82 శాతం చిన్నకారు రైతులకు ప్రయోజనం
మూడేళ్ల నాలుగు నెలల పాలనలో దేశంలోని 27 రాష్ట్రాలలో ఎక్కడా లేనివిధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి ఆలోచిస్తే కేవలం అర హెక్టార్‌ అంటే 1.25 ఎకరాలలోపు ఉన్నవారు 68 శాతం మంది ఉన్నారు. ఒక హెక్టార్‌ వరకూ అంటే 2.5 ఎకరాలు ఉన్న రైతులు 82 శాతం ఉన్నారు. వీరికి ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న రైతుభరోసా సొమ్ము దాదాపు 80 శాతం పెట్టుబడి ఖర్చులకు సరిపోతుంది. అన్నదాతలు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. పంట వేసే సమయానికి పెట్టుబడి సొమ్ము చేతికందాలి.

ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా నేరుగా, పారదర్శకంగా ఖాతాల్లో ఈ డబ్బులు మూడు విడతల్లో జమ చేస్తున్నాం. ఏటా ఖరీఫ్‌ సీజన్‌ మొదలయ్యేలోపే మే నెలలో రూ.7,500, పంటలు కోతకు వచ్చేముందు అక్టోబర్‌లో మరో రూ.4 వేలు, సంక్రాంతి సందర్భంగా జనవరిలో మరో రూ.2 వేలు కలిపి మొత్తం రూ.13,500 రైతన్నల చేతిలో పెడుతున్నాం. మూడున్నరేళ్లలో వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ ద్వారా దాదాపు 50.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.25,971 కోట్లకుపైగా నేరుగా జమ చేశాం. అంటే ఏటా దాదాపు రూ.7 వేల కోట్లను రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఒక్కో కుటుంబానికి రూ.51 వేలు నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లోకి జమ చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. 

కౌలు, గిరిజన రైతులకూ భరోసా
పట్టా భూములున్న రైతులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కౌలు రైతులు, దేవదాయశాఖ భూములు సాగు చేస్తున్న వారు, గిరిజన ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు కూడా రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అందచేసి మంచి చేయగలుగుతున్నాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయానికి సాయంగా, అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు మూడేళ్ల నాలుగు నెలల్లో రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు వ్యయం చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన సభకు హాజరైన భారీ జన సందోహం 

మాఫీ పేరుతో బాబు మోసం
చంద్రబాబు పాలన చూశారు.. మన పాలన చూస్తున్నారు. తేడా ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. దీంతో రైతులు బ్యాంకు గడప ఎక్కలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి కాకుండా తిరిగి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగలుగుతున్నారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో వడ్డీలేని రుణాల కింద చెల్లించింది రూ.685 కోట్లు మాత్రమే. 2016 అక్టోబర్‌ నుంచి ఆ పథకాన్ని రద్దు చేశారు. మీ బిడ్డ తిరిగి ఆ పథకాన్ని తీసుకొచ్చాడు. ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో రూ.1,282 కోట్లు చెల్లించామని సగర్వంగా చెబుతున్నా.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో రూ.3,64,624 కోట్లు అందితే ఇప్పుడు మూడేళ్ల నాలుగు నెలల పాలనలోనే రూ.5,48,518 కోట్లు అందచేశాం. తేడా గమనించాలని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో పంటల బీమా ప్రీమియంలో రైతులు, ప్రభుత్వం వాటాలు చెల్లించాలి. ఈ రెండూ సక్రమంగా జరగకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్‌లో నష్టం వాటిల్లింది. ఆ ఐదేళ్లలో 30.80 లక్షల మందికి రూ.3,412 కోట్లు మాత్రమే బీమా పరిహారంగా దక్కితే ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో 44.28 లక్షల మంది రైతులకు రూ.6,684 కోట్ల బీమా సొమ్ము రైతుల ఖాతాల్లోకి జమ అయింది. తేడా మీరే గమనించండి. రైతన్నల నుంచి బీమా సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది.

పంట నష్టపోతే అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ
చంద్రబాబు హయాంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే పట్టించుకున్న  పరిస్థితి లేదు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ పేరుకే ఉండేది. ఎప్పుడు వస్తుందో? ఎవరికి వస్తుందో? తెలియదు. చివరకు 2017–18, 2018–19 కాలానికి రూ.2,558 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు మూడేళ్ల నాలుగు నెలల్లో 20.85 లక్షల మంది రైతులకు రూ.1,800 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందచేశాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసే లోపే డబ్బులు జమ అవుతున్నాయి. ఈ – క్రాప్‌ డేటాతో సహా సోషల్‌ ఆడిట్‌తో పారదర్శకంగా ప్రతీ రైతన్నకు తోడుగా నిలుస్తున్నాం.

