హద్దూ‘పొద్దూ’ లేకుండా ఇసుక అక్రమ రవాణా | TDP Leaders illegal Sand Smuggling from AP to Telangana | Sakshi
Sakshi News home page

హద్దూ‘పొద్దూ’ లేకుండా ఇసుక అక్రమ రవాణా

Nov 25 2025 4:33 AM | Updated on Nov 25 2025 4:33 AM

TDP Leaders illegal Sand Smuggling from AP to Telangana

ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తూ వాడపల్లి చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన ఇసుక అక్రమ రవాణా లారీలు

యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక వాహనాలు

చెక్‌పోస్టులు దాటిస్తున్న టీడీపీ కూటమి నేతలు  

అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా రూట్‌ 

ఆఫీసర్లుగా మారి రెచ్చిపోతున్న వైనం 

పట్టించుకోని అధికార యంత్రాంగం.. 

ఉమ్మడి గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.కోట్లు దండుకుంటున్న తమ్ముళ్లు  

ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతోంది. టీడీపీ కూటమి నేతలే ప్రత్యేక ఏజెంట్లుగా, రూట్‌ ఆఫీసర్లుగా అవతారమెత్తి ఇసుక లారీలను చెక్‌పోస్టులు దాటిస్తున్నారు. రూ.కోట్లు దండుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది.

సాక్షి, నరసరావుపేట/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని రూ.కోట్లు సంపాదిస్తు­న్నారు. నిత్యం ఇసుక లారీలను పల్నాడు జిల్లా సరిహద్దుల మీదుగా చెక్‌పోస్టులను దాటించి తెలంగా­ణ రాష్ట్రానికి తరలిస్తున్నారు. రూ.కోట్లు దండుకు­ంటున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఇష్టారాజ్య­­ంగా ఇసుక తరలిస్తున్నా.. జిల్లాలోని మైనింగ్, విజి­లె­న్స్, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. అధి­­­కారపార్టీ నేతలు ఇస్తున్న మామూళ్లకు అలవాటుపడి మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు ఉ­న్నా­యి.   

ఏపీ చెక్‌పోస్టులలో రైట్‌.. రైట్‌ 
గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను లారీల్లోకి లోడ్‌ చేస్తున్నారు. సాధారణంగా లారీకి 18–22 టన్నుల ఇసుకను రవాణా చేస్తారు. అయితే హైదరాబాద్, నల్లగొండ, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు అక్రమంగా వెళ్తున్న లారీలలో ఏకంగా 40 టన్నుల వరకు ఇసుక లోడ్‌ చేస్తున్నారు.  ఇసుక రీచ్‌ ఉన్న స్థానిక అధికారపార్టీ నేతలకు లారీకి రూ.10 వేల దాకా ముట్టజెబుతున్నారు. లారీలు అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల మీదుగా రాత్రి పూట పల్నాడు జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులైన పొందుగల, తంగెడల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ చెక్‌పోస్టుల మీదుగా ఇసుక లారీలు వెళ్తున్నా పట్టుకుంటున్న దాఖలాలు లేవు. ఒక్కో లారీ సరిహద్దు దాటేందుకు స్థానిక పోలీసులు, చెక్‌పోస్టుకు రూ.7 వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం.  

తెలంగాణ చెక్‌పోస్టులలో చెక్‌ 
ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న ఇసుక లారీలను తెలంగాణ చెక్‌పోస్టుల వద్ద లారీలను పట్టుకుంటున్నా.. టీడీపీ నేతలు బేరసారాలు సాగిస్తున్నారు. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్టు నుంచి దర్జాగా వెళ్లిన అక్రమ ఇసుక లారీలను  వందల మీటర్ల దూరంలో కృష్ణానది అవతల ఉన్న తెలంగాణ పరిధిలోని వాడపల్లి చెక్‌పోస్టులో అక్కడి అధికారులు పట్టుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీల మధ్య ఏకంగా ఏడు లారీలను వాడపల్లి చెక్‌పోస్టులో పట్టుకొని కేసులు నమోదు చేశామని వాడపల్లి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే టీడీపీ నేతలు రంగంలోకి దిగి బేరసారాలు ఆడుతున్నట్టు సమాచారం.

