చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం: సీఎం జగన్‌ వ్యంగ్యాస్త్రాలు..

CM YS Jagan Comments On Chandrababu In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: విపత్తును విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, రాజకీయాల కోసం బురద జల్లుతున్నారన్నారు.

‘‘నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని విమర్శించారు. శాశ్వతంగా కనుమరుగైపోతానని ప్రతిపక్ష నేత అన్నారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం. వరద సహాయక చర్యలు ఆగకూడదనే నేను వెళ్లలేదు. సీనియర్‌ అధికారుల సూచనల మేరకే ఆగిపోయా. నేను వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యం. జిల్లాకొక సీనియర్‌ అధికారిని పంపాం. మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడే ఉండమన్నాం. నేను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించాను. సహాయక చర్యల తర్వాత కచ్చితంగా పర్యటిస్తా. హుద్‌హుద్‌, తీత్లీ తుఫానులను తానే ఆపానంటారు చంద్రబాబు. అప్పట్లో బాధితులకు అరకొర సహాయం కూడా చేయలేకపోయారని’’ సీఎం జగన్‌ అన్నారు.

‘‘ఇటీవల కురిసిన వర్షాలకు 3 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. నష్టం వివరాలు ఎక్కడా దాచిపెట్టడం లేదు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని’’ సీఎం అన్నారు.

‘‘రిజర్వాయర్ల భద్రత పర్యవేక్షణకు సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తాం. నీటి నిల్వల పర్యవేక్షణకు కొత్త సాంకేతిక విధానాన్ని తీసుకొస్తాం. గతంలో వరదలు వస్తే చంద్రబాబు ఏ ఒక్కరిని ఆదుకోలేదు. ప్రభుత్వాన్ని ఎలా డ్యామేజ్‌ చేయాలన్నదే ఈనాడు పత్రికల్లో రాస్తారు. వరద ముంపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5లక్షలు అందించాం. వరద ప్రభావిత జిల్లాల్లో 100 శాతం విద్యుత్‌ పునరుద్ధరణ చేశామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top