ఇవాళ ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ రైతులకు క్రమం తప్పకుండా అందుతోంది. గొప్ప మార్పు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ప్రతీ గ్రామంలో రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. విత్తనం మొదలు పంట విక్రయం వరకూ వారికి తోడుగా నిలుస్తున్నాయి. ఈ – క్రాపింగ్‌ ప్రతీ గ్రామంలో నమోదవుతోంది. ఈ– డేటా ఆధారంగా ప్రతీ రైతుకు, ప్రతీ పథకం వివక్ష, లంచం లేకుండా నేరుగా అందుతోంది.

పరిహారం అందని కుటుంబం ఒక్కటీ లేదు
రైతన్నలు ఎవరైనా దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే గతంలో సానుభూతి కూడా చూపలేదు. అసలు ఆత్మహత్య చేసుకున్నవారు రైతులే కాదనే మాటలు వినిపించేవి. ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉంటే వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. పాసు పుస్తకాలున్న అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడితే పరిహారం అందని రైతన్నలు ఒక్కరంటే ఒక్కరూ లేరు. సీసీఆర్‌టీ కార్డులున్న కౌలు రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే వారికీ పరిహారం అందించాం.

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
ఆర్బీకేలను యూనిట్‌గా తీసుకుని అర్హులెవరూ మిగిలిపోకుండా సంతృప్త స్థాయిలో మంచి చేస్తున్నాం. పగటిపూట 9 గంటల ఉచిత కరెంటు, కనీస మద్దతు ధరతో పంటల కొనుగోలు, ఆక్వా రైతులను ఆదుకోవడం, రైతులను భాగస్వాములుగా చేసి ఆర్బీకే స్థాయిలో సలహా మండళ్ల ఏర్పాటు, వ్యవసాయ ఉపకరణాలను కమ్యూనిటీ సెంటర్ల ద్వారా అందించడం, పాడి రైతులకు సైతం గిట్టుబాటు ధర లభించేలా అమూల్‌ సంస్థను తేవడం లాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 

హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, ఇషాక్‌బాషా, ఎమ్మెల్యేలు బిజేంద్రారెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఆర్థర్, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి పాల్గొన్నారు.  

మన ఖర్మ ఏమిటంటే..
మన ఖర్మ ఏమిటంటే గొప్ప మార్పులు జరుగుతున్నా, పండ్లు కాసే చెట్టుకే రాళ్లు పడతాయి అన్నట్లు రాష్ట్రంలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నా ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు ఒక దత్తపుత్రుడు రాష్ట్రంలో ఏం చేస్తున్నారో మీకు తెలిసిందే. వారి చేతిలో మీడియా ఉంది. వారు రాసిందే రాత. వారు ఏం చూపిస్తే అదే జరుగుతుందనే భ్రమలో ఉన్నారు. గర్వం పెరిగిపోయింది. వారికి చెందిన వ్యక్తి సీఎం స్థానంలో లేరు కాబట్టి ఆయన్ను తెచ్చేందుకు కుతంత్రాలు పన్నుతున్నారు.

ఆనాటికి, ఇప్పటికి తేడా గమనించాలని అడుగుతున్నా. ఆ రోజు కంటే ఈ రోజు మన బతుకులు బాగున్నాయా? లేదా? అనేది మీరు గుండెలపై చేతులు వేసుకుని ఆలోచించాలని కోరుతున్నా. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలిసిందే. పరిపాలన ఎలా సాగిందో మీరంతా చూసిన వారే. కేవలం రైతుల కోసం మీ బిడ్డ రూ.1,33,527 కోట్లు ఖర్చు చేశాడు. ఇది మీ ప్రభుత్వం. మీ బిడ్డ బటన్‌ నొక్కి మూడున్నరేళ్లలో అక్షరాలా రూ.1,74,931 కోట్లు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేకుండా పారదర్శకంగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వెళ్లింది. ఇలాంటి మంచి పనులు చేస్తున్న మీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నా. 

నాడు ఏటా కరువే.. నేడు తావే లేదు
దేవుడి దయ, మీ అందరి దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల నాలుగు నెలల్లో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనను గమనిస్తే 2014లో 238 కరువు మండలాలు, 2015లో 359 మండలాలు, 2016లో 301 మండలాలు, 2017లో 121 మండలాలు, 2018 ఖరీఫ్‌లో 347, రబీలో మరో 257 కరువు మండలాలు ప్రకటించారు. చంద్రబాబు, కరువు రెండూ కవల పిల్లలే అన్నట్లుగా పాలన సాగింది. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. మంచి వర్షాలు కురుస్తున్నాయి.

అక్టోబర్‌ వరకూ సాధారణ వర్షపాతం 668 మిల్లీమీటర్లు కాగా ఈ సీజన్‌లో ఇప్పటికే 695 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 4 శాతం అధికంగా వర్షాలు కురిసి రాష్ట్రం కళకళలాడుతోంది. 21 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైతే ఐదు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ కురిసింది. గతంలో 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలను తీసుకున్నా మూడేళ్ల నాలుగు నెలల్లో ఏ ఒక్క ఏడాదీ ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి.

