
రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధరణ ఎజెండాగా సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
తనయుడు, మంత్రి లోకేశ్, పురపాలక మంత్రి నారాయణతో కలిసి నేడు ప్రయాణం.. 6 రోజుల పాటు పర్యటన
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో గతంలో కీలక పాత్ర పోషించిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్
ఫార్ములా–1 ఒప్పందంలో ముడుపులు తీసుకున్న కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన ఈశ్వరన్
ఈ పర్యటనలో ఆయనతో చంద్రబాబు అధికారికంగా భేటీ అవుతారా? అనధికారికంగా కలుస్తారా?
మాస్టర్ ప్లాన్ పనులను రూ.28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టిన కాగ్
హైకోర్టు అక్షింతలు వేసినా రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుపై నాడు వెనక్కుతగ్గని చంద్రబాబు సర్కార్
స్విస్ చాలెంజ్ ముసుగులో ప్రాజెక్టు సింగపూర్ సంస్థల చేతికి
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.12,485.9 కోట్లు పెట్టుబడి పెట్టే రాష్ట్ర ప్రభుత్వానికి దక్కే వాటా 48 శాతం
కేవలం రూ.306 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ సంస్థల కన్సార్షియం పొందే వాటా 52 శాతం
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పారని చంద్రబాబు పాచిక
సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధరణే ఎజెండాగా సీఎంచంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. తనయుడు, మంత్రి నారా లోకేశ్, పురపాలక మంత్రి నారాయణతో కలిసి శనివారం నుంచి ఆరు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయనతో కలిసి రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు చంద్రబాబు.
అయితే, ‘ఫార్ములా–1 కార్ రేసింగ్ ఒప్పందం’లో ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరన్ జైలుకెళ్లారు. జూన్ 5న విడుదలయ్యారు. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రణాళిక అమలుకు చంద్రబాబు సిద్ధమయ్యారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా ఎవరిని తెరపైకి తెస్తారు..? తన మిత్రుడు ఈశ్వరన్‌తో అధికారికంగా భేటీ అవుతారా? లేదంటే అనధికారికంగా కలుస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో కాదు.. అంతర్జాతీయ కుంభకోణం
రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన కోటరీకి లీక్ చేసి ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి చంద్రబాబు, ఆయన బినామీలు తక్కువ ధరకే రైతుల భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. ఇక ఈశ్వరన్ తనకు ప్రాణ స్నేహితుడని.. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిందంటూ గొప్పలు పోయారు. ఈశ్వరన్‌తో కలిసి మరో దోపిడీకి తెరతీశారు. అదే రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు.
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కుంభకోణం ఇదీ
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కింద 1,691 ఎకరాలను సింగపూర్ సంస్థల కన్సార్షియంకు ప్రభుత్వం అప్పగిస్తుంది. 371 ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలను సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది. మిగతా 1,070 ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు.
» సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీ (కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ (అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్)కి ప్రభుత్వం 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం రూ.4 కోట్లు (కనీస ధర)గా నిర్ణయించింది. మొత్తం విలువ రూ.6,764 కోట్లు.
» ఈ భూమికి రోడ్లు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి సదుపాయాలన్నీ ప్రభుత్వం సొంత ఖర్చు రూ.5,500 కోట్లతో కల్పిస్తుంది. ఏడీపీలో సీసీడీఎంసీ వాటాగా రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ మొత్తం రూ.12,485.90 కోట్ల పెట్టుబడిలో సీసీఎండీసీకి దక్కే వాటా 42 శాతమే.
» కేవలం రూ.306 కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. సింగపూర్ కన్సార్షియంకు తొలుత 50, తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు నాటి చంద్రబాబు సర్కార్ అంగీకరించింది.
కన్సార్షియం ముసుగులో...
» 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థల కన్సార్షియం నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. ఈ విధానం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సింగపూర్ సంస్థల కన్సార్షియం గోప్యంగా ఉంచడం ఏమిటని అక్షింతలు వేసి స్టే ఇచ్చింది. అయినా, నాటి రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఉంచేందుకే ప్రయత్నించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.66 వేల కోట్లు.
» సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పిన మాస్టర్ ప్లాన్ పనులను సింగపూర్ సంస్థలు ‘సుర్బానా–జురాంగ్’కు రూ.28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. దీన్ని తప్పుపడుతూ 2023లో కాగ్ నివేదిక ఇవ్వడం గమనార్హం.
» రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి తొలి విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటానే ఇస్తామని పేర్కొన్నారు. ఈ ప్రకారం స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం మాత్రమే వాటా దక్కనుండగా కన్సార్షియానికి 91.3 శాతం వాటా లభిస్తుందని స్పష్టమైంది. వాస్తవానికి కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ సహకరించారు.
