తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘ఫిట్‌నెస్‌’ పెనాల్టీ మినహాయింపు.. ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా..?

Telangana Govt Order Vehicle Fitness Renewal Late Fee Penalty Exemption - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రవాణా వాహన యజమానులకు పెద్ద ఊరట. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ గడువు తీరిపోతే రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుము విధింపు నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రెండు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది. దాదాపు మూడునాలుగేళ్లుగా వారు వాహనాలకు ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ చేయించటం లేదు. దీంతో ఒక్కో వాహనానికి రూ.30 వేల నుంచి రూ. 70 వేల వరకు పెనాల్టీలు పేరుకుపోయాయి. కొన్ని వాహ నాలకు ఏడేళ్లుగా కూడా ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ లేకపోవటంతో రూ.లక్షకుపైగా పెనాల్టీలున్నాయి.

దీంతో రోడ్డెక్కితే పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందనే భయంతో వేల సంఖ్యలో వాహనాలను వాటి యజమానులు ఇళ్లకే పరిమితం చేశారు. ఫలితంగా వాటి రూపంలో ఆదాయం రాక ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఫిట్‌నెస్‌ గడువు తీరిన వాహనాలపై పెనాల్టీ లేకుండా మినహాయింపు ఇచ్చింది. కోవిడ్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, 2020 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ 2021 వరకు పెనాల్టీ నుంచి మినహాయింపు వెసులుబాటును కేంద్రమే కల్పించింది. దాన్ని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం, రోజుకు రూ.50 పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దాదాపు రూ.650 కోట్ల బకాయిలు
ఆటోలు, క్యాబ్‌లు, ఇతర సరుకు రవాణా వాహనాలు.. ఇలా అన్ని రకాల రవాణా వాహనాల యజమానులు చాలాకాలంగా ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ చేయించడం లేదు. వాటికి నిబంధన ప్రకారం రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధిస్తే రవాణా శాఖకు రూ.650 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా. ఇప్పుడు ఈ పెనాల్టీ నుంచి మినహాయింపునివ్వడంతో అంతమేర ఆయా వాహనాల యజమానులకు వెసులుబాటు కలగగా, రవాణాశాఖ అంతమేర ఆదాయం కోల్పోయినట్టయింది.

ఇక మళ్లీ రోడ్లపై ఆటోలు, క్యాబ్‌ల సందడి
ఈ పెనాల్టీ బకాయిలకు భయపడి వాటి యజమానులు ఆ వాహనాలను ఇళ్ల వద్దనే ఉంచేశారు. ఫలితంగా కొంతకాలంగా రోడ్లపై ఆటోలు, క్యాబ్‌ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 35 వేల నుంచి 40 వేల ఆటోలు, 50 వేల క్యాబ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. కోవిడ్‌ సంక్షోభంతో మరో 30 వేల దాకా మాయమయ్యాయి. వెరసి లక్షకు పైగా ఆటోలు, క్యాబ్‌లు లేకపోయేసరికి నగరంలో క్యాబ్‌ బుక్‌ చేస్తే గతంలోలాగా వెంటనే వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ వాహనాలు తిరిగి రోడ్డెక్కే అవకాశం ఉంది. 

ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా..
రవాణా శాఖ నిఘా లేకపోవటాన్ని రవాణా వాహన యజమానులు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకున్నా పట్టుకునేవారే లేకపోవడంతో కొన్నేళ్లుగా వారు దానిమీద దృష్టిపెట్టడం లేదు. ఏడాదికి రూ.735 ఫీజు చెల్లిస్తే సరిపోయే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ను పట్టించుకోవటం లేదు. వాహనాలు ఫిట్‌నెస్‌ తప్పి తీవ్ర వాయు కాలుష్యానికి కారణమవుతున్నా రవాణాశాఖ పట్టించుకోవటం లేదు.

ఇది వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతోనే, వాహన యజమానుల్లో భయం వచ్చేలా రోజుకు రూ.50 పెనాల్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ భయంతో మిగతా వాహనాల యజమానులు ఠంఛన్‌గా ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పెనాల్టీ నుంచి మినహాయింపు ఇవ్వడంతో రవాణా వాహన యజమానుల్లో మళ్లీ నిర్లక్ష్యం వస్తుందన్న మాట వినిపిస్తోంది. దీన్ని నివారించాలంటే రవాణాశాఖ కఠినంగా ఉండాలని సీనియర్‌ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top