CM YS Jagan: ఢిల్లీ బయల్దేరిన సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan Mohan Reddy Delhi Tour - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. సీఎం వెంట సీఎస్‌ జవహర్‌రెడ్డి, సీఎం స్పెషల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎస్‌వో చిదానందరెడ్డి ఉన్నారు.

ఇవాళ రాత్రికి 1- జన్‌పథ్‌ నివాసంలో సీఎం జగన్‌ బస చేస్తారు. ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాలకు సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10.30గంటల నుంచి 5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హెటల్‌లో దౌత్యవేత్తలతో సీఎం జగన్‌ సమావేశమవుతారు. సాయంత్రానికి పర్యటన ముగించుకుని తాడేపల్లికి తిరుగుపయనం అయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే..  ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్‌ ప్రత్యేకంగా  సమావేశం కానున్నారు.

ఏపీ అడ్వాంటేజ్‌
ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో,  బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-గవర్నమెంట్ (B2G) సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట  దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. అలాగే ఏపీ  ప్రభుత్వం  ఫోకస్ చేసిన 13  కేంద్రీకృత రంగాలపై సెక్టోరల్ సెషన్‌లను ప్లాన్ నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రంగాల పారిశ్రామిక నిపుణులు తమ అనుభవాలను పంచుకొనున్నారు.

ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని ముఖ్య నగరాలలో  వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తోంది.   అందులో భాగంగా తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు  28 మంది విదేశీ పెట్టుబడిదారులు, 44 దేశాల కు చెందిన రాయబారులను ఆహ్వానించారు.

ఏపీ అడ్వాంటేజ్ అనే థీమ్ తో  రాష్ట్రంలో లో పెట్టుబడుల అవకాశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరించనున్నారు. రాష్ట్రంలో   వ్యాపార అనుకూల వాతావరణం, బలమైన పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదితర అంశాలను వివరిస్తారు. అలాగే ప్రభుత్వం తరఫున అందించే ప్రోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలు  తదితర అంశాలను వివరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నాయి.

అలాగే వివిధ దేశాల రాయబారులతో  ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను సీఎం జగన్‌ వివరిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తమ తమ దేశాల వ్యాపారవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా డిప్లమాట్స్ ను కోరుతారు. ఈ కర్టెన్ రైజర్  ఈవెంట్ తో పాటు ఫిబ్రవరిలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా,ముంబై  నగరాల్లో  రోడ్డు షోలను కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top