గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వివేకా హత్య
నిరాధార ఆరోపణలు మోపి రాజకీయ లబ్ధి కోసం యత్నం
వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణ పూర్తి కాకుండా కుయుక్తులు
సీబీఐ కోర్టులో ప్రతివాదుల వాదనలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమని ప్రతివాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. వివేకా హత్యను కూడా గత ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రంగా ప్రత్యర్థులు వినియోగించుకునే యత్నం చేశారని, సాక్ష్యాలు, ఆధారాలు లేకున్నా ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా పనిచేశారని కోర్టుకు తెలియజేశారు. ఆమె వెనుక ఉన్న కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేస్తూ.. అసలు దోషులు బయట తిరిగేందుకు తోడ్పడుతున్నారని వివరించారు.
ఇప్పుడు అదే శక్తులు వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణ పూర్తి కాకూడదని కుయుక్తులు పన్నుతున్నారని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఇందులో భాగంగానే సునీత తాజా పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురామ్ సోమవారం ప్రతివాదుల వాదనలు విన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
అంతకుముందు శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది సాయి ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. వాదనల్లో ముఖ్యాంశాలు.. ‘అన్ని అంశాలు పరిశీలించాం, వందల మందిని విచారించాం, కాల్ రికార్డులు, వీడియోలు.. ఇలా అన్నింటిపై దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ చెబుతోంది. అయినా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగించాలని కోరడం సరికాదు. ఇది కేసు విచారణను ఆలస్యం చేయడమే. దాదాపు నాలుగేళ్ల పాటు దర్యాప్తు కొనసాగించినంత కాలం సీబీఐ విచారణపై సునీత నోరు మెదపలేదు.
నిరాధారంగా కొందరిని నిందితులుగా చేర్చడాన్ని ఆమె ‘ఎంజాయ్’చేశారు. చార్జ్‌షీట్, అదనపు చార్జ్‌షీట్ దాఖలు చేసినప్పుడూ తను అనుకున్నట్లే దర్యాప్తు సాగుతోందని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మరికొందరిని చేర్చాలన్న ఉద్దేశంతో పిటిషన్ వేశారు. కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి హత్య చేసింది ఎవరో చెప్పిన తర్వాతా నిందితులకు తోడ్పడేలా ఆమె పిటిషన్లు వేశారు. షేక్ దస్తగిరి (ఏ–4) తానే గొడ్డలితో నరికానని నేరుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి చెప్పినా అరెస్టు చేయలేదు.
క్రిమినల్ కేసుల దర్యాప్తు చరిత్రలో ఓ కరుడుగట్టిన హంతకుడు నేరం ఒప్పుకున్నా అరెస్టు చేయకపోవడం ఇదే తొలిసారి. అతన్ని సమరి్థస్తూ సునీత పలు పిటిషన్లు వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దస్తగిరి యథేచ్ఛగా బయట తిరుగుతున్నా బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయని సునీత ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారి బెయిల్ రద్దుకు పిటిషన్లు వేయడం విస్తుగొలిపే విషయం. సునీత పిటిషన్ సమర్థనీయం కాదు. కొట్టివేయండి’ అని న్యాయవాదులు వాదనలు వినిపించారు.


