breaking news
Vehicle Fitness
-
Telangana: ‘ఫిట్నెస్’ పెనాల్టీ మినహాయింపు.. వాహన యజమానులకు భారీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: రవాణా వాహన యజమానులకు పెద్ద ఊరట. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుము విధింపు నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రెండు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది. దాదాపు మూడునాలుగేళ్లుగా వారు వాహనాలకు ఫిట్నెస్ రెన్యువల్ చేయించటం లేదు. దీంతో ఒక్కో వాహనానికి రూ.30 వేల నుంచి రూ. 70 వేల వరకు పెనాల్టీలు పేరుకుపోయాయి. కొన్ని వాహ నాలకు ఏడేళ్లుగా కూడా ఫిట్నెస్ రెన్యువల్ లేకపోవటంతో రూ.లక్షకుపైగా పెనాల్టీలున్నాయి. దీంతో రోడ్డెక్కితే పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందనే భయంతో వేల సంఖ్యలో వాహనాలను వాటి యజమానులు ఇళ్లకే పరిమితం చేశారు. ఫలితంగా వాటి రూపంలో ఆదాయం రాక ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఫిట్నెస్ గడువు తీరిన వాహనాలపై పెనాల్టీ లేకుండా మినహాయింపు ఇచ్చింది. కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, 2020 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2021 వరకు పెనాల్టీ నుంచి మినహాయింపు వెసులుబాటును కేంద్రమే కల్పించింది. దాన్ని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం, రోజుకు రూ.50 పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రూ.650 కోట్ల బకాయిలు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర సరుకు రవాణా వాహనాలు.. ఇలా అన్ని రకాల రవాణా వాహనాల యజమానులు చాలాకాలంగా ఫిట్నెస్ రెన్యువల్ చేయించడం లేదు. వాటికి నిబంధన ప్రకారం రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధిస్తే రవాణా శాఖకు రూ.650 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా. ఇప్పుడు ఈ పెనాల్టీ నుంచి మినహాయింపునివ్వడంతో అంతమేర ఆయా వాహనాల యజమానులకు వెసులుబాటు కలగగా, రవాణాశాఖ అంతమేర ఆదాయం కోల్పోయినట్టయింది. ఇక మళ్లీ రోడ్లపై ఆటోలు, క్యాబ్‌ల సందడి ఈ పెనాల్టీ బకాయిలకు భయపడి వాటి యజమానులు ఆ వాహనాలను ఇళ్ల వద్దనే ఉంచేశారు. ఫలితంగా కొంతకాలంగా రోడ్లపై ఆటోలు, క్యాబ్‌ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 35 వేల నుంచి 40 వేల ఆటోలు, 50 వేల క్యాబ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. కోవిడ్ సంక్షోభంతో మరో 30 వేల దాకా మాయమయ్యాయి. వెరసి లక్షకు పైగా ఆటోలు, క్యాబ్‌లు లేకపోయేసరికి నగరంలో క్యాబ్ బుక్ చేస్తే గతంలోలాగా వెంటనే వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ వాహనాలు తిరిగి రోడ్డెక్కే అవకాశం ఉంది. ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా.. రవాణా శాఖ నిఘా లేకపోవటాన్ని రవాణా వాహన యజమానులు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకున్నా పట్టుకునేవారే లేకపోవడంతో కొన్నేళ్లుగా వారు దానిమీద దృష్టిపెట్టడం లేదు. ఏడాదికి రూ.735 ఫీజు చెల్లిస్తే సరిపోయే ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్‌ను పట్టించుకోవటం లేదు. వాహనాలు ఫిట్నెస్ తప్పి తీవ్ర వాయు కాలుష్యానికి కారణమవుతున్నా రవాణాశాఖ పట్టించుకోవటం లేదు. ఇది వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతోనే, వాహన యజమానుల్లో భయం వచ్చేలా రోజుకు రూ.50 పెనాల్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ భయంతో మిగతా వాహనాల యజమానులు ఠంఛన్‌గా ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పెనాల్టీ నుంచి మినహాయింపు ఇవ్వడంతో రవాణా వాహన యజమానుల్లో మళ్లీ నిర్లక్ష్యం వస్తుందన్న మాట వినిపిస్తోంది. దీన్ని నివారించాలంటే రవాణాశాఖ కఠినంగా ఉండాలని సీనియర్ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. -
