
ఫీజు రూపంలో ప్రజాధనం దోచిపెడుతున్న చంద్రబాబు
మార్చిలో రూ.2.86 కోట్లు... తాజాగా రూ.1.87 కోట్లు
రాష్ట్ర ఖజానా నుంచి ఏడు నెలల్లో ఇచ్చింది రూ.4.73 కోట్లు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వాదనలకే ఈ ఫీజుల్లో అధిక భాగం
వంశీకి వ్యతిరేకంగా వాదించిన కేసులకే రూ.90 లక్షలు
వాయిదా అడిగినందుకు ఏకంగా రూ.33 లక్షలు
ఫీజుల చెల్లింపులో బాబుకు గుర్తుకురాని రాష్ట్ర ఆర్థి పరిస్థితి
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన సమయంలో రాష్ట్ర ఆర్థి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు తన ఆస్థాన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు మాత్రం భారీ మొత్తంలో ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో కట్టబెడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో లూథ్రాకు రూ.2.86 కోట్లను ఫీజులుగా చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా మరో రూ.1.87 కోట్లను సంతర్పణ చేసింది. తద్వారా ఏడు నెలల్లో లూథ్రాకు ఫీజుల కింద మొత్తం రూ.4.73 కోట్లు చెల్లించింది.
ఈ ఫీజుల్లో అత్యధిక భాగం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసుల వాదనలకు సంబంధించినదే కావడం గమనార్హం. లూథ్రాకు ఒక కేసులో వాయిదా కోరినందుకే ఏకంగా రూ.30 లక్షలు ఫీజుగా, దీనికి 10 శాతం క్లర్కేజీ అదనంగా కలిపి రూ.33 లక్షలు చెల్లించారు. గతంలోనూ ఇదే కేసులో ఆయనకు రూ.11 లక్షలు చెల్లించారు.
లూథ్రా ఫీజులకే వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులన్నట్లుగా ఉంది పరిస్థితి
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వాదించిన కేసుల్లో లూథ్రాకు ప్రభుత్వం రూ.90 లక్షలను ఫీజులుగా చెల్లించింది. లూథ్రాకు ఫీజుల సంతర్పణ చేసేందుకే పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారా అన్నట్లు పరిస్థితి ఉంది. వైఎస్సార్ సీపీ నేతలపై ఏ సెక్షన్ల ప్రకారం నమోదు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ కేసుల్లో బెయిల్ రాకుండా ఏం చేయాలి.. వంటి వ్యూహాలన్నీ లూథ్రానే రచిస్తున్నారని సమాచారం.
కుంభకోణం ఏదైనా బాబు అండ్ కోకి లూథ్రానే
లూథ్రా దశాబ్దానికిపైగా చంద్రబాబుకు న్యాయ సేవలు అందిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు వరకూ బాబుకు ఎక్కడ అవసరమైతే అక్కడ లూథ్రా వాలిపోతారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కావొచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ తదితర కుంభకోణాల్లో కూడా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ అండ్ కో తరఫున కోర్టుల్లో లూథ్రానే వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌లో కనబడని ‘లూథ్రా’ స్కిల్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయినప్పుడు చంద్రబాబు తన ఆస్థాన సీనియర్ న్యాయవాది లూథ్రానే నమ్ముకున్నారు. బాబు కోసం ఆయన ఏసీబీ కోర్టులో రోజుల తరబడి వాదనలు వినిపించారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు పక్కగా ఉండటంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. హైకోర్టులోనూ లూథ్రా తేలిపోయారు.
తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా చంద్రబాబు తరఫున లూథ్రానే కీలకపాత్ర పోషించారు. అయితే చంద్రబాబుకు ఊరట మాత్రం దక్కలేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేశ్‌కు భరోసా ఇస్తూ లూథ్రానే మొత్తం కథ నడిపారు. ఇందుకుగాను లూథ్రాకు కోట్ల రూపాయలు చెల్లించారు.
మద్యం అక్రమ కేసులో లూథ్రా కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు..
మద్యం అక్రమ కేసులో అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులో లూథ్రానే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఫీజులుగా చెల్లిస్తుందో వేచి చూడాలి. కనీసం రూ.5 కోట్ల పైచిలుకే ఆయనకు ఫీజుల రూపంలో చెల్లించే అవకాశం ఉందని అంచనా.
మద్యం కేసులో సాయం, సలహా, సమన్వయం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం లూథ్రాకే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచి్చంది. గతంలో ఏ కేసులో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఓ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదికి ఇలాంటి బాధ్యతలు అప్పగించిన ఉదంతం లేదు.