చెక్‌పోస్టు దాటించేందుకు ఏజెంట్లు
ఇసుక రీచ్‌ మొదలు నల్లగొండ వరకు వయా పల్నాడు జిల్లాలో ప్రయాణిస్తున్న లారీలను ఏ చెక్‌­పోస్టులోనూ అడ్డుకోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పనిచేస్తున్నారు. వీరి పని ఇసుక లారీలను అంతరాష్ట్ర సరిహద్దు దాటించేవరకు వీరు రూట్‌ ఆఫీసర్లుగా పనిచేస్తారు. పోలీసులతో సన్నిహితంగా ఉంటూ వారికి నెల వారీ మా­మూళ్లు అప్పగించి లారీలను ఆపకుండా చూడటం ఈ ఏజెంట్‌ పని. స్థానిక టీడీపీ నేతలు ఏజెంట్లుగా పనిచేసి నెలకు రూ.లక్షలు 
సంపాదిస్తున్నారు.

గోదావరి పరీవాహకం నుంచీ..
గోదావరి పరీవాహకం నుంచి కూడా ఇసుక తెలంగాణకు యథేచ్ఛగా తరలిపోతోంది. తెలంగాణలో తరచూ కేసులు నమోదు చేస్తున్నా దందా ఆగడం లేదు. ఉమ్మడి పశ్చిమగోదావరిలోని ఏజెన్సీకి ఓ కూటమి ప్రజాప్రతినిధి అనుచరులే ఈ దందా నిర్వహిస్తున్నారు. వీరు మూడు జిల్లాలు, రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు దాటించి మరీ ఇసుక లారీలను తెలంగాణకు తరలిస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, అంతకు ముందు సత్తుపల్లి 
పోలీసులు లారీలను ఆపి కేసులు నమోదు చేయడం గమనార్హం.

కొవ్వూరు నుంచి అనధికారికంగా..
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇసుక ర్యాంపులు పూర్తిగా మూతపడ్డాయి.  తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతం నుంచి ఇసుకను అనధికారికంగా తీసుకువచ్చి కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీకి చెందిన ఓ కూటమి ప్రజాప్రతినిధి అనుచరులు మరో అడుగు ముందుకేసి  సొంత టిప్పర్లతో ఇసుకను సులువుగా సరిహద్దులు దాటిస్తున్నారు. నిత్యం 30 నుంచి 50 లారీల్లో  ఓవర్‌ లోడ్‌తో ఇసుకను తరలిస్తున్నారు.

ప్రధానంగా ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం మేడిశెట్టివారిపాలెం నుంచి  సరిహద్దు చెక్‌పోస్టు దాటుకుని తెలంగాణ జిల్లాలోని సత్తుపల్లికి, జీలుగుమిల్లి మండలం నుంచి సరిహద్దు చెక్‌పోస్టు దాటి అశ్వారావుపేట మండలానికి తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం 16 టన్నులు లోడింగ్‌ చేసుకుని ఆ మేరకు బిల్లుతో కేవలం జిల్లా పరిధిలోనే సరఫరా చేయాలి. టీడీపీ ఇసుక మాఫియా మాత్రం లారీకి సగటున 35 నుంచి 40 టన్నుల లోడ్‌ చేసుకుని ఎటువంటి వేబిల్లూ లేకుండా తెలంగాణకు తరలించి సగటున రూ.60 వేల నుంచి రూ.80 వేలకు విక్రయిస్తున్నారు.

తెలంగాణలో ఇసుక సీజ్‌
కొవ్వూరు నియోజకవర్గంలోని ప్రక్కిలంకలో ఉన్న ఇసుక ర్యాంపు నుంచి తెలంగాణకు 200కు పైగా లారీల్లో ఇసుకను అక్రమార్కు­లు తరలించారు. మూడు రోజుల క్రితం ప్రక్కి­లంక ర్యాంపు నుంచి గోపాల­పురం, కొయ్య­లగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మీదుగా తెలంగాణలోని అశ్వారావు­పేటలోకి ప్రవేశించిన మూడు లారీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అడ్డుకని 105 టన్నుల ఇసుకను సీజ్‌ చేశారు.

చింతలపూడి మీదుగా సత్తుపల్లికి తరలించి అక్కడి నుంచి ఖమ్మం, మహబూబ్‌నగర్, గద్వాల్‌ జిల్లాలో విక్రయిస్తున్నా­రు. ఈ ఏడాది సెపె్టం­బర్‌ 23న దమ్మపేట మండలం నాగుపల్లిలో ఇదే తరహాలో వాహనాలను సీజ్‌చేసి కేసు­లు నమోదు చేశారు. ఏపీ 39డబ్ల్యూహెచ్‌7666, ఏపీ 13డబ్ల్యూజీ 9666 నంబర్లు గల రెండు టిప్పర్లు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కూటమి ప్రజాప్రతినిధి అనుచరులవే. ఈ రెండు టిప్పర్లలో తరచూ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ రెండు వాహనాలు తరచూ పట్టుబడుతున్నా.. రోజుల వ్యవధిలో మళ్లీ అవే వాహనాల్లో దందా సాగించడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement