
నవంబర్ కల్లా డేటా లేక్ పూర్తి
రాష్ట్రంలో డ్రోన్ సేవలు విస్తృతం చేయాలి
ఈ నెల 15నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 ప్రభుత్వ సేవలు
సీఎం చంద్రబాబు వెల్లడి
సాక్షి, అమరావతి: అవేర్ 2.0 వెర్షన్‌తో ముందే వర్షపాతాన్ని అంచనా వేసేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సీఎం సందర్శించారు. ఆర్టీజీఎస్‌లోని అవేర్ 2.0 వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విధానం ద్వారా నదుల్లోకి ఏ సమయంలో ఎంత వర్షపు నీరు వస్తుంది, కురిసిన వర్షం భూమిలోకి ఎంత ఇంకుతోంది, వర్షపు నీటి సమర్థ వినియోగంపైనా రియల్ టైమ్ డేటా విశ్లేషణ చేసి సంబంధిత శాఖలను ఆర్టీజీఎస్ అప్రమత్తం చేయాలని సూచించారు.
వరదలు, తుపాన్ల సమయంలో రోడ్లపై వరద నీటిని పరిశీలించి ఆ ప్రాంత ప్రజలను ఆర్టీజీఎస్ అప్రమత్తం చేయాలన్నారు. పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎలా పాల్పడిందీ వారికి వీడియో లు పంపి, అలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా చైతన్యం తేవాలని తెలిపారు. రాష్ట్రంలో డ్రోన్ సేవలు విసృత్తం చేయాలని డ్రోన్ కార్పొరేషన్‌కు చె ప్పారు. డ్రోన్ల వినియోగం ద్వారా రైతులు పురుగు మందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించేలా చూడాలని చెప్పారు.
అంటు వ్యాధుల నివారణకు, దోమల వ్యాప్తిని అరికట్టడానికి డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. ఆర్టీజీఎస్ డేటా లేక్ పనులు నవంబరుకల్లా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 ప్రభుత్వ సేవలను అదిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి కూడా ఒక శాస్త్రీయ విశ్లేషణ ఉండాలని సూచించారు.
సరుకు రవాణాకులాజిస్టిక్స్ కార్పొరేషన్
ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలకు సరకు రవాణా నిర్వహణకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు.
రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని విమానాశ్రయాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. పోర్టులు, ఎయిర్ పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా మార్చి వీటిని అనుసంధానిస్తూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలన్నారు. కుప్పం, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఎయిర్ పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానించేలా అంతర్గత రోడ్ల నిర్మాణం ఉండాలని, అవసరమైతే వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా చేపట్టాలని సూచించారు.
మారిటైం పాలసీలో మార్పులు..!
పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు మారిటైమ్ విధానంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పోర్టులు, టెర్మినల్స్, షిప్ బిల్డింగ్ యూనిట్లు, అంతర్గత జల రవాణా మార్గాలు, క్రూయిజ్ టెర్మినళ్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్రం అమలు చేస్తున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్కీం పాలసీకి అనుగుణంగా మారిటైం పాలసీలో మార్పులు చేయాలని అధికారులు ప్రతిపాదించగా అందుకు ఆమోదం తెలిపారు. షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం కోసం మచిలీపట్నం, మూలపేట, చినగంజాం లాంటి ప్రాంతాల్లో కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని అధికారులు తెలిపారు. స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.