చంద్రబాబు పాలనతో పోల్చితే పంటల విస్తీర్ణంతో పాటు ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగింది. నాడు ఐదేళ్లలో సగటున 154 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా మన ప్రభుత్వంలో 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతున్నాయి. అంటే 13.24 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ప్రతీ గ్రామంలో రైతన్నలు సంతోషంగా ఉన్నారని ఈ దిగుబడులే చెబుతున్నాయి. దీంతోపాటు వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు కార్మికులకు కూడా మంచి జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల నాలుగు నెలల్లో ప్రతీ రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో కూడా భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

దివ్యాంగురాలికి ముఖ్యమంత్రి భరోసా
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి తక్షణ సాయం 
నంద్యాల: అనారోగ్యంతో బాధపడుతూ తనను కలిసిన ఓ దివ్యాంగురాలికి నేనున్నానంటూ సీఎం జగన్‌ భరోసా కల్పించారు. నంద్యాల జగజ్జననీనగర్‌కు చెందిన హేమపావని మెదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. వైద్యం చేయించుకునే స్థోమత ఆ కుటుంబానికి లేదు. సీఎం జగన్‌ సోమవారం ఆళ్లగడ్డ వస్తున్న విషయం తెలుసుకొని బాధితురాలు తండ్రి శ్రీనివాసులుతో కలిసి హెలిపాడ్‌ వద్దకు వచ్చింది. సీఎంను కలసి తన సమస్యను మొరపెట్టుకుంది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్‌ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిని పిలిచి బాధితురాలి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో తనకు వివరాలు ఇవ్వాలని సూచించారు. అంతేగాకుండా తక్షణమే ఆ బాలికకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.లక్ష మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.  

భయం పోయింది.. 
నాకు ఏడెకరాల పొలం ఉంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం అంటే పండుగ అయింది. భయం పోయింది. రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పటిదాకా రూ.48 వేలు వచ్చాయి. ఇప్పుడు మరో రూ.4 వేలు జమ కానున్నాయి. అంతేకాకుండా పంట నష్టం కింద రూ.30 వేలు వచ్చిందన్నా.

రైతులంతా సీహెచ్‌ఎస్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని సబ్సిడీపై ట్రాక్టర్, టిల్లర్, కంకుల మిషన్‌ తీసుకున్నాం. దీనికి రూ.13.50 లక్షలు కాగా సబ్సిడీ కింద రూ.5.40 లక్షలు ఖాతాలో జమ అయ్యాయి. గతంలో మందు మూటెలు (ఎరువులు) కావాలంటే మండల కేంద్రం శిరివెళ్లకు వెళ్లి క్యూలైన్లలో నిలుచుని అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు గ్రామంలోని ఆర్బీకేలో మందు బస్తాలు అందచేస్తూ అటు నుంచి అటే పొలానికి వెళ్లి చల్లుకునేలా చేశావన్నా.  రెతుల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? 
    – గుర్రప్ప ,రైతు, కోటపాడు  

నిన్ను చూడాలని.. 
గతంలో రెండు సార్లు వరి పంట నష్టపోవడంతో బాధపడ్డా. మళ్లీ పంట వేయకముందే పంట నష్టం కింద రూ.40 వేలు జమ చేశారు. బ్యాంకులో రూ.20 వేలు తీసుకుంటే సున్నా వడ్డీ కింద రూ.3 వేలిచ్చారు.  అధికారులే మా దగ్గరకు వచ్చి వివరించి ప్రయోజనం చేకూరుస్తున్నారు. మీరు సీఎం అయ్యాకే మా నాన్నకు పింఛన్‌ వచ్చిందన్నా. నాన్నకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా గుండె జబ్బుకు, కంటి వెలుగు కింద అమ్మకు కంటి ఆపరేషన్‌ చేశారు. వాళ్లిద్దరూ నిన్ను చూడాలని మీటింగ్‌కు వచ్చి జనంలో కూర్చున్నారన్నా. మానాన్న బతికారంటే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ చలువే కారణం. రైతుల కోసం మీరు చేపడుతున్న పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.  
    – కృష్ణ నాయక్, రైతు, బాచేపల్లె తాండ  

ఆర్బీకేలతో రైతన్నలకు అండగా 
ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్, ఇన్సూరెన్స్‌ చేస్తున్నాం. రైతన్నకు తోడుగా నిలిచి ప్రతి పథకం అందిస్తూ నష్టపోకుండా చూస్తున్నాం. చంద్రబాబు హయాంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అంతా కల్తీనే. వీటితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్తీని అరికట్టేందుకు రాష్ట్రంలో కేవలం 12 ల్యాబ్‌లు మాత్రమే చంద్రబాబు పాలనలో ఉండగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 147 ల్యాబ్‌లు నియోజకవర్గ స్థాయిలో కనిపిస్తున్నాయి. 70 ల్యాబ్‌లు ఇప్పటికే పూర్తై రైతులకు సేవలు అందిస్తున్నాయి. తక్కిన 77 నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో రెండు ల్యాబ్‌లు, 4 ప్రాంతీయ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top