‘ఫైబర్‌గ్రిడ్‌’లోనూ అదే స్కిల్‌  | Sakshi
Sakshi News home page

‘ఫైబర్‌గ్రిడ్‌’లోనూ అదే స్కిల్‌ 

Published Sun, Sep 10 2023 5:18 AM

CID investigation into FiberGrid scam - Sakshi

సాక్షి, అమరావతి:  స్కిల్‌ డెవల్‌ప్‌మెంట్, రాజధాని తాత్కాలిక నిర్మాణాల్లో నిధులు కొట్టేయడానికి అనుసరించిన మార్గాన్నే ఫైబర్‌గ్రిడ్‌లోనూ టీడీపీ పెద్దలు అనుసరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో కూడా యథేచ్ఛగా అవినీతికి తెగబడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్‌ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు కేటాయించారు. ఈ ప్రజాధనాన్ని అనేక డొల్ల కంపెనీల ద్వారా కొట్టేశారు. ఇందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని వేమూరి తీసుకున్నాడు.

వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేర్పించారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలిసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది.

ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్‌ లావాదేవీలను సీఐడీ అధికారులు స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్‌ ద్వారా ఆడిటింగ్‌ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్‌ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్‌ నిర్ధారించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఇప్పటివరకు ఇన్‌క్యాప్‌ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ విప్లవకుమార్‌ (ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ రామ్మూర్తి (ఏ–21)లతో పాటు కనుమూరి కోటేశ్వరరావును అరెస్టుచేసింది. ఈ డొల్ల కంపెనీల ద్వారా కాజేసిన సొమ్మును అందుకున్న అసలు వ్యక్తులను అరెస్టుచేసేందుకు సీఐడీ రంగం సిద్ధంచేస్తోంది.

నెటాప్స్‌ ద్వారా ఇలా కొట్టేశారు.. 
నెటాప్స్‌ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మళ్లించారు.  
 నెటాప్స్‌ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు.  
వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు నెటాప్స్‌ కంపెనీ బదిలీచేసింది.  
నెటాప్స్‌ కంపెనీ 2017 జూన్‌ నుంచి 2020 జూన్‌ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది.  
నెటాప్స్‌ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ చేసింది.  

Advertisement
Advertisement