బాత్రూంలో వీడియో తీయించిందంటూ బాలికల ఆరోపణ
హాస్టల్‌లో బాలికల మధ్య ఘర్షణ
మార్టూరు: స్థానిక ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహంలో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలికల మధ్య జరిగిన ఘర్షణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. బాధిత బాలికల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి భోజనాల సమయంలో బాలికల మధ్య వివాదం ప్రారంభమైంది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లను తోటి బాలికలు కొట్టారు. వారు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారి సూచన మేరకు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు బయటకు వెళ్లారు. ఇదంతా హాస్టల్ వాచ్ ఉమెన్ నాగమణి ముందే జరగడం గమనార్హం.
బాలికలు, హాస్టల్ పరిసరాల స్థానికుల వివరాల ప్రకారం.. వాచ్ ఉమెన్ నాగమణి హాస్టల్ బాలికలతో రోజూ రాత్రి 10 గంటల వరకు సమీపంలోనే ఉన్న తన ఇంట్లో పనులు చేయించుకుంటోంది. బాధితులైన అక్కాచెల్లెళ్లు ఆమె ఇంటి పని చేసేందుకు ససేమిరా అంటూ వెళ్లేవారు కాదు. ఈ క్రమంలో ఇటీవల అక్కా చెల్లెళ్లలో ఇద్దరిలో చెల్లెలు బాత్రూంలో స్నానం చేస్తుండగా అదే హాస్టల్‌కు చెందిన మరో బాలికతో వాచ్ ఉమెన్ వీడియో తీయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయం వసతి గృహంలోని బాలికల ద్వారా హాస్టల్ ఇన్‌చార్జి వార్డెన్ రాజేశ్వరి దృష్టికి వెళ్లడంతో ఆ వీడియోను బాధిత బాలిక అక్క స్వయంగా డిలీట్ చేసినట్లు తెలిపింది. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అక్కా చెల్లెళ్లను హాస్టల్ లోపలకు రాకుండా ఇంటికి వెళ్లాలని వాచ్ ఉమెన్ కోడలు హాస్టల్ బయటే నిలబెట్టడం గమనార్హం. హాస్టల్లో జరుగుతున్న గొడవ విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి వార్డెన్ రాజేశ్వరి అద్దంకి నుంచి మార్టూరు బయల్దేరినట్లు సమాచారం.


