మెమోకు, జీవోకు తేడా తెలియని మంత్రి
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజం
సాక్షి, అమరావతి: మెమోకు, జీవోకు తేడా తెలియని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.. శెట్టిబలిజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాల కృష్ణ తేల్చి చెప్పారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెంబరు 16 తోపాటు శెట్టి బలిజలకు ఎవరేం చేశారన్న దానిపై కుల పెద్దలు, మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరితే.. మంత్రి ఎందుకు తోక ముడిచారని నిలదీశారు.
చంద్రబాబు హయాంలో 1997లోనే జీవో నంబరు 16 విడుదల కాగా.. దాన్ని ఏ ప్రభుత్వాలూ అమలు చేయలేదని, తిరిగి కూటమి ప్రభుత్వం హయాంలో 2025 జూలై 30 నుంచి శెట్టిబలిజ సరి్టఫికెట్‌లో గౌడ అని చేర్చి అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. దాన్ని కప్పిపుచ్చిన మంత్రి.. వైఎస్సార్‌సీపీపై దు్రష్పచారం చేయడాన్ని తప్పుపట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆ నిర్ణయం తీసుకుంటే తాను క్షమాపణలు చెబుతానన్న చెల్లుబోయిన వేణు.. కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినట్లు తేలితే క్షమాపణలు చెప్తారా అని మంత్రిని నిలదీశారు. వేణు ఇంకా ఏమన్నారంటే..
మంత్రి నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి
‘‘రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇటీవల వనభోజనాల్లో వైఎస్సార్‌సీపీపైనా, నా పైన చేసిన ఆరోపణల మీద చర్చకు నేను సిద్ధమని ప్రకటిస్తే.. ఆయన పత్రికా ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. నాపై చేసిన ఆరోపణలు నిజమని మంత్రి నిరూపిస్తే శెట్టిబలిజ సామాజిక వర్గానికి క్షమాపణ చెబుతాను. నిరూపించలేకపోతే మంత్రి నాకు, శెట్టిబలిజ జాతికి క్షమాపణ చెప్పాలి. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం మంత్రికి అలవాటు.’’ అని చెల్లుబోయిన ధ్వజమెత్తారు.
మంత్రి చర్చకు రావాలి
మంత్రి సుభాష్ శెట్టిబలిజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఆయన ఘనకార్యం వల్లే సామాజిక ధ్రువీకరణ పత్రాల్లో బ్రాకెట్లో శెట్టిబలిజకు ముందు గౌడ అని పేర్కొంటున్నారు. దీనిపై నేను చర్చకు సిద్ధం. చర్చకొస్తే ఈ విధానం అమలుకు కారకులెవరో తేలిపోతుంది. కుల పెద్దలు, మీడియాను న్యాయనిర్ణేతలుగా పెట్టి చర్చిద్దాం. శెట్టిబలిజలను మంత్రి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతున్నారు. గతంలో మంత్రి మీద కేసులు ఎత్తివేయించిందే నేను. ఇంతవరకు ఓపిక పట్టాను. ఇక సహించేది లేదు. రామచంద్రాపురం నియోజకవర్గంలో శెట్టిబలిజలకు ఎవరేం మేలు చేశారో బహిరంగంగా చర్చిద్దాం. జీవోకి, మెమోకి తేడా తెలియని మంత్రులను కేబినెట్‌లో పెట్టుకుంటే ఇంతకంటే ఏం ఆశించలేం. ఇంకోసారి నాపై మంత్రి అవాకులుచెవాకులు పేలితే సహించేది లేదు’’ అంటూ చెల్లుబోయిన హెచ్చరించారు.


