Cyclone Yaas: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

CM YS Jagan Review On Impact Of Cyclone Yaas - Sakshi

యాస్ తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: యాస్‌ తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

తుపాను వల్ల కోవిడ్‌ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌.. అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్‌ సిలెండర్లకు రీఫిల్లింగ్‌ చేసే ప్లాంట్లకూ విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్‌ జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా విద్యుత్‌ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని సీఎం ఆదేశించారు.

తుపాను కారణంగా ఒడిశా ప్లాంట్లనుంచి ఆక్సిజన్‌ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత రోజుల్లో ఆక్సిజన్‌ కొరత రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం అన్నారు. ఆక్సిజన్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తుపాను పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలని సీఎం సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్‌ పేషెంట్లను అవసరమనుకుంటే.. తరలింపు ఇప్పుడే పూర్తికావాలని తెలిపారు.

‘‘కోవిడ్‌ కేంద్రాలకు కరెంటు సప్లైకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకటికి రెండు సార్లు పూర్తి స్థాయిలో ఆలోచనలు చేసి సమర్థవంతగా చర్యలు తీసుకోవాలి. అవసరమైన సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను పునఃసమీక్షించుకుని అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట్ల లోతట్టు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

చదవండి: అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌: పాల్గొన్న సీఎం జగన్‌ 
వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ ముందడుగు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top