సంబరంగా సంక్రాంతి వేడుక | Sakshi
Sakshi News home page

సంబరంగా సంక్రాంతి వేడుక

Published Mon, Jan 15 2024 5:23 AM

CM Jagan and YS Bharathi Reddy participated In Sankranti Celebrations - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.

నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతిఇంటికీ సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, మెడికల్‌ కాలేజీ, నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తీర్చిదిద్ధిన స్కూల్‌ భవనం, పాల కేంద్రం నమూనాలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ.. ముత్యాల ముగ్గులు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యా­గారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అచ్చం అసలు సిసలైన గ్రామీణ వాతావరణ ప్రతిబింబించేలా, మన సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సీఎం దంపతులను మంత్రముగ్థుల్ని చేసేలా ఆ ప్రాంతం శోభాయమానంగా అలంకరించారు. ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు ఏర్పాటుచేసిన శిలాతోరణం అందరినీ ఆకట్టుకుంది.

సీఎం క్యాంపు కార్యాలయంలో భోగి మంటలు వెలిగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు   

ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం జగన్‌ దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. వారిరువురూ భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. హరిదాసుకు స్వయంపాకం, సారె సమర్పించారు. అలాగే, గోశాలలోని గోవులకు పూజచేసి వాటిని నిమురుతూ కొద్దిసేపు అక్కడ గడిపారు. గంగిరెద్దులకు, తులసి చెట్టుకు పూజలు చేశారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు.

అనంతరం.. కలియుగ దైవమైన శ్రీహరికి పూజలు నిర్వహించటం, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఏర్పాటుచేసిన వందేళ్ల క్రితం నాటి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నమూనా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడ వైఎస్సార్‌ విగ్రహానికి సీఎం జగన్‌ దంపతులు పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం.. అక్కడున్న మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ముందుకు కదిలారు. తొలుత.. కాణిపాక వినాయక విగ్రహానికి సీఎం జగన్‌ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తర్వాత.. కనకదుర్గమ్మకు.. అనంతరం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు కంకణం కట్టగా.. వేదపండితులు అందించిన మరో కంకణాన్ని భారతమ్మకు ముఖ్యమంత్రి జగన్‌ కట్టారు. 


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
ప్రముఖ సినీ నేపథ్యగాయని గోపిక పూర్ణిమ, ప్రముఖ గాయని శ్రీలలిత పాటల కార్యక్రమం శ్రవణపేయంగా సాగింది. అలాగే, సినీ రంగానికి చెందిన ప్రముఖ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్లేయర్స్‌ రాఘవ, కౌండిన్య, మెహర్, మానస్, చందు, రమేష్, హరేరాము, మహేష్, భాను తదితరుల లైవ్‌ పెర్ఫామెన్స్‌.. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారులు రిత్విక్‌ వెంకట్, చార్మి, చిన్నారి కేతనరెడ్డి నాట్య ప్రదర్శన.. నీలకంఠం మిమిక్రీ, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఉదయ్‌ బృందంచే సంక్రాంతి ప్రత్యేక గీతాల నృత్యం, మాస్టర్‌ భువనేష్‌ ప్రత్యేక గీతాలు.. వీటితో పాటు ప్రముఖ సినీగేయ రచయిత, సంగీత దర్శకులు విశ్వ.. ప్రముఖ సినీ మరియు ప్రజా గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ప్రజా రచయితలు మానుకోట ప్రసాద్, మాట్ల తిరుపతి, గాయకులు గద్దర్‌ నర్సిరెడ్డి, తేలు విజయల కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కృష్ణవేణి మల్లావఝుల వ్యవహరించారు. చివర్లో వీరందరిని సీఎం జగన్‌ దంపతులు సత్కరించి, మెమొంటోలు అందజేశారు. అంతేకాక..  ప్రాంగణంలో ఉన్న అందరితో సీఎం జగన్‌ దంపతులు ఫొటోలు దిగారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


చెవిరెడ్డికి సీఎం అభినందనలు..
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలా.. చక్కని ఏర్పాట్లతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీఎం జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

విజయానందాలతో అడుగులు ముందుకేయాలి..
సీఎం జగన్‌ ట్వీట్‌
ఊరూ వాడా ఒక్కటై.. బంధుమిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకుని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ ఆదివారం ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో తెలిపారు.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement