ప్రైవేటీకరణ మత్తులో చంద్రబాబు: సీపీఎం మధు | Cpm Madhu Fires On Chandrababu Over Privatization | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణ మత్తులో చంద్రబాబు: సీపీఎం మధు

Nov 24 2025 11:37 PM | Updated on Nov 24 2025 11:38 PM

Cpm Madhu Fires On Chandrababu Over Privatization

సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రైవేటీకరణ మత్తులో జోగుతున్నారని సీపీఎం మాజీ పార్లమెంట్ సభ్యులు పెనుమల్లి మధు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి యశోదానగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 66,350 కోట్ల ఖర్చుతో అమరావతి నగరాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. పట్టణ ప్రాంతాలలో రోడ్లు, మంచినీరు, పారిశుధ్యం, విద్యుత్తు తదితర ప్రజా సౌకర్యాలు అన్నింటిని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పుతూ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

రూ.6400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆపేసి 60 డిగ్రీ కాలేజీలు మూతపడ్డానికి చంద్రబాబు ప్రభుత్వం కారణమైంది. మరిన్ని కాలేజీలు మూసివేతకు సిద్ధమైన పరిస్థితి నెలకొంది.. ఈ కారణంగా 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో 100 రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని ప్రకటన చేసిన లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించారు. బకాయిలు చెల్లించమని విద్యాసంస్థల యాజమాన్యాలు అడిగినందుకు వారిని బెదిరించడం ఎంతవరకు సమంజసం? అంటూ మధు నిలదీశారు.

ఆరోగ్యశ్రీ పథకానికి రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టారని ఈ కారణంగా ఆసుపత్రులు 1300 రకాల జబ్బులకు వైద్యం చేయలేమని తీర్మానించిన విషయాన్ని మధు గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతను చంద్రబాబు సమర్థించటం ఎవరి ప్రయోజనాలకంటూ ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ కార్మికులను సోమరిపోతులు, అవినీతిపరులంటూ అవమానించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ రంగంలోని స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు నడుం కట్టాల్సిన ముఖ్యమంత్రి.. పక్కనే మరో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నించడమే కాకుండా తన మంత్రులను ఎంపీలను ప్రారంభం కానీ పరిశ్రమకు గనులు కేటాయించమని వినతి పత్రాలు ఇస్తూ కేంద్ర మంత్రుల వెంట తిరుగుతున్న వైనాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బీజేపీతో అంట కాగుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ప్రజలు తిప్పికొట్టకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని మధు అన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ వామపక్షాలు మాత్రమే ప్రత్యామ్నాయమని మిగిలిన బూర్జువా పార్టీలు బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని వారి తోకలుగా మారిపోయాయని ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు.

తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులకు రక్షణ కల్పించాలి
తిరుపతి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయని ఉదయం పూట ఒక్కసారిగా రైళ్లు వస్తున్న సందర్భాల్లో వేలాదిమంది భక్తులు బయటికి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట జరుగుతుందన్నారు. ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా కాంట్రాక్టర్ వేడుక చూస్తున్నారన దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాను లేఖలు రాస్తానని.. తక్షణం తొక్కిసలాట నివారణకు తగిన జాగ్రత్తలను రైల్వే యాజమాన్యాలు తీసుకోవాలని మధు సూచించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నేతలు కందారపు మురళి, వందవాసి నాగరాజు కందారపు మురళి టి సుబ్రహ్మణ్యం ఎస్ జయచంద్రలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement