CM Jagan Davos Tour: Comprehensive Health System in Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరికీ అందుబాటులో.. సమగ్ర ఆరోగ్యవ్యవస్థ

Published Tue, May 24 2022 4:11 AM | Last Updated on Tue, May 24 2022 8:59 AM

CM Jagan Davos Tour Comprehensive health system Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కోవిడ్‌ లాంటి విపత్తులు మరోసారి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా బలమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ఇందుకోసం రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున ఇప్పుడున్న 11 కాలేజీలకు అదనంగా మరో 16 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో వైద్య ఆరోగ్య రంగంపై రూ.16,000 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రెండో రోజు సమావేశాల సందర్భంగా సోమవారం ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌పై సీఎం జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ..
సీఎం జగన్‌తో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి సంజయ్‌ భట్టాచార్య తదితరులు 

ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌..
కోవిడ్‌ లాంటి విపత్తును ఎవరూ ఊహించలేదు. మన తరం మునుపెన్నడూ చూడని విపత్తు ఇది. వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌ లాంటి విపత్తు మరోసారి తలెత్తితే సమర్థంగా నివారించేందుకు బలీయమైన వ్యవస్థ కావాలి. కోవిడ్‌ విపత్తు నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. నివారణ, నియంత్రణ చికిత్స విధానాల ప్రాముఖ్యత తెలుసుకోవాలి. సమగ్ర ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. కోవిడ్, తదనంతర పరిణామాలన్నీ మనకు కనువిప్పు లాంటివి. ఒక దేశం, ఒక రాష్ట్రం పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతా చేశాం. కోవిడ్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టింది. 

మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్‌

అత్యాధునిక ఆస్పత్రులు లేకున్నా..
అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల విషయంలో రాష్ట్రం వెనుకబడి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడమే దీనికి ప్రధాన కారణం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి టైర్‌–1 నగరాలు ఏపీలో లేనందున ప్రైవేట్‌ రంగంలో అత్యాధునిక వైద్య సేవల లభ్యత తక్కువగా ఉంది. కోవిడ్‌ సమయంలో ప్రధానమైన ఈ లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమయ్యాం.

కోవిడ్‌ నియంత్రణలో భాగంగా 44 దఫాలు ఇంటింటి సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో ఇందుకోసం బలమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలోనూ  సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌తో పాటు 42 వేల మంది ఆశావర్కర్లు వైద్య, ఆరోగ్య రంగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. వీరందరూ సమష్టిగా ఇంటింటి సర్వే చేపట్టడంతో తగిన చర్యలు తీసుకుంటూ కోవిడ్‌ను సమర్ధంగా ఎదుర్కోగలిగాం. ఫలితంగా మరణాల రేటును తగ్గించగలిగాం. భారత్‌లో నమోదైన సగటు మరణాల శాతం 1.21 కాగా ఏపీలో దేశంలోనే అత్యల్పంగా 0.63% నమోదైంది. 


టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్‌ 

కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు
ఇక నియంత్రణ చర్యల విషయానికొస్తే జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతున్నాం. అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలను సమానంగా అందించాలన్నదే లక్ష్యం. మెడికల్‌ కాలేజీలు ఏర్పాటైనప్పుడే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ వస్తారు.

అప్పుడే ఆ మెడికల్‌ కాలేజీలను అనుసంధానం చేయడం సాధ్యమవుతుంది. అప్పుడే మేం ఎదురుచూస్తున్న అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది. దీనికి మూడేళ్ల కాలపరిమితి విధించుకున్నాం. మొత్తం మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు మూడేళ్లలో రూ.16 వేల కోట్లు సమీకరణ చేయాలని నిర్దేశించుకున్నాం. 

25 లక్షల మందికి ఉచిత వైద్యం 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రంగానికి వస్తే ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం  ప్రవేశపెట్టారు. దాదాపు వెయ్యి చికిత్సా విధానాలు ఇందులో కవర్‌ అవుతున్నాయి. ఏపీలో ప్రత్యేకంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి 2,446 చికిత్స విధానాలకు వర్తింప చేస్తున్నాం. 1.44 కోట్ల ఇళ్లకి ఆరోగ్యశ్రీ కార్డులు అందచేసి లబ్ధిదారుల ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో దాదాపు 1.53 కోట్ల కుటుంబాలు ఉండగా 1.44 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం. గత మూడేళ్లుగా 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందచేశాం.  

స్విస్‌ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌
కోవిడ్‌ లాంటి మహమ్మారులు చెలరేగినప్పుడు ప్రధానంగా నివారణ, నియంత్రణ, చికిత్సపై దృష్టి పెట్టాలి. వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలంటే అవైలబులిటీ, యాక్సెస్‌బులిటీ, ఎఫర్ట్‌బులిటీ.. ఈ మూడూ సమాంతరంగా అందుబాటులోకి రావాలి.  ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో 2 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం.

ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రెండు ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు నెలకొల్పుతున్నాం. తద్వారా ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయిస్తారు. ఒక్కో వైద్యుడికి మండలంలో 4–5 గ్రామాలను కేటాయిస్తారు. వారు రోజు విడిచి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్లుగా గ్రామాల్లో ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ సేవలు అందించడంతో పాటు విలేజ్‌ క్లినిక్‌ను మెడికల్‌ హబ్‌గా వినియోగించుకుంటారు. ఇందులో ఏఎన్‌యమ్, నర్సింగ్‌ గ్రాడ్యుయేట్, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రాక్టీస్‌నర్, ఆశా వర్కర్లు ఉంటారు.  

దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement