ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో మాట్లాడుతున్న వైద్య విద్యార్థి తండ్రి
ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి
పులివెందుల: వైద్య విద్యార్థులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, వైద్యరంగాన్ని నిర్విర్యం చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆయన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఆ సభ్యుల్లో ఒకరైన పులివెందులకు చెందిన గాజుల జయప్రకాష్ ఎంపీతో మాట్లాడుతూ తన కుమారుడు చరణ్‌సాయికి నీట్‌లో 470 మార్కులు వచ్చాయని తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో 471 మార్కుల కటాఫ్ కారణంగా ఒక్క మార్కు తేడాతో తన కుమారుడు వైద్యసీటు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారితో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పులివెందుల మెడికల్ కళాశాలకు ఎన్‌ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దని లేఖ రాశారని చెప్పారు. పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లను కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కోల్పోయామన్నారు. ఈ రెండు కళాశాలలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే చరణ్‌సాయి వంటి విద్యార్థులకు మెడికల్ సీట్లు లభించేవని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.


