అంబేడ్కర్‌ విగ్రహాన్ని తాకే అర్హత జగన్‌కే ఉంది! | Sakshi
Sakshi News home page

‘సామాజిక’ సారథి.. అంబేడ్కర్‌ విగ్రహాన్ని తాకే అర్హత జగన్‌కే ఉంది! 

Published Fri, Jan 19 2024 4:33 AM

CM YS Jagan on path of achieving Ambedkar ambitions - Sakshi

సాక్షి, అమరావతి: భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని పరిపాలి­స్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 56 నెలలుగా ఆవిష్కరించిన సామాజిక మహా విప్లవంతో రాష్ట్రమంతటా సాధికారత ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు సింహభాగం అవకాశాలతో దూసుకెళుతుండటం ఇందుకు నిదర్శనం. ముఖ్య­మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అనుసరించాల్సిన విధానమని జగన్‌ స్పష్టం చేశారు. తొలి మంత్రివర్గం ఏర్పాటులోనే దీన్ని రుజువు చేశారు. అంబేడ్కర్‌ సిద్ధాంతాలను ప్రతి అడుగులో ఆచరిస్తూ సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్‌ దేశా­నికే ఆదర్శంగా నిలిచారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. 

రాజ్యాధికారంలో వాటా..
2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటైన క్యాబినెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురికి (80 శాతం) ఆయా వర్గాల నుంచే అవకాశం కల్పించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు.  

శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించగా శాసన మండలి ఛైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌ రాజుకు అవకాశమిచ్చారు. మండలి డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్‌ 11న పునర్‌వ్య­వస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి జగన్‌ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపించలేదు.  వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ కాగా అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం జగన్‌ రాజ్య­సభకు పంపారు.  శాసన మండలిలో వైఎస్సార్‌­సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉండగా వీరిలో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీకి 48 ఎమ్మెల్సీ స్థానాలు దక్కితే చంద్రబాబు కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చారు.

ఆర్థిక తోడ్పాటు..
సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ఆర్థికంగా చేయూ­త ఇవ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించేలా సీఎం జగన్‌ బాటలు వేశారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమ పథ­కాల ద్వారా నగదు బదిలీ(డీబీటీ) రూపంలో రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. ఇక ఇతర పథకాల ద్వారా (నాన్‌ డీబీటీ) రూ.1.67 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా పేదలకు రూ.4.13 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించాయి.

పేద బిడ్డలకు పెద్ద చదువులు..
నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేసిన సీఎం జగన్‌ పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. విప్లవాత్మక సంస్కరణలతో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు విద్యా సాధికారత సాధించేందుకు మార్గం సుగమం చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి రాష్ట్రంలో ఇప్పటిదాకా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా అందులో గత 56 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షల ఉద్యోగాలున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే 80 శాతం ఉద్యోగాలు దక్కాయి. దీన్ని పరిశీలిస్తే ఆయా వర్గాలు విద్యా సాధికారత సా«ధించినట్లు స్పష్టమవుతోంది.

మహిళా సాధికారతలో అగ్రగామి..
వైఎస్సార్‌ ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా సీఎం జగన్‌ మహిళలకు ఆర్థికంగా తోడ్పా­టు అందించారు. రాష్ట్రంలో 30.76 లక్షల మంది అక్క­చెల్లెమ్మలకు రూ.75,670 కోట్ల విలువైన ఇంటి స్థలా­లను ఇవ్వడమే కాకుండా పక్కా ఇళ్లను సైతం నిర్మించి ఇస్తూ వారి సొంతింటి కలను సాకారం చేశారు. కేబినెట్‌ నుంచి స్థానిక సంస్థల వరకూ మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. హోంమంత్రిగా ఎస్సీ మహిళకు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు అవకాశం కల్పించారు. నామినే­టెడ్‌ పదవులు, పనులు 50% మహిళలకే ఇవ్వాలని దేశ చరిత్రలో తొలిసారిగా చట్టం చేసి మరీ మహిళ­లకు న్యాయం చేశారు. మహి­ళా సాధికారతలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 

స్థానిక సంస్థల్లో సంచలనం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గా­లకు 34 శాతం రిజర్వేషన్లు కల్పి­స్తూ సీఎం జగన్‌ ఉత్తర్వులు జారీ చేస్తే  దీనిపై చంద్రబాబు హైకో­ర్టులో టీడీపీ నేతలతో కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజ­ర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ పార్టీ పరంగా తాము 34 శాతం కంటే ఎక్కువే ఇస్తానని సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ మేరకు స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులిచ్చారు. రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరగ్గా 637 చోట్ల వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది.

మండల పరిషత్‌ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో ఏకంగా 9 పదవులు (69 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. రాష్ట్రంలో 14 మున్సి­పల్‌ కార్పొరేష­న్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 14 మేయర్‌ పదవుల్లో 12 పదవులను (86 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరగ్గా 84 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు 58 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులు (69%) ఇచ్చారు.

చారిత్రక చట్టం..
నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వే­షన్లు కల్పిస్తూ చారిత్రక చట్టం చేసి మరీ ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి జగన్‌ పదవులు ఇచ్చారు. నామినేటెడ్‌ పదవు­ల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్‌ చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే తొలిసారి. 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లను నియమించగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవులలో 79 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు  ఇచ్చారు.

137 ప్రభు­త్వ కార్పొరేషన్‌ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవులుంటే 280 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వాటికి ఆయా వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గా­లకు 684 డైరెక్టర్‌ పదవులు ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్‌ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement