అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాల్కల ధోరణి
2015లోనే రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరణ
ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం53,748 ఎకరాల్లో రాజధానికి ప్రణాళిక
సింగపూర్ కన్సార్షియానికి రూ.28.96 కోట్లు చెల్లించి మాస్టర్ ప్లాన్
ఆ ప్లాన్‌తో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధాని నిర్మిస్తామంటూ గొప్పలు
ఇప్పుడేమో 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని చిన్న మున్సిపాల్టీగా మిగులుతుంది అంటున్న బాబు
రెండో విడతలో 20,494.87 ఎకరాల సమీకరణకు సమాయత్తం
విజనరీనని చెప్పే బాబు నాడే ఈ మాట ఎందుకు చెప్పలేదంటూ రైతుల ఆగ్రహం
రాజధాని ముసుగులో బినామీలు, సన్నిహితులతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారంటూ మండిపాటు
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రీతిలో అత్యద్భుతంగా అమరావతి రాజధానిని నిర్మిస్తానంటూ 2014 నుంచి 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చే వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే నమ్మబలికారు! కానీ ఇప్పుడు 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ వితండ వాదనకు తెరతీశారు. నాడు ఇంటర్నేషనల్ సిటీ అంటూ ప్రగల్భాలు పలికి, ఇప్పుడు మున్సిపాల్టీ అంటూ బీద అరుపులు అరవడమేమిటని మేధావులే కాదు.. రాజధాని రైతులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు నాడే ఈ మాట చెప్పి ఉంటే.. అసలు రాజధానికి భూములు ఇచ్చేవాళ్లమే కాదని రైతులు మండిపడుతున్నారు. భూములిచ్చి 11 ఏళ్లవుతున్నా.. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా ఇప్పుడు రెండో విడత అంటూ 20,494.87 ఎకరాల భూసమీకరణకు అనుమతిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు రగిలిపోతున్నారు. రెండో విడతలో సమీకరించే భూములను ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ పేరుతో తక్కువ ధరకు బినామీలు, సన్నిహితులకు కట్టబెట్టేసి.. ఇప్పటికే తొలి విడతలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి రాజధాని ముసుగులో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని ఆరోపిస్తున్నారు.

మాస్టర్ ప్లాన్ ఉత్తదేనా..?
సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధాని లేని రాష్ట్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తానంటూ 2014లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధాని ఏర్పాటుపై బినామీలు, సన్నిహితులకు లీకులు ఇచ్చి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే భారీ ఎత్తున భూములు కాజేశారు. ఆ తర్వాత రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. అప్పట్లో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించారు.
మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ) రాజధాని నిర్మాణానికి ప్రణాళిక రచించారు. ఆ పరిధిలో రాజధాని నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియం ‘సుర్బానా–జురాంగ్’లకు రూ.28.96 కోట్లు చెల్లించి 2015–16లో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్‌తో ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో రాష్ట్రానికి అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ నాడు చంద్రబాబు నమ్మబలికారు. మన ఇంజనీర్ల మాస్టర్ ప్లాన్‌తో నిర్మిస్తే అవి మురికివాడలుగా మారుతాయంటూ మన రాష్ట్ర, దేశ ఇంజనీర్లను అప్పట్లో అవమానించారు.
సింగపూర్ మాస్టర్ ప్లాన్‌తో 53,748 ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు 2014 నుంచి చెబుతూ వచ్చారు. తాజాగా 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది అంటూ కాడి పారేశారు! అంటే.. మరి సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఉత్తదేనా..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు రాజధాని విషయంలోనూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ దాగుడుమూతలాడుతున్నారని మండిపడుతున్నారు.
రియల్ ఎస్టేట్‌కు రాజధాని ముసుగు..!
ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న 53,748 ఎకరాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, ఇతర అవసరాలు పోనూ ప్రభుత్వం వద్ద ఇంకా 8,274 ఎకరాలు మిగులు భూమి ఉందని 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబే వెల్లడించారు. ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీతోపాటు స్మార్ట్ ఇండస్ట్రీస్‌కు ఆ భూమి సరిపోతుందని నిపుణులు, రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో సమీకరించిన భూముల్లోనే ఇప్పటికీ రాజధాని పనులు ప్రాథమిక దశ దాటలేదని, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు నేటికీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఆ పనులను 2036 నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రభుత్వమే ప్రపంచ బ్యాంకుకు చెబుతోందని పేర్కొంటున్నారు.
రాజధాని నిర్మించడమంటే నగరం నిర్మించడం కాదని.. పరిపాలన భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ బాధ్యతని.. ఆ తర్వాత తనకు తానుగానే నగరంగా రూపుదిద్దుకుంటుందని.. హైదరాబాద్ అందుకు నిదర్శనమని నిపుణులు స్పష్టం చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలు, సన్నిహితులతో కలిసి కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే చంద్రబాబు రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారని విశ్లేషిస్తున్నారు.
ఐఎంజీ భారత్, బిల్లీ రావు తరహా బినామీలను ముందు పెట్టి..
ఉమ్మడి రాష్ట్రంలో 2004లో చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు క్రీడల అభివృద్ధి ముసుగులో ఊరూ పేరులేని ఐఎంజీ భారత్ అనే సంస్థ ముసుగులో బిల్లీరావుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలు, శంషాబాద్‌కు సమీపంలో 450 ఎకరాలు కేటాయించేశారు. అంతేకాదు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో స్టేడియంలు, క్రీడా మైదానాలను బిల్లీరావుకు 45 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేసి వాటి నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు.
కానీ.. నాడు చంద్రబాబు భూకుంభకోణానికి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చెక్ పడింది. ఇప్పుడు అదే రీతిలో అమరావతిలో మరో భూకుంభకోణానికి తెరతీశారనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. రాజధాని తొలి విడత, రెండో విడతలో సమీకరించే భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పేరుతో 5 వేల ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 2,500 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు పేరుతో మరో 2,500 ఎకరాలను బిల్లీరావు లాంటి సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