మరోవైపు పైసా పెట్టుబడి పెట్టకుండా బాబు బినామీల గుప్పిట్లోని మేనేజ్‌మెంట్ కంపెనీ, సింగపూర్ సంస్థల కన్సార్షియంలు రూ.కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే కనీసంగా రూ.66 వేల కోట్లు కొల్లగొడుతుంటే 54 వేల ఎకరాల (రైతుల నుంచి సమీకరించిన 34 వేల ఎకరాలు, ప్రభుత్వ అ«దీనంలోని 20 వేల ఎకరాలు) రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారో ఊహకు కూడా అందని విషయం.
» స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్షియంకు కట్టబెడుతూ 2017 మే 15న చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుంది. 54 వేల ఎకరాలు మాత్రమే కాదు.. రెండో దశ పేరుతో 14 వేల ఎకరాలను సమీకరించాలని, రాజధాని ప్రాంతంలోని 31 వేల ఎకరాల అటవీ భూమినీ అప్పగించాలంటూ చంద్రబాబు నాడు కేంద్రాన్ని కోరారు.
మేనేజ్‌మెంట్ కంపెనీ పేరిట...
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీలతో ఏర్పాటయ్యే ఏడీపీ చేపడుతుంది. ఇక ప్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు ఓ మేనేజ్‌మెంట్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. సింగపూర్ కంపెనీల ప్రతినిధులు, చంద్రబాబు బినామీలే సభ్యులుగా ఉంటారు. ఎవరికి, ఎంతకు విక్రయించాలనేది మేనేజ్‌మెంట్ కంపెనీ చూస్తుంది. మామూలుగా ప్లాట్లు వేసి అమ్మడంలో ఖర్చు ఎకరాకు రూ.50 లక్షలు మించదు.
కానీ, ఇక్కడ ఎకరాకు రూ.2 కోట్లు చూపించడం గమనార్హం. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3,137 కోట్లు ఖర్చవుతుందన్నది వీరి అంచనా. ఇందులో రూ.1,255.40 కోట్లను ప్రచార ఖర్చులు, కన్సల్టెన్సీ , డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ ఫీజు, వేతనాల కింద మేనేజ్‌మెంట్ కంపెనీ ముసుగులో చంద్రబాబు బినామీలు, సింగపూర్ సంస్థల కన్సార్షియం కొట్టేసేందుకు స్కెచ్ వేశాయి.
వింత వింత నిబంధనలతో...
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు 20 ఏళ్లు అమల్లో ఉంటుంది. ముందుగా ప్రభుత్వం రద్దు చేస్తే కన్సార్షియం పెట్టుబడికి 150 శాతం మేర అపరాధ రుసుం చెల్లించాలి. ఆ సంస్థల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించాలి. కన్సార్షియమే వైదొలగినా కూడా వాటి పెట్టుబడిని 100 శాతం ప్రభుత్వం చెల్లించాలి. బ్యాంకు రుణాలనూ కట్టాలి. పైగా వివాదం తలెత్తితే లండన్ కోర్టులో తేల్చుకోవాలి. అంటే, స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పూర్తిగా సింగపూర్ కన్సార్షియం చేతుల్లో ఉండేలా ప్లాన్ చేశారు.
చెప్పుచేతల్లో ఉండే మేనేజ్‌మెంట్ కంపెనీయే లావాదేవీలను చూస్తుంది కాబట్టి ఎకరం రూ.20 కోట్లకు అమ్మినా అడిగేవారుండరు. ఎకరం రూ.50 కోట్ల చొప్పున 1,070 ఎకరాలను అమ్మి రూ.53,500 కోట్లను చంద్రబాబు అండ్ కో సింగపూర్ సంస్థల కన్సార్షియం సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ వేశాయి. తొలుత 50, రెండో దశలో 200 ఎకరాలను కన్సార్షియంకు ఉచితంగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది.
ఈ 250 ఎకరాలను ఎకరం రూ.50 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.12,500 కోట్ల మేర సొమ్ము చేసుకోవడానికి ఆ సంస్థలు ప్లాన్ వేశాయి. అంటే గరిష్టంగా రూ.లక్ష కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కాజేయడానికి పథకం పన్నాయని స్పష్టమవుతోంది. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే ఈ స్థాయిలో దోచుకుంటే 34 వేల ఎకరాల రాజధానిలో ఇంకే స్థాయిలో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారన్నది అంచనాలకే అందడం లేదు.
కుంభకోణం గుట్టు రట్టవుతుందని...
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌కు... 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావడంతో తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆందోళన చెందింది. దాంతో 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది.