సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Review on Southern Zonal Council Meeting Arrangements - Sakshi

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: నవంబర్‌ 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దానివల్ల సమావేశంలో చర్చ జరిగి మేలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రెవిన్యూలోటు, రేషన్‌ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లైస్‌ బకాయిల అంశాలపై చర్చించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సదరన్‌జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలని ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు.

కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల మీద సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు తయారుచేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. కౌన్సిల్‌ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై కూడా తగిన రీతిలో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షత వహించనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్‌ అతిథ్యమిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాండిచ్చేరి, అండమాన్‌నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం.. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎక్స్‌ అఫిషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ (స్టేట్‌ రీఆర్గనైజేషన్‌) ఎల్‌ ప్రేమచంద్రారెడ్డి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్‌ కుమార్, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, అదనపు డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ఎ రవిశంకర్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: (చూడముచ్చటగా ఒకే రీతిలో.. ఇక ప్రభుత్వ భవనాలకు ఏకీకృత డిజైన్లు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top