వాహనాల ఫిట్‌నెస్ చార్జీలు భారీగా పెంచిన బాబు సర్కారు
సాక్షి, అమరావతి: రవాణా రంగంపై ప్రభుత్వం పెను ఆర్థికభారాన్ని మోపింది. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) చార్జీలను భారీగా పెంచింది. వాహనాల జీవిత కాలాన్ని ఆధారంగా చేసుకుని భారీగా చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ చార్జీలను యథాతథంగా అమలు చేయకుండా రాయితీలు ప్రకటించేందుకు అవకాశం ఉన్నా సరే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించనే లేదు. తద్వారా రవాణా రంగం నిర్వహణ వ్యయం పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరుగుతాయనే సంకేతాలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇంత భారీ పెరుగుదల ఇదే తొలిసారి
వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు వాహనాల ఎఫ్‌సీ కోసం రూ.1,340 చార్జీగా ఉండేది. కాగా ప్రస్తుతం వాహనాల జీవితకాలాన్ని ఆధారంగా చేసుకుని టెస్టింగ్ ఫీజు, సర్టిఫికెట్ చార్జీ, జీఎస్టీ కలిపి భారీగా పెంచుతూ వాహన యజమానులపై పెను ఆర్థిక భారాన్ని మోపారు.

కేటగిరీలుగా విభజించి మరీ బాదుడు
సరుకు రవాణా వాహనాలను కేటగిరీలుగా విభజించి మరీ బాబు సర్కారు బాదుడుకు పూనుకోవడం విస్మయపరుస్తోంది. ఎంజీవీ, హెచ్‌ఎంవీ వాహనాలను ఐదు విభాగాలుగా చేసి చార్జీలు వడ్డించారు. గతంలో రవాణా శాఖ అధికారులు వాహనాన్ని పరీక్షించి ఎఫ్‌సీ జారీ చేసేవారు. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఈ సంస్థలు ఎఫ్‌సీ జారీకి అనధికారికంగా మరి కొంత అధికంగా వసూలు చేస్తున్నాయి. దీంతో రవాణా రంగంపై భారం మరింత పెరగనుంది. ఇది నిత్యావసరాల పెరుగుదలకు దారితీయనుంది. ఇప్పటికే కూరగాయల నుంచి అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు తాజా నిర్ణయం సామాన్యులను కలవరపాటుకు గురిచేస్తోంది.