ప్రాణాలతో చెలగాటం
డ్రైవింగ్‌పై అలసత్వమే ప్రమాదాలకు కారణం త్వరగా గమ్యం చేరాలన్నదే అందరి ఆత్రుత డ్రైవర్‌కు తగిన నిద్ర లేకున్నా పట్టించుకోరు వాహనం ఫిట్నెస్పైనా తగిన శ్రద్ధ పెట్టరు విహార యాత్రలకు వెళ్లాలి. బిలబిలమంటూ బంధుమిత్రులతో బయలుదేరారు. ఓ బస్సు బుక్ చేసుకున్నారు. ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన వారి ప్రయాణంలో అపశ్రుతి.. వాహనం కండిషన్లో లేకపోవడంతో ప్రమాదానికి లోనైంది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అర్జెంటు పని తగిలింది. తెల్లారేసరికి ఊరు చేరాలి. డ్రైవర్‌ను ఆగమేఘాల మీద బయల్దేరదీశారు. సరిగా నిద్ర ఉందా లేదా అని పట్టించుకోలేదు. మరో అరగంటలో గమ్యం చేరుతారనగా డ్రైవర్‌కు చిన్నగా నిద్ర తూగింది. పెద్ద ప్రమాదమే జరిగింది. కుటుంబం మొత్తం బుగ్గిపాలైంది. వార్తా పత్రికలను తిరగేస్తే చాలు. నిత్యం ఇలాంటి దుర్ఘటనలు కోకొల్లలు. ఎవరికి వారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటివేవీ లేకపోవడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాటిచెట్లపాలెం(విశాఖ): హెల్మెట్ పెట్టుకోమంటే భారంగా భావిస్తారు. కారులో సీట్ బెల్ట్ పెట్టుకోమంటే చాదస్తమంటారు. ప్రజలు ప్రమాదాలంటే బేఫికర్‌గా ఉన్నారు. మృత్యువు తమ దాకా రాదన్న ధీమా.. ప్రమాదాలను తప్పించుకోగలమన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం.. కానీ జరగాల్సిన దారుణాలు జరిగిపోతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తీర్థయాత్రలకు వెళ్లి వస్తూ ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి వాహనం బోల్తా పడి అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన 22మంది మృత్యువాత పడ్డారు. ఆ దుర్ఘటనను మరచిపోకముందే గోదావరి పుష్కరాలకు వెళ్లి వస్తూ ప్రమాదాలకు లోనైన వాహనాలెన్నో.. గాల్లో కలిసిన ప్రాణాలెన్నో.. లెక్కేలేదు. డ్రైవర్ గోడు ఎవరూ పట్టించుకోరు.. ప్రయాణం భద్రంగా సాగడంలో వాహనచోదకుడి పాత్ర అత్యంత కీలకం. అతని సాధకబాధకాలను పట్టించుకుంటేనే పయనం సజావుగా సాగుతుంది.నిరంతరం డ్రైవింగ్ చేసేవారు తరచూ కంటి చూపు, సుగర్, రక్తపోటు స్థాయులను పరీక్షించుకుంటూ ఉండాలి.వెనుక సరైన సపోర్ట్ లేకపోయినా, కూర్చున్న సీట్ సక్రమంగా ఎడ్జెస్ట్ కాకపోయినా వెన్ను, నడుం భాగాలపై ఒత్తిడి పడుతుంది.170 సెంటీమీటర్లకంటే తక్కువ ఎత్తు ఉన్నవారు, 180 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారు.. తాము డ్రైవ్ చేసే వాహనాన్ని సరిగా ఎంపిక చేసుకోవాలి.{yైవింగ్ సీటులో ఉన్నవారు సెల్‌ఫోన్ సంగతి మరచిపోవాలి. అర్జంట్ అయితే తప్ప ఫోన్ కాల్‌కు బదులు ఇవ్వరాదు. వాహనం నడపడంలో కళ్లకే ఎక్కువ శ్రమ ఉంటుంది. నిద్ర సరిగా ఉంటేనే కళ్లు ఫ్రెష్‌గా ఉండి.. సూదంటు రాయిలా పనిచేస్తాయి.మద్యం తాగి డ్రైవ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదు. ట్రావెల్స్‌లో ప్రయాణించే ప్రజలు, ప్రైవేటు వాహనాలు నడిపేవారి కుటుంబ సభ్యులు వారిని నిలువరించాలి. రోడ్డుపై నిలిపిన వాహనాలే చాలా ప్రమాదాలకు కారణం. అందుకోసం స్థలం కేటాయించినా చాలామంది అడ్డంగా నిలిపివేస్తున్నారు. అధికారులు వారిని నిరోధించాలి. ఎవరికి వారు అలా వాహనాలు నిలపకుండా జాగ్రత్త వహించాలి.