ఏడాదిగా పడుతూ లేస్తూ ఉన్న చికెన్‌ ధరలు

Chicken Prices Fluctuation in Telugu States Reasons Here - Sakshi

20 రోజుల క్రితం రూ.312తో ఆల్‌టైం హైకి చేరిక

ప్రస్తుతం కిలో రూ.160కి పడిపోయిన రేటు

కోవిడ్‌ ఎఫెక్ట్‌తో రెండు వారాల్లో దాదాపు సగం ధర పతనం

కొన్నాళ్లు ఇవే ధరలు కొనసాగే అవకాశం

సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్‌ ప్రభావం చికెన్‌ ధరపై పడింది. కొద్దిరోజులుగా దీని ధర పతనమవుతూ వస్తోంది. దాదాపు 20 రోజుల క్రితం కిలో బ్రాయిలర్‌ కోడిమాంసం రూ.312కి చేరి రికార్డు సృష్టించింది. పౌల్ట్రీ చరిత్రలోనే చికెన్‌ అత్యధిక ధర పలకడం అదే తొలిసారి. అప్పట్లో మండుటెండలు, వడగాడ్పులతో పాటు ఫారాల్లో కోళ్ల కొరత ఏర్పడింది. దీంతో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి చికెన్‌ ధర క్రమంగా క్షీణించడం మొదలైంది. రోజుకు రూ.5 నుంచి 10 చొప్పున తగ్గుతూ వచ్చి ఇప్పుడు కిలో రూ.160కి చేరింది. ప్రస్తుతం కొన్నిచోట్ల రూ.150కి కూడా చికెన్‌ను విక్రయిస్తున్నారు. 

కోవిడ్‌ ప్రభావంతో..
రెండు వారాల నుంచి కోవిడ్‌ విజృంభణ తీవ్రతరమవుతోంది. రోజూ కోవిడ్‌ బారిన పడుతున్న రోగుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. దీంతో జనం చికెన్‌ వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకున్నారు. మరోవైపు కొన్నాళ్ల క్రితం వరకు చికెన్‌కు అధిక ధర లభిస్తుండడంతో రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని పెంచారు. అలా వేసిన బ్యాచ్‌లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ ఫారాల్లో కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకున్నాయి. ఈ బరువుకు మించి పెంపకాన్ని కొనసాగిస్తే రైతుకు నష్టం వాటిల్లుతుంది. రోజూ మేత ఖర్చు పెనుభారంగా మారుతుంది. అందువల్ల నిర్ణీత బరువుకు పెరిగిన కోళ్లను తెగనమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వినియోగానికి మించి కోళ్ల లభ్యత పెరగడంతో చికెన్‌ ధర క్షీణిస్తోంది.


హైదరాబాద్‌ నుంచి ఆగిన కోళ్లు..
మరోవైపు హైదరాబాద్‌లో ధర ఒకింత తక్కువగా ఉండడం అక్కడ నుంచి కృష్ణా జిల్లాకు బ్రాయిలర్‌ కోళ్లను తీసుకొస్తుంటారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న కోళ్లే ధర లేక అమ్ముడవకపోవడంతో అక్కడ నుంచి కొనుగోలు చేయడం లేదని బ్రాయిలర్‌ కోళ్ల వ్యాపారులు చెబుతున్నారు. 


ఏడాదిగా పడుతూ.. లేస్తూ..
► దాదాపు ఏడాది నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదొడుకులకు లోనవుతోంది. కోడి ధర కొన్నాళ్లు పెరుగుతూ, మరికొన్నాళ్లు పతనమవుతూ వస్తోంది. 

► వాస్తవానికి గత ఏడాది కోవిడ్‌ ఆరంభానికి ముందు వరకు చికెన్‌ రేటు కిలో రూ.270 వరకు ఉండేది. 

► కోవిడ్‌ ఉద్ధృత రూపం దాల్చాక చికెన్‌ తింటే కరోనా సోకుతుందన్న దుష్ప్రచారంతో అప్పట్లో వినియోగం తగ్గింది. నాలుగైదు నెలల పాటు దీని ధర భారీగా పతనమై ఒకానొక దశలో మూడు కిలోలు రూ.100కి దిగజారింది.

► ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ గట్టెక్కడంతో మళ్లీ చికెన్‌ ధర పెరగడం మొదలైంది. 

► ఇలా విజయవాడ జోన్‌లో గత డిసెంబర్‌ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. అయితే బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో మళ్లీ చికెన్‌ రేటు జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి పడిపోయింది. ఆ భయం నుంచి బయట పడి మళ్లీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 

► ఇలా ఫిబ్రవరి 23న రూ.200 ఉన్న ధర మార్చి 31కి రూ.260కి చేరింది. ఏప్రిల్‌ 2న రూ.270, ఏప్రిల్‌ 6 రూ.312కి పెరిగింది. 

► కాగా ప్రస్తుత చికెన్‌ ధరలు కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కాజా వెంకటేశ్వరరావు (నాని) ‘సాక్షి’కి చెప్పారు.

ఇక్కడ చదవండి:
Prawns Price: నిలకడగా రొయ్యల ధరలు

‘చాక్లెట్‌’ పంట.. ఏపీ వెంట..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top