కొత్త వైద్య కళాశాలల్లో ఈ విధానం వర్తింపునకు కసరత్తు
వైద్య విద్య ఆశావహులను నమ్మించి మోసంచేస్తున్న బాబు సర్కార్
సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం ఎత్తేస్తామనే హామీతో గద్దెనెక్కిన ప్రభుత్వం
ప్రభుత్వం వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆరి్థకంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం. – 2023 అక్టోబర్ నాలుగో తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు
సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వమే ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దారుణం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లను అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లో జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు సీట్లను అందేలా చూస్తాను.
– 2023 ఆగస్టు 16న నారా లోకేశ్ యువతకు ఇచ్చిన హామీ
సాక్షి, అమరావతి: కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామనే హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు యువతకు మరోవెన్నుపోటు పొడిచారు. రేవు దాటక తెప్పతగలేసినట్టు.. యువతకు ఇచ్చిన హామీకి తిలోదకాలు ఇచ్చేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాల ల ఏర్పాటులో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను వైఎస్ జగన్ సర్కార్ ప్రారంభించింది.
ఈ కళాశాలలకు మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థీíÙయా, గైనిక్ విభాగాల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మంజూరు చేసింది. కొత్త కళాశాలలకు ఈ విద్యా సంవత్సరం సీట్లు మంజూరైన క్రమంలో ఫీజులు, సీట్ల భర్తీపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీజీ సీట్లకు సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
అడుగడుగూ అబద్ధమే..!
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త వైద్య కళాశాలలను నిర్వహించడం, వాటిని స్వయం సమృద్ధిగా మార్చడం అన్న లక్ష్యంతో గత ప్రభుత్వంలో ఎంబీబీఎస్ కోర్సులకు మాత్రమే కొన్ని సీట్లకు సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నాడు టీడీపీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. ఆందోళనలు చేసింది. తాము గద్దెనెక్కగానే సెల్ఫ్‌ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేసేస్తామని వైద్య విద్యా ఆశావహులకు నమ్మబలికారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోగా, పీజీ సీట్లకు కూడా అదే విధానాన్ని వర్తింపజేస్తుండటం గమనార్హం.
సీట్ల భర్తీ తీరిది...!
పీజీ అడ్మిషన్‌లలో ప్రభుత్వ కళాశాలల్లోని సగం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సగం సీట్లు రాష్ట్ర కోటా కింద కన్వీనర్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర కోటాలోని 50 శాతం సీట్లను కనీ్వనర్ కోటా కింద భర్తీ చేసి, మిగిలిన 50 శాతంలో 35 శాతం సెల్ఫ్‌ఫైనాన్స్, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
విద్యార్థుల తెల్లకోటు కల ఛిద్రం
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కొత్త కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం ఎత్తేయకపోగా, ఏకంగా 10 కళాశాలలను బాబు సర్కార్ ప్రైవేట్‌కు దారాదత్తం చేసేస్తున్న విషయం తెలిసిందే. కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం మంజూరైన పులివెందుల వైద్య కళాశాల 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా కుట్రపూరితంగా రద్దు చేయించారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రణాళిక ప్రకారం 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో వైద్య కళాశాలలు ప్రారంభం అవ్వకుండా ఉద్దేశపూర్వకంగా మోకాలడ్డి రెండేళ్లలో 2,450 మంది విద్యార్థుల తెల్లకోటు కలను ఛిద్రం చేశారు. కళాశాలలు ప్రైవేట్‌పరం చేస్తుండటంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమానికి ప్రజా, విద్యార్థి సంఘాలు, మెధావులు, సాధారణ ప్రజలు మద్దతుగా నిలిచారు.


