ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌

CM Jagan And Biswabhusan Attended PM Modi Video Conference - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ఏర్పాటైన కమిటీతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, టీఎస్‌ సీఎం చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌), వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌ అత్యంత ప్రశంసనీయమైందన్నారు. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక,  శాస్త్ర సాంకేతిక రంగాల్లో గడిచిన 75 సంవత్సరాల్లో దేశం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకోవడానికి, అంతేకాదు ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి మన అంకితభావాన్ని పునరుద్ఘాటించడానికి  అమృత్‌ మహోత్సవ్‌ వేదిక కల్పిస్తోందన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
► స్వతంత్ర పోరాట యోధుల నిస్వార్థతను చూసి మనం అంతా గర్వించాలి. అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా వారిని గౌరవించుకోవాలి, వారికి సెల్యూట్‌ చేయాలి. ఏపీలో స్వాతంత్య్ర సమర యోధులను ఈ సందర్భంగా గౌరవించుకునే అవకాశం నాకు కలిగింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య కుమార్తె సీతా మహాలక్ష్మిని వారి స్వగ్రామంలో కలుసుకున్నాను. జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. 1921లో ఆయన తాను రూపొందించిన పతాకాన్ని మహాత్మగాంధీకి విజయవాడలో సమర్పించారు. ప్రస్తుతం ఇది బాపు మ్యూజియంలో ఉంది. మా ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈ మ్యూజియంను బాగు చేసి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చింది.

► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావుగారు, వావిలాల గోపాలకృష్ణయ్య మరెంతో మంది ప్రముఖులు సేవలను గుర్తుచేసుకుంటూ ప్రతివారం వర్చువల్‌, భౌతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ 908 కార్యక్రమాలు నిర్వహించాం. నిస్వార్థపరులైన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకోవడమే కాదు, వారి జీవితాల నుంచి ఈ తరం యువకులు స్ఫూర్తిని పొందుతున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడంద్వారా వారిలో దేశభక్తిని నింపుతున్నాం. 

► గడిచిన కాలంలో మనదేశం నడిచిన మార్గాన్ని మరోసారి అవలోకనం చేసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశాన్ని కల్పించింది.  గడిచిన 75 సంవత్సరాల్లో, ముఖ్యంగా ఈ ఏడున్నర సంవత్సరాల్లో ఈ దేశం చాలా ప్రగతిని సాధించింది. రియల్‌ జీడీపీ 1950–51లో రూ.2.94 లక్షల కోట్లు ఉంటే, 2019–20 నాటికి రూ. 145.69 లక్షల కోట్లకు  చేరుకుంది. తద్వారా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. 

► ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్న మార్గంలో అనేక అవకాశాలూ ఉన్నాయి, అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశ సమర్థతను చాటడానికి రెండు ప్రధాన అంశాల మీద దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిచేస్తున్నాను. 1. సుస్థిర ప్రగతి 2. ఆర్థిక అసమానతలను తొలగించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. 

► దేశ ఆర్థిక పురోగతి ద్వారా ఇప్పుడున్నవారు ప్రస్తుతం తమ  అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే భవిష్యత్తు తరాలు కూడా తమ అసరాలను తీర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు.

► దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తుంది. గడిచిన 15 ఏళ్లుగా దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 1,27,423 మెగావాట్ల నుంచి 3,84,116 మెగావాట్లకు పెరిగింది. ముఖ్యంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 84,982 మెగావాట్ల నుంచి 2,34,058 మెగావాట్లకు పెరిగింది. దీనివల్ల కాలుష్యకారక వాయువులు వెలువడుతున్నాయి. ఇది భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరం. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిని క్రమంగా తొలగించి ఆస్థానంలో సహజ వనరులనుంచి విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత ఉంది.

సహజ వనరులనుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను స్టోరేజ్‌ చేసుకునే విషయంలో పరిష్కారాలను సత్వరం సాధించాల్సి ఉంది. కార్బన్‌ న్యూట్రాలిటీని సాధించడంతోపాటు అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేయడంలో ఇది అత్యంత అవసరం. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా స్వచ్ఛ విద్యుత్‌ను ఉత్పత్తిచేసే విషయంలో ఒకే సూర్యుడు (ఒన్‌ సన్‌), ఒకే ప్రపంచం (ఒన్‌ వరల్డ్‌), ఒకే గ్రిడ్‌  (ఒన్‌ గ్రిడ్‌) దిశగా ప్రధాన మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి. 

► భౌగోళికంగా రెండు కాలమానాలున్న ప్రాంతాలమధ్య విద్యుత్‌ పంపిణీ ఉండాలి. ఇవ్వాళ్టికి ఇది ఒక కల కావొచ్చు. కాని మరొక వాస్తవ విషయం ఏంటంటే.. ఖండాల మధ్య డేటాను పంపడానికి ఇప్పటికే ఆప్టికల్‌ ఫైబర్‌నెట్‌ వ్యవస్థ ఉంది. ఇదే తరహాలో ఖండాలను కలుపుతూ పవర్‌ గ్రిడ్‌ అన్నది తీరని కల కాకూడదు. 

► ఇక ఆర్థిక అసమానతలను తొలగించడంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో చాలా మంచి నిర్ణయాలు అమలు చేశారు. ఉచితంగా విద్య, ఆహార భద్రతలను చట్టబద్ధంచేశారు. ప్రధాని నాయకత్వంలో గ్రామాలను పెద్ద ఎత్తున విద్యుదీకరించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. కాని ఒక సమస్య నిరంతరం మనల్ని వెంటాడుతోంది.

► ఈ దేశంలో పేదరికాన్ని రూపు మాపడానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ప్రగతి సరిపోవడంలేదు. ప్రపంచంలో అసమానతలపై తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం జాతీయ ఆదాయంలో 57శాతం.. 10శాతం మంది చేతిలోనూ, 22 శాతం 1 శాతం చేతిలో ఉందని చెప్తోంది. ఆర్థిక అసమానతల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రుణభారాన్ని పెంచుతాయి, కొనుగోలు శక్తి తగ్గుతుంది. అత్యంత తీవ్రమైన ఈ సమస్య పట్ల విధాన రూపకర్తలమైన మనం అంతా దృష్టిసారించాల్సి ఉంది. సమగ్ర ఆర్థికాభివృద్ధి దిశగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని తొలగించాలి.

చదవండి: సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top