2023లో అప్పటి కేంద్రమంత్రి హరదీప్‌సింగ్ సమక్షంలో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంటున్న యూనిపెర్, గ్రీన్‌కో సీఈవోలు
కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కూడా తన ఘనతేనంటూ డప్పు
కాకినాడలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్ జగన్ హయాంలో 2023లో యూనిపెర్‌తో గ్రీన్‌కో ఒప్పందం
‘ఇండియా ఎనర్జీ వీక్’ సందర్భంగా అప్పటి కేంద్రమంత్రి హరదీప్‌సింగ్ పూరి సమక్షంలో ఒప్పందం
ఆ తర్వాత 2023లోనే విశాఖ జీఐఎస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గ్రీన్‌కో
వాస్తవాలను దాచిపెట్టి ఈ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న బాబు సర్కారు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఇప్పటికే విశాఖలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ చోరీకి పాల్పడిన చంద్రబాబు.. తాజాగా కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును కూడా తన ఘనతగా చెప్పుకొంటూ భారీ ప్రకటనలను జారీ చేయించారు. కాకినాడలో భారీ గ్రీన్ అమ్మోనియా యూనిట్ నెలకొల్పే విధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రీన్‌కో 2023లోనే ఒప్పందం కుదుర్చుకుని దానికి అనుగుణంగా వేగంగా అడుగులు వేస్తే.. చంద్రబాబు సర్కారు ఆ ఘనతను తన ఖాతాలో వేసుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
2023లో బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో అప్పటి కేంద్రమంత్రి హరదీప్‌సింగ్ పూరి సమక్షంలో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును నెలకొల్పడానికి గ్రీన్‌కో సంస్థ యూనిపెర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత 2023 మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో కాకినాడలోగ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలో చర్చ జరగడంతో పాటు అవార్డులు దక్కించుకుంది. పునరుత్పాదక ఇంధనాల కోసం కఠినమైన యూరోపియన్ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఈయూ పునరుత్పాదక ఇంధనాలు నాన్–బయోలాజికల్ ఆరిజిన్ (ఆర్‌ఎఫ్‌ఎన్‌బీఓ) ప్రీ–సరి్టఫికేషన్ పొందిన మొదటి భారతీయ ప్రాజెక్టుగా ఏఎం గ్రీన్ నిలిచింది.

కేంద్రం కంటే ముందుగానే సొంత పాలసీ
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2023లోనే ఓ ప్రత్యేక పాలసీని రూపొందించింది. గ్రీన్ ఎనర్జీపై కేంద్రం పాలసీ తీసుకురావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ ఏడాదికి దాదాపు 0.34 మిలియన్ టన్నులు (ఎంటీ) ఉంటే రానున్న ఐదేళ్లలో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 2 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం పాలసీని రూపొందించింది. ఒక మిలియన్ టన్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది.
ఈ పాలసీ అమలుకు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్డీసీ ఏపీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ పాలసీతో ఎనీ్టపీసీ, ఏఎం గ్రీన్‌కో, రెన్యూ ఎనర్జీ, ఇండోసోల్, ఏబీసీ, అదానీ గ్రీన్‌ఎనర్జీ వంటి అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా వచ్చాయి. 2023లో జరిగిన జీఐఎస్ సదస్సులో మొత్తం రూ.13.11 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల ఒప్పందాలు వస్తే, అందులో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ.9,07,127 కోట్ల విలువైన 40కి పైగా ఒప్పందాలు కుదిరాయంటే ఈ రంగంలో పెట్టుబడులకు వైఎస్ జగన్ ఏ స్థాయిలో కృషి చేశారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు సర్కారు గ్రీన్ ఎనర్జీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించలేక గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటోంది.


