
అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై సినీ నటుడు చిరంజీవి
వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ముందు నేను ఇంటికి వెళ్లాను
భోజనం చేస్తున్నప్పుడే సమస్యల గురించి వివరించాను
కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు సీఎంతో మాట్లాడమని కోరితేనే ముందుకొచ్చా
అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడి సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరాను
నన్ను ముందుగా ఇంటికి భోజనానికి సాదరంగా ఆహ్వానించారు
ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనుకుంటున్నారని జగన్‌కు చెప్పాను
ఆ తర్వాత సినీ ప్రతినిధులతో కలిసి రావాలని మంత్రి నాని నాకు ఫోన్ చేశారు
అప్పట్లో బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు
నా చొరవ వల్లే సినిమా టికెట్ల ధరలు పెరిగాయి
మీ వీరసింహా రెడ్డి అయినా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్లు పెంచడానికి అదే కారణమైంది
సాక్షి, అమరావతి: సినీ పరిశ్రమలో సమస్యలపై చర్చించేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించినట్లు సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. అసలు వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలోనే తాను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని అప్పటి సీఎం జగన్‌కు వివరించినట్టు స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ. ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరును కలవండన్నాడట.. అంటూ బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చినందుకు నేను ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నా’’ అంటూ చిరంజీవి స్పందించారు. ఆ ప్రకటనలో చిరంజీవి ఇంకా ఏం చెప్పారంటే..
నన్ను చొరవ తీసుకోమన్నారు..
రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చారు. సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డీవీవీ దానయ్య, మైత్రి మూవీస్.. ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు నా దగ్గరకు వచ్చారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్‌లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం సీఎంతో మాట్లాడి చెబుతానన్నారు.
నా చొరవతోనే టికెట్ ధరల పెంపు సాధ్యమైంది
సినీ ప్రముఖుల అందరి సమక్షంలోనే నాటి సీఎం వైఎస్ జగన్‌కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించి సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యం. నేను ఆ చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయంతో మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్లు పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డి్రస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకొనే విధానంలోనే మాట్లాడతా. నేను ఇండియాలో లేను.
అందుకే ప్రకటన విడుదల చేస్తున్నాను.
సీఎం ఆహ్వానం మేరకే ఇంటికి వెళ్లాను
అప్పటి మంత్రి పేర్ని నాని ఓ రోజు ఫోన్ చేసి ‘ముఖ్యమంత్రి ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు. భోజనానికి (లంచ్‌కి) రావాలని చెప్పారు’ అంటూ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. భోజనం చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి, మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను.
కొన్ని రోజుల తర్వాత మంత్రి నాని నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ పది మంది వస్తామని చెబితే సరేనన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్‌ను వెళ్లి బాలకృష్ణను కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. దీంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్.నారాయణమూర్తితో సహా కొంత మందిని తీసుకుని వెళ్లి సీఎం జగన్‌ను కలిశాం.